గౌతంపూర్‌ నెంబర్‌ 1

ABN , First Publish Date - 2023-04-08T01:22:34+05:30 IST

జాతీయస్థాయి ఆరోగ్యపంచాయతీ పురస్కారానికి భద్రాద్రికొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని గౌతంపూర్‌ గ్రామ పంచాయతీ ఎంపికైంది. అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ తదితర 12 అంశాల్లో సత్తా చాటిన గౌతంపూర్‌ ఆరోగ్య విభాగంలో జాతీయస్థాయి మొదటి ర్యాంకును సాధించింది.

గౌతంపూర్‌ నెంబర్‌ 1
సింగరేణి చొరవతో మురుగునీటి శుద్ధికి నిర్మించిన స్లేవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌

03kmm7gowthampur.jpgగౌతంపూర్‌ గ్రామపంచాయతీ కార్యాలయం

ఆరోగ్య గ్రామపంచాయతీ విభాగంలో జాతీయస్థాయి ఒకటో ర్యాంకు

స్లేవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌తో మురుగునీటి శుద్ధి

పారిశుధ్య నిర్వహణపై నిత్య పర్యవేక్షణతో గుర్తింపు

చుంచుపల్లి, ఏప్రిల్‌ 7 : జాతీయస్థాయి ఆరోగ్యపంచాయతీ పురస్కారానికి భద్రాద్రికొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని గౌతంపూర్‌ గ్రామ పంచాయతీ ఎంపికైంది. అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ తదితర 12 అంశాల్లో సత్తా చాటిన గౌతంపూర్‌ ఆరోగ్య విభాగంలో జాతీయస్థాయి మొదటి ర్యాంకును సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా గుర్తించిన సమయంలో రుద్రంపూర్‌ మేజర్‌ పంచాయతీ నుంచి కొత్త పంచాయతీగా ఏర్పడిన గౌతంపూర్‌ కొత్తగూడెం సింగరేణి ఏరియా పరిధిలోఉంది. ఈ పంచాయతీకి ఏర్పాటు సమయంలో పంచాయతీ నుంచి 8మంది పారిశుధ్య కార్మికులను కేటాయించగా, సింగరేణి సంస్థ 16మంది కార్మికులను కేటాయించింది. గౌతంపూర్‌ పంచాయతీలో 850 సింగరేణి క్వార్టర్స్‌ ఉండగా, 18 నివాసాలు మాత్రమే పంచాయతీ పరిధిలో ఉన్నాయి. ఇక్కడ 3వేలకు పైగా జనాభా ఉండగా.. 2,500ఓటర్లున్నారు. అయితే ఈ గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టిన పారిశుధ్య చర్యల్లో భాగంగా.. మురుగునీటి నిర్వహణ కోసం సింగరేణి సంస్థ ప్రత్యేక చొరవ తీసుకుని స్లేవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్‌టీపీ)ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్‌కు చేరిన మురుగునీరు పూర్తిగా శుద్ధి అయిన తర్వాత పొలాల్లోకి పంపేలా భూగర్భం నుంచి పైప్‌లైన్లు వేశారు. దీంతో డ్రెయినేజీల్లో మురుగునీరు నిల్వ ఉండటం, దోమలు, ఈగల వ్యాప్తి, పందుల సంచారం లాంటివి ఉండకపోవడంతో ప్రజలు ఆరోగ్యవంత జీవనాన్ని గడుపుతున్నారు. దీనికి తోడు గౌతంపూర్‌ పంచాయతీ పరిధిలో ఉన్న పెనగడప ప్రాథమిక చికిత్స కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి ఆరోగ్య సూత్రాలను అందిస్తూ ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నారు. వైద్యాధికారి డాక్టర్‌ వాణి పర్యవేక్షణలో తీసుకుంటున్న జాగ్రత్త చర్యలతో ప్రజలు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో గ్రామపంచాయతీలో చేపట్టిన చర్యలపై నివేదికను రూపొందించి పంచాయతీ అధికారులకు పంపారు. వారు నివేదించిన వివరాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఉత్తమ ఆరోగ్య గ్రామపంచాయతీగా గౌతంపూర్‌ను గుర్తించింది. అయితే ఇటీవల రాష్ట్రస్థాయిలో ప్రకటించిన అవార్డుల్లో గౌతంపూర్‌ పంచాయతీ రెండోర్యాంకును దక్కించుకుంది. ఈ క్రమంలో గత నెల 31న హైదరాబాద్‌ రాంజేందర్‌నగర్‌లోని పీజేటీఎ్‌సఏయూ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలోరాష్ట్ర పురపాలక శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పురస్కారాన్ని అందించారు. అనంతరం శుక్రవారం జాతీయస్థాయిలో ప్రకటించిన అవార్డుల్లో గౌతంపూర్‌ పంచాయతీ మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా భద్రాద్రి కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌... చుంచుపల్లి మండల ప్రత్యేక అధికారి, జడ్పీసీఈవో మెరుగు విద్యాలత, చుంచుపల్లి ఎంపీపీ బాదావత శాంతి, వైస్‌ ఎంపీపీ వట్టికొండ మల్లికార్జున్‌రావు, ఎంపీడీవో సకినాల రమేష్‌, ఎంపీవో గుంటి సత్యనారాయణ, గౌతంపూర్‌ సర్పంచ పొడియం సుజాత, పంచాయతీ కార్యదర్శి జక్కంపూడి షర్మిలను అభినందించారు.

Updated Date - 2023-04-08T01:22:34+05:30 IST