కేసీఆర్‌, కేటీఆర్‌ను కలిసిన మాజీమంత్రి తుమ్మల

ABN , First Publish Date - 2023-01-09T23:45:04+05:30 IST

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ను కలిశారు.

 కేసీఆర్‌, కేటీఆర్‌ను కలిసిన మాజీమంత్రి తుమ్మల
కేసీఆర్‌ వెంట తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, జనవరి 9 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వియ్యంకుడు, మంత్రి కేటీఆర్‌ మామ పాకాల హరినాథరావు దశదినకర్మ హైదరాబాదులోని జీఆర్‌ కన్వెన్షనలో సోమవారం జరగ్గా.. కార్యక్రమానికి వెళ్లిన తుమ్మల.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. కేసీఆర్‌తో పాటు హరినాథరావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం తుమ్మల కేటీఆర్‌ను పరామర్శించారు.

నాలుగులక్షల మందితో బీఆర్‌ఎస్‌ సభ : తుమ్మల

కూసుమంచి : బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించడం హర్షణీయమని, నాలుగు లక్షల మందితో ఈ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వచ్చిన ఆయన కాసేపు కూసుమంచిలోని బీఆర్‌ఎస్‌ నాయకుడు అర్వపల్లి జనార్దన్‌ నివాసంలో ఆగారు. ఈనెల 18తేదీన ఖమ్మంజిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్‌ వస్తున్నారని, ఈ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు, మహబూబాబాద్‌, సూర్యాపేట ఇతర పొరుగు జిల్లాలనుంచి నాలుగు లక్షలమందిని సమీకరిస్తామన్నారు. కేసీఆర్‌ నేతృత్వంలో అన్నిజిల్లాల్లో కలెక్టర్‌ కార్యాలయాలు నూతన హంగులతో నిర్మించినట్లు తెలిపారు. పాలేరు నియోజకవర్గం అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ తనకు అవకాశం కల్పించినందువల్లే 30ఏళ్లలో కానీ అభివృద్ధి మూడేళ్లలో చేశానని, నియోజకవర్గంలో అన్ని రోడ్లు పూర్తిచేశానని తెలిపారు. నర్సింహలగూడెం, మూటాపురం ఎత్తిపోతల పథకాలతో కొంతమేరకే కాకుండా పూర్తిస్ధాయిలో నీరందేలా భక్తరామదాసు ప్రాజెక్టు దోహదపడుతుందని తెలిపారు. ప్రజలు శాశ్వతంగా పేదరికం నుంచి బయటపడాలన్నదే తన కోరిక అన్నారు. కార్యక్రమంలో నాయకులు సాధు రమే్‌షరెడ్డి, జొన్నలగడ్డ రవికుమార్‌, జూకూరి గోపాలరావు, సుధాకర్‌రెడ్డి, మాదాసు ఉపేందర్‌, కేశవరెడ్డి, రేల వెంకటరెడ్డి, కూరపాటి వేణు, బారి వీరభద్రం, దామోదర్‌రెడ్డి, అహ్మద్‌అలీ, యడవల్లి ముత్తయ్య, మల్లికార్జున్‌, మైపాల్‌, మంద వీరబాబు, రాజారావు, పాల్గొన్నారు.

Updated Date - 2023-01-09T23:45:05+05:30 IST