మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో చేరువగా వైద్య విద్య

ABN , First Publish Date - 2023-09-15T00:43:28+05:30 IST

మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడంతో పాటు, ప్రజలకు మెరుగైన, సత్వర వైద్య సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావు పేర్కొన్నారు.

మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో చేరువగా వైద్య విద్య
ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ప్రారంభిస్తున్న మంత్రి హరీష్‌రావు

DSC_1792.jpgమమత కళాశాల రజతోత్సవంలో సావనీర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి

పేద విద్యార్థుల చదువు, ప్రజలకు సత్వర వైద్యసేవలే ప్రభుత్వ లక్ష్యం

పదికిపది గెలిచి రాజ్యాధికారంలో భాగం పంచుకోవాలి

ఖమ్మం పర్యటనలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీ్‌షరావు

మంత్రి పువ్వాడతో కలిసి ఖమ్మం వైద్య కళాశాల భవనాల ప్రారంభం

‘మమత’ రజతోత్సవం, పువ్వాడ నాగేశ్వరరావు జన్మదిన వేడుకలకు హాజరు

ఖమ్మం, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడంతో పాటు, ప్రజలకు మెరుగైన, సత్వర వైద్య సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావు పేర్కొన్నారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకున్న హరీష్‌ సర్దార్‌ పటేల్‌స్టేడియంలోని హెలీప్యాడ్‌ నుంచి పాత కలెక్టరేట్‌ భవన సముదాయాల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాల వరకు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారధిరెడ్డితో పాటు ఎమ్మెల్సీలు తాతా మధు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, బానోతు హరిప్రియ, రాములునాయక్‌, మెచ్చా నాగేశ్వరరావు తదితరులతో ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత ఖమ్మంలోని మమతా మెడికల్‌ కళాశాల ఆవరణలో జరిగిన ఆ కళాశాల రజోత్సవం, సీపీఐ సీనియర్‌ నేత, మమతా వైద్య విద్యాసంస్థల అధిపతి పువ్వాడ నాగేశ్వరావు జన్మదిన వేడుకలకు హరీ్‌షరావు హాజరయ్యారు. మమతా కాలేజీలో నూతనంగా నిర్మించిన సిల్వర్‌జూబ్లీ బ్లాకులను ఆయన ప్రారంభించారు. పువ్వాడ నాగేశ్వరరావుతో కేక్‌కట్‌చేయించి, 85మందికి కృత్రిమ కాళ్ల అందజేతకు అవసరమైన ఆర్థికసాయాన్ని మంత్రులు అందించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి హరీ్‌షరావు మాట్లాడుతూ కొత్తగూడెం, ఖమ్మంలో వైద్య కళాశాలల ఏర్పాటుతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య చేరువవడంతో పాటు గిరిజన ప్రాంత ప్రజలకు సత్వర వైద్యం సాధ్యమవుతుందన్నారు. సీఎం కేసీఆర్‌కు ఖమ్మంజిల్లాపై ప్రత్యేక అభిమానం ఉందని, ఉమ్మడిజిల్లాలో పదికి పది సీట్లు గెలుచుకుని రాజ్యాధికారంలో భాగం పంచుకోవాలన్నారు. తెలంగాణ ఆవిర్భావ సమయంలో కేవలం 2,850 మెడికల్‌ సీట్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 10వేలకు పెరిగిందన్నారు. ఖమ్మం కళాశాలలో తరగతులను శుక్రవారం సీఎం కేసీఆర్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభిస్తారన్నారు. ఇక ఖమ్మంలో మమతా వైద్య సంస్థలు గిరిజన ప్రాంత ప్రజలకు వైద్యసేవలందించడంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌ మాట్లాడుతూ మమతా మెడికల్‌ కాలేజీది ఒక చరిత్రని, ఈ కాలేజీ ఏర్పాటు సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా.. మంజూరుకు నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, ఆ తర్వాత సీఎంగా చంద్రబాబు, అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎంతో సహకరించారని గుర్తుచేశారు. ఆ తర్వాత ఎంతోమంది నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు సకాలంలో వైద్యం అందించడంతోపాటు వేలసంఖ్యలో వైద్యవిద్యార్థులను తయారు చేయగలిగామన్నారు. ఇక తన కోరిక మేరకు ఖమ్మంలో ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరుచేసిన సీఎం కేసీఆర్‌, మంత్రి హరీ్‌షరావుకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత, ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ప్రతీ జిల్లాలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయడం గర్వకారణమని, పువ్వాడ నాగేశ్వరరావు 85వసంతాలు పూర్తిచేసుకోవడం అదృష్టమన్నారు. మాజీ ఎమ్మెల్సీ, మమత విద్యాసంస్థల అధినేత పువ్వాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ మమతా ఎన్నో కష్టాలు, నష్టాలకు ఓర్చి ఈ వైద్యవిద్యాసంస్థను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. కొందరు ఇబ్బందులు పెట్టినా.. ఎంతోమంది సహకారంతో కళాశాలను నెలకొల్పి గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించగలిగామన్నారు. ఈ సందర్బంగా పువ్వాడ నాగేశ్వరరావు దంపతులను మంత్రి హరీ్‌షరావు, అజయ్‌కుమార్‌ ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. విద్యాసంస్థ సావనీర్‌ను విడుదల చేశారు. ఈ వేడుకల్లో మమతా ఎడ్యుకేషనల్‌ సెక్రటరీ పువ్వాడ జయశ్రీ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, తాతా మధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ, ఖమ్మం జడ్పీచైర్మన లింగాల కమల్‌రాజ్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎంపీ బండి పార్థసారధిరెడ్డి మున్నేరు వరద బాధితుల కు తాను విరాళంగా ప్రకటించిన రూ. కోటి చెక్కులను మంత్రి హరీష్‌ ద్వారా అందజేశారు.

