మైనారిటీ కమిషన అంటే చులకనా?
ABN , First Publish Date - 2023-05-12T00:51:12+05:30 IST
‘మైనార్టీ కమిషన అంటే చులకనగా ఉంది. మేం టైంపాస్ కోసం రాలేదు. కలెక్టర్ లేకుండా సమావేశం ఎందుకు? కమిషన కంటే కలెక్టర్, సీపీ పెద్దనా? ఒక్కొక్కరికి నాటకాలు అయితున్నాయ్.
కలెక్టర్, సీపీ పట్ల షహజాది వ్యాఖ్యలకు ఖమ్మం కలెక్టరేట్‌లో అధికారులు, ఉద్యోగుల నిరసన
కమిషన పెద్దనా.. కలెక్టర్, సీపీ పెద్దనా..
మైనారిటీ కమిషన సభ్యురాలు సయ్యద్ షహజాది
పీఎం పథకాల అమలు, సంక్షేమంపై సమీక్షకు హాజరుకాని ఖమ్మం కలెక్టర్, సీపీపై ఆగ్రహం
ఖమ్మంకార్పొరేషన/ఖమ్మం కలెక్టరేట్/ఖమ్మం బైపా్‌సరోడ్, మే 11 : ‘మైనార్టీ కమిషన అంటే చులకనగా ఉంది. మేం టైంపాస్ కోసం రాలేదు. కలెక్టర్ లేకుండా సమావేశం ఎందుకు? కమిషన కంటే కలెక్టర్, సీపీ పెద్దనా? ఒక్కొక్కరికి నాటకాలు అయితున్నాయ్. ఉన్నతాధికారులే ఇలా ఉంటే ఇతర అధికారులు ఎలా పనిచేస్తారు? కలెక్టర్, సీపీని ఢిల్లీకి రమ్మని చెప్పండి. సమీక్ష ఉందని చీఫ్ సెక్రటరీకి లేఖ కూడా రాశాం. అయినా వారు హాజరుకాలేదు’ అంటూ మైనార్టీ కమిషన్ జాతీయ కమిటీ సభ్యురాలు సయ్యద్ షహజాది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి పదిహేను సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించేందుకు గురువారం ఆమె ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా ఖమ్మం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమీక్షకు వెళ్లగా.. ఆ సమీక్షకు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ హాజరుకాలేదు. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సహజాదీ.. వారు వచ్చే వరకు సమావేశం జరగదంటూ.. కలెక్టర్‌కు ఫోన చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదనకు సూచించారు. అనంతరం ఆమె అక్కడి నుంచి ఎన్నెస్పీ అతిథిగృహానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సంక్షేమపథకాలపై సమీక్ష నిర్వహించేందుకు తాను ఢిల్లీనుంచి వచ్చానని, 20గంటల పాటు జిల్లాలో పర్యటిస్తే కలెక్టర్, పోలీసుకమిషనర్ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమపథకాలు మైనారిటీలకు అందుతున్నాయో లేదో పరిశీలించి అధికారులతో సమీక్ష జరిపేందుకు తాను పలు రాష్ట్రాలు, జిల్లాల్లో పర్యటిస్తున్నానన్నారు. ప్రతిచోట అధికారులు హాజరు అవుతున్నారని, ఒక్క ఖమ్మంజిల్లాలోనే కలెక్టర్, పోలీసుకమిషనర్ ఎందుకు హాజరు కాలేదో అర్థం కాలేదన్నారు. ఖమ్మం కలెక్టర్‌కు ముస్లింలంటే వివక్ష ఉన్నట్టు అర్థమవుతోందని షహజాది అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడా ఇలాంటి కలెక్టర్‌ను చూడలేదని, తాను ఖమ్మం వచ్చినప్పుడు తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను ఎవరితో చర్చించాలని ప్రశ్నించారు. కమిషన సభ్యురాలి హోదాలో తాను వస్తే కలెక్టర్ రాజకీయ నాయకుల వెంట చేతులు కట్టుకుని తిరుగుతున్నారని, కమిషన పోస్టునే అవమానిస్తున్నారని, మైనారిటీల పట్ల వివక్షత చూపడం సరైందికాదన్నారు. దీనిపై డీవోపీటికి(ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్), రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. తాను కలెక్టర్ కోసం 2గంటలు ఎదురుచూసిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తామని షహజాది తెలిపారు. అలాగే కలెక్టర్ గౌతమ్‌కు నోటీసులు ఇచ్చి ఢిల్లీ పిలిపిస్తామన్నారు. కాగా కలెక్టర్, సీపీలు మాత్రం అంతకుముందే అధికారికంగా ఖరారైన కార్యక్రమాలకు వెళ్లి తిరిగి సమీక్షకు చేరుకునేలోపే ఇదంతా జరిగిందంటూ కలెక్టర్, సీపీ కార్యాలయాల ఉద్యోగులు చెబుతున్నారు.
కలెక్టరేట్ సిబ్బంది నిరసన
నిత్యం ప్రజల సంక్షేమం కోసం తపన పడుతూ... క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్‌పై జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షహజాదీ చేసిన వాఖ్యలను సమీకృత కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతుంటే నిరంతరం వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తు క్షేత్రస్థాయిలో కలెక్టర్ ఉంటే మైనార్టీ కమిషన్ సభ్యురాలు మాత్రం మీటింగ్‌కు హాజరుకాలేదంటూ వాఖ్యలు చేయడం సరికాదని, సమీక్షకు ఆలస్యంగా హాజరు అవుతానని కలెక్టర్ ప్రతినిధులను పంపినా ఆమె అనుచితంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్, సీపీపై కమిషన్ సభ్యురాలు ప్రవర్తన ఆక్షేపణీయమని, ఉదయం 11గంటలకు అధికారులను పిలిచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారుల సమయాన్ని వృథా చేయడంతో పాటు అధికారుల సమక్షంలోనే ఉన్నతాధికారులను కించపరుస్తూ మాట్లాడడం శోచనీయమన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రమిచ్చిన బీజేపీ మైనార్టీ మోర్చా
ఖమ్మం కలెక్టర్ ప్రొటోకాల్ పాటించకుండా.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మైనారిటీ కమిషన సభ్యురాలు సయ్యద్ షహజాదీని అవమానించడం దారుణమని బీజేపీ మైనారిటీ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ పాషా పేర్కొన్నారు. కలెక్టర్ తీరుకు నిరసనగా మైనారిటీ మహిళలతో కలిసి ఖమ్మం జడ్పీసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించిన ఆయన అనంతరం కలెక్టర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పాషా మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం, వారికి అందుకుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై సమీక్షించేందుకు ఢిల్లీనుంచి వచ్చిన మైనారిటీ మహిళ విషయంలో ఖమ్మం కలెక్టర్ గౌతమ్ కనీస మర్యాద చూపకపోవడం విచారకరమన్నారు. ఆయన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వెంట తిరుగుతూ ఓ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన కలెక్టర్ మైనారిటీ మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ సరిపుద్దీన, జిల్లా ఉపాధ్యక్షుడు మస్తాన, బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్యామ్‌రాథోడ్, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు.