ప్రశాంతంగా ‘ద్వితీయ’ పరీక్షలు
ABN , First Publish Date - 2023-03-17T00:19:05+05:30 IST
ఇంటర్ ద్వితీయసంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇరు జిల్లాల్లో మొత్తం 24,867మంది విద్యార్థులకు తొలిరోజు తెలుగు/సంస్కతం పరీక్షకు 23,744మంది హాజరయ్యారు. మొత్తం 1,123మంది గైర్హాజరయ్యారు.
ఇరుజిల్లాల్లో 23,744మంది సెకండియర్ విద్యార్థుల హాజరు
కొన్ని పరీక్ష కేంద్రాల్లో కానరాని సీసీ కెమెరాలు
ఖమ్మం ఖానాపురంహవేలి/కొత్తగూడెం కలెక్టరేట్, మార్చి 16: ఇంటర్ ద్వితీయసంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇరు జిల్లాల్లో మొత్తం 24,867మంది విద్యార్థులకు తొలిరోజు తెలుగు/సంస్కతం పరీక్షకు 23,744మంది హాజరయ్యారు. మొత్తం 1,123మంది గైర్హాజరయ్యారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 15,771మంది విద్యార్థులకుగాను 15,202 మంది హాజరవ్వగా 569 మంది గైరాజరైనట్లు డీఐఈవో రవిబాబు తెలిపారు. వీరి లో జనరల్ విద్యార్థులు 13,680కిగాను 13,240 మంది విద్యార్థులు హాజరయ్యారు. 440 మంది గైరాపజరయ్యారు. ఒకేషనల్‌లో 2,091 మందికి 1,962 మంది హాజరయ్యారు. 129మంది గైర్హాజరయ్యారు.జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీసు కేసులు నమోదుకాలేదని డీఐఈవో తెలిపారు. 38 పరీక్షా కేంద్రాలను హెచపీసీ, డీఈసీ ఫ్లెయింగ్ స్కాడ్స్, సిట్టింగ్ స్కాడ్స్ తనిఖీలు చేశారు. జిల్లా కేంద్రంలో పలు పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ మధుసూదన తనిఖీ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 35 పరీక్షా కేంద్రాలో మొత్తం 9,096మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 8,542 మంది హాజరయ్యారు. 554మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విభాగంలో 7,131మంది పరీక్ష రాయాల్సి ఉండగా 6,716మంది హాజరయ్యారు. 415మంది గైర్హాజరయ్యారు. ఓకేషనల్ విభాగంలో 1,965 మందికి 8,542 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 139మంది గైర్హాజరయ్యారు.
పలు కేంద్రాల్లో కానరాని సీసీ కెమెరాలు
సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించాల్సిన ఇంటర్ వార్షిక పరీక్షలను జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేకుండానే నిర్వహిస్తున్నారు. కొన్ని కేంద్రాలలో సీసీ కెమెరాలు ఉన్నా అవి పనిచేయడం లేదు. వాస్తవానికి పరీక్ష ప్రశ్నాపత్రాలను సీసీ కెమెరాల పరిధిలోనే తెరవాల్సి ఉండగా ఆ నిబంధనలను అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.