వసతిగృహాలు.. వింతపోకడలు

ABN , First Publish Date - 2023-02-28T23:40:30+05:30 IST

ఖమ్మం నగరంలోని ముస్తాఫానగర్‌లో ఉన్న ఓ వసతిగృహంలో పనిచేయాల్సిన మహిళా ఉద్యోగి కొన్నేళ్లుగా ఆ హాస్టల్‌ వైపు కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి. అయినా నెలవారీ మాత్రం ఆమె ఖాతాలో ప్రభుత్వం నుంచి రూ.లక్ష వరకు జమవుతోంది. అయితే ఆమెస్థానంలో నెలకు రూ.12వేల వరకు జీతం మరో ఉద్యోగిని నియమించి వ్యవహారం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది.

వసతిగృహాలు.. వింతపోకడలు

‘లక్ష’ణంగా తీసుకునే జీతాలకు లెక్కలేనితనం

ప్రభుత్వ ఉద్యోగుల స్థానంలో ప్రైవేటు వర్కర్లు

పలు సంక్షేమ హాస్టళ్లలో సొంత నియామకాలు

పదుల సంఖ్యలో ఉద్యోగులు వెలగబెడుతున్న తంతు

అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఆరోపణలు

ఏటా రూ.కోట్ల ప్రభుత్వ ధనం వృథా

ఎన్నెస్పీ క్యాంపులోని మూడు వసతి గృహాలు కలిసి ఉన్న మరో హాస్టల్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడ పనిచేయాల్సిన ఓ ఉద్యోగి స్థానంలో కొన్నినెలలుగా మరో ప్రైవేటు వ్యక్తి విధులు నిర్వహిస్తూ వస్తున్నాడు. ఆయనకు కూడా నెలకు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు జీతమిచ్చి నియమించకున్నట్టు సమాచారం.

పాలేరు నియోజకవర్గంలోని ఓ వసతి గృహంలోనూ ఓ ఉద్యోగి, కూసుమంచిలోని మరో హాస్టల్‌లో మరో ఉద్యోగి ఇదే రకమైన తంతు నడిపిస్తున్నట్టు తెలిసింది. ఇలా ఒకరా ఇద్దరా... జిల్లాలోని పలు సంక్షేమ హాస్టళ్లలో ఇదేరకమైన పోకడను అవలంభిస్తున్నట్టు తెలుస్తోంది.

ఖమ్మం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): పేద విద్యార్థులకు మెరుగైన చదువు, వసతి కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం.. కొందరి ఉద్యోగుల తీరు, సొంత నిర్ణయాలతో నీరుగారుతోంది. తాము పనిచేయాల్సిన స్థానంలో ఎవరికి వారు సొంత వ్యక్తులను ఏర్పాటు చేసుకుని వసతిగృహాల్లో వింతపోకడలకు తెరలేపినట్టు సమాచారం. పలు బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో పలువురు ఉద్యోగుల స్థానంలో ప్రైవేటు వ్యక్తులు విధులు నిర్వర్తించడం చర్చనీయాంశంగా మారింది. అందుకు గాను ప్రభుత్వ ఉద్యోగులు తమకొచ్చిన జీతం నుంచి తాము నియమించుకున్నవారికి వేతనాలు ఇస్తూ ప్రభుత్వ వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే.. తమకు అనారోగ్య పరిస్థితులు తలెత్తినప్పుడు, మరేదైనా కారణాలతో ఆయా ఉద్యోగులు విధులకు హాజరుకాలేకపోతున్నప్పుడు.. సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు తమ పరిస్థితులను వివరిస్తూ తాము విధులకు హాజరుకాలేకపోతున్నామని చెబుతూ దరఖాస్తు చేసుకోవడం, లేదంటే సెలవుపై వెళ్లడం, ఉద్యోగం నుంచి తొలగడం లాంటివి చేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా ఆయా శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి అవుట్‌సోర్సింగ్‌ పద్ధతి, మరేదైనా పద్ధతులను అనుసరించి ఆయా ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ ప్రస్తుతం జిల్లాలోని కొన్ని సంక్షేమ హాస్టళ్లలో ఈ నిబంధనలేవీ పట్టనట్టు కనిపిస్తోంది. కొందరు ఉద్యోగులు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల సంక్షేమానికి వారికి కావాల్సిన సౌకర్యాలను సమకూర్చేందుకుగాను ప్రతీ సంక్షేమ హాస్టల్‌ ఓ సంక్షేమాధికారి, కామాటీ, కుక్‌, వాచ్‌మెన్లను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం జిల్లాలో నడుస్తున్న పలు హాస్టళ్లలో కొందరు రెగ్యులర్‌ ఉద్యోగులు ఉండగా.. కొన్ని హాస్టళ్లలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో వర్కర్లను నియమించారు. కాగా కొన్ని హాస్టళ్లలో రెగ్యులర్‌ పద్ధతిలో విధులు నిర్వర్తించాల్సిన కామాటి, వంటమనిషి, వాచమెన లాంటి వారు కొందరు ఉద్యోగులు సొంత ఇంట్లో పనివాళ్లను నియమించుకున్నట్టు ఏకంగా తమస్థానంలో తామే మరో ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని ‘లక్ష’ణంగా జీతాలు పొందుతున్నట్టు సమాచారం. వాస్తవానికి ఆయా హాస్టళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులు అనారోగ్య కారణాలతో విధులకు హాజరవకుండా ఉండాలి అంటే మెడికల్‌ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. కానీ అలాంటివేమీ లేకుండానే వారి స్థానంలో ప్రైవేటు వర్కర్లను నియమించి వారికి ఎంతోకొంత జీతాలు ఇచ్చి తూతూమంత్రంగా పనులు నడిపిస్తున్నట్టు తెలుస్తోంది.

