భద్రాద్రి రాముడిని మభ్యపెట్టిన ఘనత కేసీఆర్‌ది

ABN , First Publish Date - 2023-03-26T01:05:38+05:30 IST

భద్రాద్రి రామాలయాన్ని రూ.100కోట్లతో అభివృద్ధి చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కనీసం రామయ్య హుండీలో రూ.100 కూడా వేయలేదని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.

భద్రాద్రి రాముడిని మభ్యపెట్టిన ఘనత కేసీఆర్‌ది
భద్రాచలం ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హుండీలో రూ.100వేయనివాడు దేశాన్ని ఉద్దరిస్తాడా ?

ఏ నిధులు నియమాకాలైనా కల్వకుంట్ల కుటుంబానికే

సీఎంను గద్దె దించడమే మా అజెండా

భద్రాద్రి ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఎంపీ పొంగులేటి

భద్రాచలం, మార్చి 25: భద్రాద్రి రామాలయాన్ని రూ.100కోట్లతో అభివృద్ధి చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కనీసం రామయ్య హుండీలో రూ.100 కూడా వేయలేదని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. హుండీలో రూ.100లు వేయలేనివాడు దేశాన్ని ఉద్దరిస్తాడంటే నమ్మాలా అంటూ ప్రశ్నించారు. భద్రాచలంలో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ తన రాజకీయ నిర్ణయం చెప్పే సమయం దగ్గరలోనే ఉందన్నారు. తనను అభిమానించేవారు ఆశించినట్లుగానే తన నిర్ణయం ఉంటుందన్నారు. భద్రాద్రి రామాలయాన్ని రూ.100కోట్లతో అభివృద్ధి చేస్తామన్న సీఎం కేసీఆర్‌ ఆ నిధులివ్వలేదు సరికదా రామయ్య హుండీలో కనీసం రూ.100కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి దేశాన్ని ఉద్దరిస్తారంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. గత ఏడాది గోదావరి వరదల సమయంలో ఇచ్చిన రూ.1,000 కోట్ల హామీ ఎనిమిది నెలలైనా అమలుకు నోచలేదన్నారు. ఈ విషయం సీఎం మరిచారా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధికార పార్టీ నాయకులు ఈ విషయాన్ని సీఎంకు గుర్తు చేశారా అన్నారు. టీఎ్‌సపీఎస్సీ ప్రశాన్నపత్రాల లీకేజీ అనంతరం కమిటీ చైర్మన సభ్యులను ఎందుకు బర్తరఫ్‌ చేయలేదని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన అనంతరం ఏ నిధులు, నియామకాలైనా, నీళ్లయినా వచ్చినా అన్ని కల్వకుంట్ల కుటుంబానికే చెందుతున్నాయని ఆరోపించారు. జెండా ఏదైనా తమ అజెండా ఒక్కటేనన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం కలిసి వచ్చే మిత్రులు, పార్టీలతో కలిసి పోరాడుతామన్నారు. పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులైన ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధుల గనమెన్లను తొలగించడం సరైందికాదన్నారు. జడ్పీ చైర్మన కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యేగా ఉన్న తనతో పాటు భద్రాచలం నాయకుడు డా.తెల్లం వెంకట్రావుకు ఏదైనా ప్రాణహాని జరిగితే సీఎం కేసీఆర్‌, రాష్ట్రప్రభుత్వం, డీజీపీ, ఎస్పీలదే బాధ్యతని స్పష్టంచేశారు. భద్రాద్రి జడ్పీ చైర్మన కోరం కనకయ్య మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలివ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సమ్మేళనంలో పిడమర్తి రవి, మువ్వా విజయ్‌బాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, వైరా నాయకురాలు విజయబాయి తదితర నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T01:05:38+05:30 IST