నేడు ఖమ్మంలో బీజేపీ నిరుద్యోగ మార్చ్
ABN , First Publish Date - 2023-05-27T00:06:22+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల సంక్షేమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఉద్యోగాలు భర్తీచేయడంలేదని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఖమ్మంలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నారు.

హాజరుకానున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ఖమ్మం, మే 26 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల సంక్షేమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఉద్యోగాలు భర్తీచేయడంలేదని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఖమ్మంలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నారు. ఖమ్మంలోని జడ్పీసెంటర్ నుంచి మయూరిసెంటర్ వరకు పాదయాత్ర, ఆ తర్వాత మయూరిసెంటర్‌లో బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తుండగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కిసానమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎంపీ గరికపాటి మోహనరావు, బీజేపీ ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కోనేరు సత్యనారాయణ తదితరులు పాల్గొనబోతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించిన బీజేపీ.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను అజెండాగా చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ఇటీవల పేపర్‌లీకేజీలతోపాటు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడం ద్వారా నిరుద్యోగ యువతను బీజేపీవైపునకు ఆకర్షించేందుకు బీజేపీ నేతలు వ్యూహం రచిస్తున్నారు. ఖమ్మంలో శనివారం జరిగే ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.