కల్యాణ రాముడికి వేద ఆశీర్వచనం

ABN , First Publish Date - 2023-04-02T00:31:03+05:30 IST

భద్రాద్రి కల్యాణ రాముడికి వేద మంత్రాలతో మహదాశీర్వచనాన్ని వేద పండితులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలోని నిత్యకల్యాణ వేదికవద్ద శనివారం మహదాశీర్వచన కార్యక్రమాన్ని నిర్వహించారు.

కల్యాణ రాముడికి వేద ఆశీర్వచనం
సీతారాములకు వేదాశీర్వచనం నిర్వహిస్తున్న వేద పండితులు

04kmm1bcm-temple.jpgరథోత్సవం నిర్వహిస్తున్న దృశ్యం

వేద మంత్రాలతో పులకించిన భద్రగిరి

శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా రథోత్సవం

భద్రాచలం, ఏప్రిల్‌ 1: భద్రాద్రి కల్యాణ రాముడికి వేద మంత్రాలతో మహదాశీర్వచనాన్ని వేద పండితులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలోని నిత్యకల్యాణ వేదికవద్ద శనివారం మహదాశీర్వచన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివాహం జరిగిన తరువాత నూతన వధూవరులైన శ్రీ సీతారామచంద్రస్వామికి వేద పండితులు వేదాశీర్వచనం ఇవ్వడమే సదస్యం పరమార్థం.. సీతారాముల కల్యాణ క్రతువులో పాల్గొని తిలకించిన భక్తులకు సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ ఉత్సవాల్లో అంతర్భాగంగా సదస్యం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెండుతెలుగురాష్ట్రాల నుంచి చతుర్వేద పండితులు, ద్రవిడ దివ్యప్రబంధం పారాయణం చేసేందుకు తరలివచ్చి భద్రాద్రి రాముడికి వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికారు. కల్యాణం జరిగిన మూడోరోజున స్వామివారికి మహదాశీర్వచనం నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇందులో భాగంగా కల్యాణమూర్తులను నిత్యకల్యాణ మండప వేదిక వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలతో స్వామివారికి నిర్వహించిన మహదాశీర్వచనం ప్రతీఒక్కరినీ ఆకట్టుకుంది. అనంతరం స్వామి వారికి హంస వాహనంపై తిరువీధిసేవ నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎల్‌.రమాదేవి, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన, వైదిక పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు.

వైభవంగా రథోత్సవం

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామికి శనివారం రథోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం అనంతరం వాస్తవానికి స్వామివారికి శుక్రవారం రాత్రి రథోత్సవం నిర్వహించాల్సి ఉంది. అయితే గాలిదుమారం, వర్షం రావడంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం వీలుపడలేదు. దీంతో భద్రాద్రి దేవస్థానం చరిత్రలోనే తొలిసారిగా శనివారం ఉదయం స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. ఈ సమయంలో సైతం కొద్దిసేపు వర్షం పడింది. అయితే స్వామివారిని రథంలో ఉంచడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఈ సమయంలో స్వామివారిని దర్శించి భక్తులు హారతులు సమర్పించి ప్రసాదాలు స్వీకరించారు. ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం భద్రాచలంలో తెెప్పోత్సవం,చోరోత్సవం నిర్వహించనున్నారు.

Updated Date - 2023-04-02T00:31:03+05:30 IST