సమస్యలు పరిష్కారం కాని సమావేశాలు ఎందుకు..?

ABN , First Publish Date - 2023-01-24T22:44:38+05:30 IST

మూడు నెలలకొకసారి జరిగే సమావేశాలకు పూర్తిస్థాయిలో అధికారులే రారు..వచ్చినా లేవత్తిన సమస్యలు పరిష్కారానికి నోచుకోవు.. అలాంటపుడు అసలు సమావేశలెందుకంటూ పలువురు ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు.

సమస్యలు పరిష్కారం కాని సమావేశాలు ఎందుకు..?
సమావేశానికి హాజరైన వారు

అశ్వారావుపేట రూరల్‌, జనవరి 24: మూడు నెలలకొకసారి జరిగే సమావేశాలకు పూర్తిస్థాయిలో అధికారులే రారు..వచ్చినా లేవత్తిన సమస్యలు పరిష్కారానికి నోచుకోవు.. అలాంటపుడు అసలు సమావేశలెందుకంటూ పలువురు ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్తుశాఖ అధికారులు ఏసీడీ రూపంలో బిల్లులు వసూలు చేస్తూ పేదలను పట్టిపీడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. మండల పరిషత్‌ అధ్యక్షుడు జల్లిపల్లి శ్రీరామమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రజాప్రతినిధులు పలు శాఖల అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. విద్యాశాఖ సమీక్షలో పేరాయిగూడెం పంచాయతీలోని బీసీ కాలనీలో పాఠశాల స్థలం ఆక్రమణకు గురైందని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై గతంలో ఫిర్యాదు చేశామని అయినా చర్యలు లేదన్నారు. దీనిపై విచారణ చేసి చర్యలు చేపడతామని తహసీల్దారు తెలిపారు. ఐటీడీఏ, ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ శాఖలకు సంబంధించి పలు రోడ్లు మంజూరైనట్లు సంబంధిత శాఖల అధికారులు తెలిపారు. కన్నాయిగూడెంతో పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని, వేసవి వస్తున్న నేపధ్యంలో తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని కోరారు. విద్యుత్తుశాఖ ఏసీడీ రూపంలో బిల్లులు వసూలు చేస్తూ పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వైస్‌ ఎంపీపీ ఫణీంద్ర, కోఆప్షన్‌ సభ్యులు పాష, ఎంపీటీసీ హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదలను దోచుకుంటుందని అన్నారు. మండలంలో మట్టి తోలకాలు ఇష్టానుసారం జరుగుతున్నాయని చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో ప్రభుత్వ శాఖలు చేపట్టే కార్యక్రమాలకు ఎంపీటీసీలను కొన్నిచోట్ల ఆహ్వానించటంలేదని, ఎంపీటీసీలకు కనీస గౌరవం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేయగా స్పందించిన ఎంపీడీవో విద్యాధరరావు మాట్లాడుతూ అధికారులు తప్పనిసరిగా ప్రోటాకాల్‌ పాటించాలని సూచించారు. గతంలోనూ చెప్పామని అధికారులు ఎంపీటీసీలను తప్పనిసరిగా ఆహ్వానించాలని కోరారు. ఇక మండల సమావేశానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా అంతంత మాత్రంగానే హాజరయ్యారు.

Updated Date - 2023-01-24T22:44:58+05:30 IST