అధికారుల అండదండలున్నాయన్న ఆరోపణలు

అయితే ఈ వ్యవహారమంతా సాగడానికి సంబంధిత ఉద్యోగులకు ఆయా శాఖల ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ఎవరైనా వసతిగృహాలకు వెళ్లినప్పుడు సంబంధిత ఉద్యోగుల గురించి అధికారులను అడిగితే వారే భుజాన వేసుకుని మరీ అనారోగ్య కారణాలతో రాలేకపోయారని సమాధానం చెబుతున్నారన్న విమర్శలున్నాయి. వేలమంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన సంక్షేమ వసతి గృహాలను ఆయా శాఖల ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు సంక్షేమాధికారుల నుంచి వివరాలు సేకరిస్తూ ఉండాలి. కానీ అవేవీ జరగకపోవడంతో ఈ తంతు జరుగుతున్న విషయం ఆయా శాఖల ఉన్నతాధికారులకు తెలియదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులకు నెలవారీ మామూళ్లు అందుతున్నాయని, ఈ క్రమంలోనే ఆయా ఉద్యోగులకు వారు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భరోసాలేనితనం వీటి ఫలితాలేనా?

అయితే ప్రభుత్వ ఉద్యోగుల స్థానంలో ప్రైవేటు వర్కర్లను నియమించుకుని పనిచేయిస్తున్న కారణంగా సంబంధిత వర్కర్లు పనిపై పూర్తిస్థాయిలో భరోసా ఇవ్వలేకపోతున్నట్టు తెలుస్తోంది. అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించిన వర్కర్లకు అయినా ఏదైనా పొరపాటు జరిగితే తమ ఉద్యోగానికి ఎసరు వస్తుందన్న భయంతో విధులకు హాజరవుతూ ఉంటారు. కానీ ఇలా ప్రభుత్వ ఉద్యోగులు తమ స్థానంలో నియమించిన ప్రైవేటు వర్కర్లకు అలాంటివేమీ ఉండవు. ఎందుకంటే తమకి, తాము పనిచేసే వసతిగృహానికి అసలు ఎలాంటి సంబంధం ఉండదు. ఏదైనా పొరపాటు జరిగినా దానికి వారు ఎలాంటి బాధ్యులు కాదు కూడా. ఈ ధీమాతోనే ప్రైవేటు వర్కర్లు ఇష్టారీతిన విధులు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే నిత్యం హాస్టళ్లలో ఆహారం బాగాలేకపోవడం, చోరీలు, విద్యార్థుల మధ్య ఘర్షణలు లాంటి సంఘటనలు జరుగుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఉద్యోగులు ఏళ్ల తరబడి తమ సొంత నియామకాల తంతు నడిపిస్తుండగా రూ.కోట్లలో ప్రభుత్వ ధనం వృథా అవుతోందన్న వాదనలున్నాయి. కాగా ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

ఖమ్మం జిల్లాలో సంక్షేమ వసతిగృహాల వివరాలు

వసతిగృహం ఎస్సీ ఎస్టీ బీసీ

ప్రీ మెట్రిక్‌ 41 18 22

కళాశాలలు 10 11 11

Updated Date - 2023-02-28T23:40:30+05:30 IST