సీతారామాను ఏడాదిలోగా పూర్తిచేస్తాం : మంత్రి హరీష్‌

మమతా మెడికల్‌ కళాశాల రజతోత్సవం అనంతరం మంత్రి పువ్వాడ నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి హరీ్‌షరావు మాట్లాడుతూ.. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించిన ఖమ్మం జిల్లా అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో ప్రేమ అని, అదే ప్రేమతో సీతారామప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. త్వరలోనే కొంత ప్రాంతానికి, వచ్చే ఏడాదినాటికి పూర్తిస్థాయిలో సాగునీరందిస్తామన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రజల వ్యతిరేకపార్టీ అని, కొట్లాటలు తప్ప ఆ పార్టీ ప్రజలకు చేసేదేమీ లేదని, అందుకు ఖమ్మం కాంగ్రెస్‌ కార్యాలయంలో కొట్టుకున్న సంఘటనలే నిదర్శనమన్నారు. ఇప్పుడే ఇలా కొట్టుకుంటే.. ఆ పార్టీకి అధికారం వస్తే పరిస్థితి ఎలా ఉటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇక రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి ప్రభుత్వ ఖజానా నుంచే వేతనాలు ఇస్తామని, ఇందుకు సీఎం కేసీఆర్‌, రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పువ్వాడ అజయ్‌ మాట్లాడుతూ ఈ సారి రాజ్యాధికారంలో మన భాగం పంచుకునేందుకు పదికి పదిసీట్లు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడిజిల్లాలో సీఎం కేసీఆర్‌ రెండు మెడికల్‌ కళాశాలల ఏర్పాటుతోపాటు ఆసుపత్రుల అభివృద్ధిని ప్రోత్సా హం అందించారన్నారు. ఈసమావేశంలో ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్ధసారధిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లారాజేశ్వరరావు, తాతా మధుసూదన, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

నేటినుంచి

వైద్య తరగతులు

వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

ఖమ్మం కలెక్టరేట్‌, సెప్టెంబరు 14 : నూతనంగా ఏర్పాటైన ఖమ్మం వైద్య కళాశాలలో 2023-24 విద్యాసంవత్సర తరగతులను శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆయన విద్యార్థులు, కళాశాల సిబ్బందిని ఉద్దేశించి సందేశాన్ని ఇవ్వనున్నారు. ఇందు కోసం కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. లెక్చర్‌ హాల్లో పెద్ద ఎల్‌ఈడీ స్ర్కీనను ఏర్పాటు చేసి కెమెరాలను అమర్చారు.

Updated Date - 2023-09-15T00:43:28+05:30 IST