గిరిజనాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి

ABN , First Publish Date - 2023-01-26T22:46:38+05:30 IST

భద్రాచలం ఐటీడీఏ పరిధిలో గిరిజనాభివృద్ధికి ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తుందని భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌ అన్నారు.

గిరిజనాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి
జెండాకు వందనం చేస్తున్న పీవో గౌతమ్‌

భద్రాచలం, జనవరి 26: భద్రాచలం ఐటీడీఏ పరిధిలో గిరిజనాభివృద్ధికి ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తుందని భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌ అన్నారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో గురువారం 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనం తరం పీవో గౌతమ్‌ మాట్లాడుతూ మన రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఆదర్శప్రాయంగా నిలవటం మనమంతా గర్వించదగ్గ విషయమన్నారు. భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని 305 విద్యా సంస్థల్లో 24,558 మందికి విద్యనందిస్తున్నామని, పదో తరగతి ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యార్ధులకు ప్రీ మెట్రిక్‌ ఈ ఏడాది రూ.1.38 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. యువతకు ఉపాధిలో భాగంగా పోలీసు ఉద్యోగాల ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించగా 20,053 మంది తుది ఎంపికలకు అర్హత సాధించగా వారికి మెయిన్స్‌ కోచింగ్‌ ఐటీడీఏ ద్వార అందిస్తున్నామని పేర్కొన్నారు. గిరి ఆర్ధిక ప్రగతి కోసం 4,365 యూనిట్లకు గాను రూ.35.32 కోట్లు లక్ష్యం నిర్దేశించగా మండలాలకు కలెక్టరు మంజూరితో పంపడం జరిగిందన్నారు. ఎంఎస్‌ఎం పథకం కింద 23 రకాల యూనిట్లకు గాను రూ.4.02 కోట్లు సబ్సిడీ విలువతో అందించామని పేర్కొన్నారు. గిరి వికాసం ద్వార రూ.24.15 కోట్లు మంజూరు చేశామని అన్నారు. అలాగే 20,050 పడకలతో కొత్తగూడెంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంతో 481 గ్రామ పంచాయతీల్లో, 104 మున్సిపల్‌ వార్డులలో 585 క్యాంపులు ఏర్పాటు చేసి 7,90,398 మందిని పరీక్షించేందుకు ప్రణాళిక చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్‌ డేవిడ్‌రాజు, మొబైల్‌కోర్టు న్యాయమూర్తి సీహెచ్‌ వెంకటేశ్వర్లు, ఏవో బీమ్‌, డీడీ రమాదేవి, జీసీసీ డీఎం విజయ్‌కుమార్‌, ఎస్వో సురేష్‌బాబు, ఈఈ తానాజీ, డిప్యుటీ డీఎంఅండ్‌హెచ్‌వో రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T22:46:44+05:30 IST