ప్రభుత్వ ఆస్తులను తెగనమ్ముతున్నారు

ABN , First Publish Date - 2023-03-18T23:46:59+05:30 IST

మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ ఆస్తులను తెగనమ్ముతున్నారని, ఆయన హయాం దోపీడీ దోపిడీదారులకు, కార్పొరేట్‌ శక్తులకు స్వర్ణయుగంగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.

ప్రభుత్వ ఆస్తులను తెగనమ్ముతున్నారు
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

మోదీ హయాం.. కార్పొరేట్‌ శక్తులకు వరం

ఎన్నికలకు ముందే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాచైతన్యయాత్రలు

సీపీఐ ఖమ్మం జిల్లా జనరల్‌బాడీ సమావేశంలో కూనంనేని

ఖమ్మం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ ఆస్తులను తెగనమ్ముతున్నారని, ఆయన హయాం దోపీడీ దోపిడీదారులకు, కార్పొరేట్‌ శక్తులకు స్వర్ణయుగంగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. శనివారం ఖమ్మం సీపీఐ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ జిల్లా జనరల్‌బాడీ సమావేశంలో కూనంనేని మాట్లాడారు. గతంలో అనేకమంది ప్రధానులు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మిస్తే మోదీ మాత్రం వాటిని తెగనమ్ముతున్నారన్నారు. అన్ని రంగాలను తన గుప్పిట్లో పెట్టుకుని వామపక్షాల పైకి ఆయుధాలుగా ప్రయోగిస్తున్నాడని, అలాంటి బీజేపీ మరోసారి గెలిస్తే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమన్నారు. రానున్న ఎన్నికల్లో వామపక్షాలు ఐక్యంగా బరిలోకి దిగనున్నాయని, సీపీఐ, సీపీఎంల మధ్య మరింత ఐక్యతను పెంపొందించేందుకు వచ్చేనెల 9న హైదరాబాద్‌లో నాయకత్వ స్థాయిలో సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి సీపీఐ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాం ఏచూరితోపాటు డాక్టర్‌ కె.నారాయణ, బీవీ రాఘవులు హాజరుకానున్నట్టు ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో మతోన్మాద శక్తులను ఓడించేందుకు కమ్యునిస్టులు సిద్ధంగా ఉన్నారని, బలానికి అనుగుణంగా కలిసి వచ్చే శక్తులతో కలిసి పోటీచేస్తామన్నారు. ఎన్నికలకు ముందే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ‘బీజేపీ హాఠావో దేశ కి బచావో’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రలు చేపడతామన్నారు. 33జిల్లాల్లో ఈ యాత్రలు కొనసాగుతాయని, యాత్రల్లో భాగంగా ప్రజాసమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తూ, బీజేపీ వ్యతిరేక, మతోన్మాద విధానాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తామన్నారు. సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా రాజకీయాలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, కొందరు డబ్బుతో రాజకీయాలను శాసించాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. గ్రామ, మండల స్థాయిలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు రాజకీయ చైతన్యం కలిగించేందుకు ప్రాధాన్యమివ్వాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, నాయకులు దండి సురేష్‌, మహ్మద్‌ మౌలానా, జమ్ముల జితేందర్‌ రెడ్డి, యర్రాబాబు, ఎస్‌కె జానీమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:46:59+05:30 IST