‘సీతారామ’పై భరోసా

ABN , First Publish Date - 2023-02-07T00:54:29+05:30 IST

ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేలా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద గోదావరిపై నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిచేస్తామని సోమవారం బడ్జెట్‌ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావు ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి.

 ‘సీతారామ’పై భరోసా

ప్రాజెక్టు పూర్తి చేస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించిన మంత్రి హరీష్‌

పలు పథకాలకు నిధులు.. కేటాయింపులపై లేని స్పష్టత

ఖమ్మం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేలా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద గోదావరిపై నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిచేస్తామని సోమవారం బడ్జెట్‌ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావు ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ప్రస్తుత ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతుండగా.. ఈ సారి బడ్జెట్‌లో కేటాయింపులు జరిగి పనులు వేగం పుంజుకుంటాయని భావిస్తున్నారు. అటు పాలేరు జలాశయానికి అనుసంధానం చేసేలా నిర్మిస్తున్న లింక్‌ కెనాల్‌ పనులు కూడా పూర్తిచేస్తామని, ఎన్నెస్పీ ఆయకట్టును కృష్ణాజలాలతో సంబంధం లేకుండా గోదావరి జలాలతోనే పండేలా చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో సుమారు రూ.1500 కోట్ల వరకు ప్రతిపాదనలు పెట్టినా బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థల ద్వారా పొందిన రుణాలతో ఈ ప్రాజెక్టు పనులు పూర్తిచేయాల్సి ఉంది. బడ్జెట్‌లో హరీ్‌షరావు ప్రకటన కొంత జిల్లాకు ప్రయోజనకరంగా ఉన్నా, తాలిపేరు, పెదవాగు, వైరా, పాలేరు, లంకాసాగర్‌, బేతుపల్లి, కిన్నెరసాని తదితర ప్రాజెక్టులకు సంబంధించి నిధుల కేటాయింపును నీటిపారుదల శాఖనుంచి స్పష్టత రావాల్సి ఉంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టులకు మరమ్మతులు, ఆధునికీకరణ పనులకు కొంత ప్రతిపాదనలు చేశారు.

పాత పథకాలకే ప్రాధాన్యం

రాష్ట్ర బడ్జెట్‌లో పాత పథకాలకే ప్రాధాన్యం కనిపించింది. కొత్త పథకాలు ఊసు లేకపోవడంతో ప్రజల్లో నిరుత్సాహం కనిపించింది. ఎన్నికల ఏడాదికావడంతో నిరుద్యోగ భృతితోపాటు కొత్త జనాకర్షక పథకాలుంటాయని, రైతుబంధు పెంపు ఉంటుందని కూలీబంధు లాంటి కొత్తపథకాలు ప్రవేశపెడతారని ఆశించారు. కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకుంటే రూ.3లక్షలు ఇస్తామని ప్రకటించారు. గత బడ్జెట్‌లో కూడా ఈహామీ చేసినా అమలు కాలేదు. ఈసారైనా అమల్లోకి వస్తుందని ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సారి ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ రోడ్ల నిర్వహణకు గాను ఆర్‌అండ్‌బీలో రూ2500 కోట్ల, పంచాయతీరాజ్‌కు రూ.486 కోట్లు కేటాయించారు కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.2074 కోట్లు కేటాయించారు. ఈనిధులతో జిల్లాలో కొత్త రోడ్ల నిర్మాణానికి నిధులొచ్చే అవకాశం ఉంది

సీఎం తాజా హామీలకు కేటాయింపులు జరిగేనా?

ఇటీవల ఉమ్మడిజిల్లాలో పర్యటించిన సందర్భంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు బడ్జెట్‌ నిధుల నుంచి కేటాయింపు లు జరుగుతాయన్న ఆశతో అంద రూ ఎదురుచూస్తున్నారు. కొత్తగూడెంలో మైనింగ్‌ కళాశాల, పూర్తిస్థాయి ఇంజనీరింగ్‌ కాలేజీకి అనుమతి లభించింది. ఖమ్మం ఇంజనీరింగ్‌ కళాశాల విషయంలో ఎలాం టి ప్రకటన చేయలేదు. అలాగే ఖమ్మంకార్పొరేషనతోపాటు ఉభయజిల్లాల్లోని మేజర్‌ పంచాయతీలు, మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేకనిధులు కేటాయించారు. బడ్జెట్‌ కేటాయింపుల తర్వాత జీవో లు విడుదలైతేనే సీఎం హామీలిచ్చిన వాటికి కేటాయింపులపై స్పష్ట త వచ్చే అవకాశం కనిపిస్తోంది.

రైతు రుణమాఫీ అమలయ్యేనా?

రైతు రుణ మాఫీ కోసం బడ్జెట్‌లో రూ.6385కోట్లు ప్రకటించగా.. ఉమ్మడి జిల్లాలో రూ.లక్ష లోపు రుణం తీసుకున్న రైతులకు మాఫీ జరగాల్సి ఉండగా, గతంలో రెండువిడతలుగా రూ.50వేలలోపు మాత్రమే జరిగింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 3.25లక్షలు, భద్రాద్రి జిల్లాలో లక్షా38వేల మంది రైతులుండగా.. వీరంతా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో రూ.25వేల చొప్పున 28,118మందికి, రూ.50వేలచొప్పన 9,363మందికి, ఖమ్మంజిల్లాలో సుమారు రూ.250కోట్ల వరకు గతంలో రుణమాఫీ జరిగింది. ఇక రైతుబంధు, రైతుబీమా పథకాలు యథావిధిగానే అమలుకాబోతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్‌పామ్‌సాగు ఆదర్శవంతంగా ఉండగా.. డ్రిప్‌ ఇరిగేషన, సబ్సిడీకి కేటాయింపులు జరిపారు. అలాగే దళితబంధు షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి లాంటి సంక్షేమపథకాలకు ఎప్పటిలానే నిధులు కేటాయించారు.

