తొమ్మిదేళ్లుగా ఎన్నో అవమానాలు..

ABN , First Publish Date - 2023-02-07T01:09:14+05:30 IST

‘బీఆర్‌ఎ్‌సలో తొమ్మిదేళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. ఎందరో బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా, వారిని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసగించింది. ఉద్యోగాలు, ఇళ్లు, ఇళ్లస్థలాలు, పోడు పట్టాలు.. ఇలా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసగించారు’ అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్‌ఎ్‌సపై మండిపడ్డారు.

తొమ్మిదేళ్లుగా ఎన్నో అవమానాలు..
పొంగులేటిని గజమాలతో సత్కరిస్తున్న అభిమానులు

బీఆర్‌ఎస్‌ పాలనలో మోసపోయిన తెలంగాణ ప్రజలు

కాంట్రాక్టుల్లో పెద్ద తలకాయలకు వాటాల గుట్టు విప్పుతా

అశ్వారావుపేట నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అశ్వారావుపేట, పిబ్రవరి 6 : ‘బీఆర్‌ఎ్‌సలో తొమ్మిదేళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. ఎందరో బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా, వారిని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసగించింది. ఉద్యోగాలు, ఇళ్లు, ఇళ్లస్థలాలు, పోడు పట్టాలు.. ఇలా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసగించారు’ అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్‌ఎ్‌సపై మండిపడ్డారు. సోమవారం దమ్మపేట మండలం నెమలిపేటలో జరిగిన ఆత్మీ య సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఇచ్చి న కాంగ్రె్‌సను, సహకరించిన బీజెపీని, పోరాడిన సీపీఐ లాంటి పార్టీలను కూడా పక్కన పెట్టి.. ప్రజలు రాష్ట్ర సాధనకు పోరాడిన బీఆర్‌ఎ్‌సకు పట్టం కట్టారని, కానీ బీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో అంశాలు భ్రమలుగానే మిగిలాయన్నారు. అభివృద్ధి కోసం, కేసీఆర్‌ను నమ్మి వైసీపీలో గెలిచిన తాము అప్పటి టీఆర్‌ఎ్‌సలో చేరామని, కానీ తొమ్మిదేళ్లుగా అనేక అవమానాలకు గురయ్యామన్నారు. ఉపఎన్నికలు వచ్చిన ప్రతీ సారి ఓటర్లను ఆకర్షించేలా కొత్త పథకాలు ప్రకటించడం, ఆ తరువాత వదిలేయటం బీఆర్‌ఎస్‌ నేతలకు పరిపాటిగా మారిందని, తమను నమ్ముకున్నవారికి ఏ మేలు చేయలేకపోవటంతోనే ఆవేదనతోనే పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తనకు రూ.రెండులక్షల కోట్లు కాంట్రాక్టులు ఇచ్చామని కొందరు బీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారని, ఈ విషయంలో పెద్ద నాయకుడు చర్చకొస్తే తానూ సిద్ధంగా ఉన్నానన్నారు. రూ.కోట్ల కాంట్రాక్టులు దొడ్డిదారిన ఎవరిచ్చారో.. అదే దొడ్డిదారిలో ఎన్ని కోట్లు కమీషన్ల రూపంలో దండుకున్నారో త్వరలోనే గుట్టు విప్పుతానన్నారు.

దమ్ముంటే నన్ను సస్పెండ్‌ చేయండి..

భ్రమలు కల్పించేలా ప్రసంగాలు చేయడం, పథకాలు ప్రకటించడం, తరువాత గాలికి వదిలేయడం కేసీఆర్‌ పరిపాటిగా మారిందని, మతాలు, కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన తన పబ్బం గడుపుకొంటున్నారని పొంగులేటి విమర్శించారు. ఆ పార్టీలో ఓస్థాయి కూడాలేని నాయకులు తన వెంట వచ్చిన వారిని బహిష్కరిస్తున్నట్టు ప్రకటిస్తున్నారని, తన వెంట వచ్చేవారిని కాకుండా దమ్ముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని సవాల్‌ విసిరారు. తన అభిమానులు, ఆత్మీయులను ఇబ్బందులు పెడుతున్నారని, పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని.. చక్రవడ్డీ సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. ప్రతీ పంచాయతీలో రెండేళ్లుగా రూ.10లక్షల నుంచి రూ.15లక్షల చొప్పున బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి గురించి అడిగితే కేంద్రం ఇవ్వడం లేదని బొంకుతున్నారని మండిపడ్డారు. ఆ ప్రజాప్రతినిధులు తమ భార్యల మెడల్లో పుస్తెలను తాకట్టు పెట్టి పనులు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యమంత్రులు అంటే ప్రజలకు శాశ్వతంగా గుర్తుండిపోయేవారు ఇద్దరే నని ఒకరు ఎన్టీఆర్‌, మరొకరు వైఎస్సాఆర్‌ అన్నారు. తనను నమ్మిన ప్రజలందరితో మాట్లాడిన తరువాత వారి మధ్యే ఏ పార్టీలోకి వెళతానో ప్రకటిస్తానని, ఊహాగానాలను నమ్మొద్దన్నారు. తన అభ్యర్థులు ప్రతీ నియోకవర్గం నుంచి పోటీలో ఉంటారని, తనకు స్వేచ్ఛ, ప్రాధాన్యమిచ్చే పార్టీ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్‌ కోరం కనకయ్య, డీసీసీబీ మాజీ అధ్యక్షులు మువ్వ విజయ్‌బాబు, తుళ్ళూరి బ్రహ్మయ్య, జారే ఆదినారాయణ, జూపల్లి రమేష్‌, బత్తుల అంజి, పర్సా వెంకటేశ్వరరావు, బోజ్య నాయక్‌, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, పలు మండలాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘన స్వాగతం పలికిన అభిమానులు

పొంగులేటికి అభిమానులు మంగళహారుతులు పట్టి పూలు చల్లి ఘనస్వాగతం పలికారు. గిరిజన నృత్యంతో వేదికపైకి తోడ్కొని వచ్చారు. గజమాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. జారే ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో భద్రాద్రి జడ్పీచైర్మన్‌ కోరం కనకయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్‌ మువ్వా విజయబాబు, డైరక్టర్‌ తుళ్లూరి బ్రహ్మయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, నాయకులు జూపల్లి రమేష్‌, పర్సా వెంకటేశ్వరావు, భోజ్యా నాయక్‌, చంద్రుగొండ ఎంపీపీ బాణోతు పార్వతి, బత్తుల అంజి, అశ్వారావుపేట సర్పంచ్‌ అట్టం రమ్య, నియోజకవర్గంలోని స్థానికసంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని తాము పొంగులేటి వెంటే నడుస్తామంటూ సంఘీభావం తెలిపారు.

‘పేట’ అభ్యర్థిగా జారె ఆదినారాయణ

ఎన్నికలేలక్ష్యంగా పావులు కదుపుతున్న పొంగులేటి ఆదివారం వైరా నియోజకవర్గ అభ్యర్థిగా బాణోతు విజయాబాయిని ప్రకటించారు. సోమవారం జరిగిన అశ్వారావుపేట నియోజకవర్గ ఆత్మీయసమ్మేళనంలో పేట అభ్యర్థిగా జారె ఆదినారాయణను ప్రకటించారు.

Updated Date - 2023-02-07T01:09:17+05:30 IST