భద్రాద్రికి మళ్లీ భంగపాటు

బడ్జెట్‌లో ఊసేలేని రామాలయ అభివృద్ధి

భద్రాచలం, ఫిబ్రవరి 6: దక్షిణ అయోధ్యకు మళ్లీ భంగపాటే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో భద్రాచలం రామాలయ అభివృద్ధి ఊసే లేకుండా బడ్జెట్‌ ప్రసంగం సాగడం పట్ల భద్రాద్రివాసులు, రామ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2016 ఏప్రిల్‌ 15న శ్రీరామనవమికి భద్రాద్రికి వచ్చిన సీఎం కేసీఆర్‌ ఎవరు ఊహించని రీతిలో దేవస్థానం అభివృద్ధికి రూ.100కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 2017 బడ్జెట్‌లో ఆ రూ.100కోట్లకు ఆమోదం తెలిపారు. కానీ నిధులు మాత్రం మంజూరు చేయలేదు. తరువాత 2019లో మరోసారి రూ.50 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. కానీ అవి కూడా కాగితాలకే పరిమితమయ్యాయి. ఇక గత సంవత్సరం జూలై 16న వచ్చిన గోదావరి మహా వరదలు భద్రాద్రి ఏజెన్సీ జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో బాఽధితులను పరామర్శించేందుకు భద్రాద్రికి విచ్చేసిన సీఎం కేసీఆర్‌ వరద బాధితులకు 2016 పక్కా ఇళ్లను నిర్మిస్తామని, గోదావరి కరకట్ట ఎత్తు పెంచి, పొడిగించి పటిష్ఠం చేస్తామని, ఇందుకోసం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై మంత్రివర్గ తీర్మానం సైతం చేశారు. ఇది జరిగి ఆరు నెలలు దాటినా నేటికీ పురోగతి లేకపోవడం పట్ల భద్రాద్రివాసులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్‌’ పథకం ద్వారా మంజూరైన రూ.41.38 కోట్లతో భద్రాద్రిలో అభివృద్ధి పనులకు గత డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రాద్రిపై దృష్టిసారిస్తుందని అందరూ ఎదురుచూశారు. కానీ అవన్నీ అడియాశలే అయ్యాయి. ఇదే విషయంపై భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ ఎంపీ డా. మిడియం బాబురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తొలినుంచీ భద్రాద్రిని విస్మరిస్తోందని, ఇది ఎంత మాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు.

దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ బడ్జెట్‌

పువ్వాడ అజయ్‌కుమార్‌, రవాణాశాఖ మంత్రి

ఖమ్మం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అసెంబ్లీలో సొమవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో అన్ని వర్గాల సంక్షేమంతోపాటు విద్య, వైద్యం, వ్యవసాయానికి భారీగా నిధులు కేటాయించారన్నారు. మహిళల ప్రగతికి, దళితులు, మైనారిటీల అభ్యున్నతికి, విద్యారంగానికి, యూనివర్శిటీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించటం హర్షనీయమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌

నామ నాగేశ్వరరావు, ఎంపీ

రాష్ట్ర బడ్జెట్‌ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ఆలోచనలకు అనుగుణంగా ఉందని బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా, ముఖ్యంగా రైతుబంధుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించటం సీఎం కేసీఆర్‌కు రైతన్నల ఉన్న మక్కువకు నిదర్శనమని ఎంపీ నామ అన్నారు. ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్‌ తయారు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ఎంపీ నామ కృతజ్ఞతలు తెలిపారు.

భద్రాచలంపై సర్కారుకు చిత్తశుద్ధి లేదు

పొదెం వీరయ్య, ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రభుత్వానికి భద్రాచలంపై ఆది నుంచి చిత్తశుద్ధి లేదని, రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెటే నిదర్శనమని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య విమర్శించారు. తొమ్మిదేళ్లుగా భద్రాచలం ప్రాంతానికి నిధులివ్వడం లేదని, గతంలో ఇచ్చిన రూ.100కోట్ల హామీ మరిచారన్నారు. గోదావరి వరదలకు శాశ్వతపరిష్కారంగా ఇస్తానన్న రూ.1000 కోట్ల గురించి బడ్జెట్‌లో ప్రస్తావనే లేదన్నారు. సీతారామ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న ప్రజానీకానికి నష్టపరిహారం, భద్రత కల్పించే విషయంలోనూ ఈ బడ్జెట్‌లో ప్రస్తావనే లేకపోవడం బాధితులను ఆవేదనకు గురి చేస్తోందన్నారు.

బడ్జెట్‌ కేటాయింపులను పూర్తిగా అమలు చేయాలి..

కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

బడ్జెట్‌లో చేసిన కేటాయింపులను పూర్తిగా అమలు చేయాలి. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. 80వేల ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు సరిపోవు. రూ.5లక్షలకు పెంచాలి. యూనివర్శిటీలకు, పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలకు నిధులు పెంచాలి. అన్ని రంగాల్లోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలి. బీజేపీ పాలితరాష్ట్రాల బడ్జెట్‌ కంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ పర్వాలేదు.

Updated Date - 2023-02-07T00:54:30+05:30 IST