కదిలెనె కలహంసపై
ABN , Publish Date - Dec 23 , 2023 | 12:10 AM
దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల దివ్యక్షేత్రం రామనామ స్మరణతో పులకించింది. అశేష భక్త జన సమూహం శ్రీ రామనామ స్మరణ చేస్తుండగా కలహంసపైన కౌసల్యరాముని జల విహారం శోభాయమానంగా సాగింది. ఇందుకువేదికగా పవిత్ర గౌతమీ నదీతీరం నిలిచింది.ఏటా ముక్కోటి పర్వదినానికి ముందు రోజు జరుగుతున్న గోదావరిలో హంసాలంకృత తెప్పపై సీతారామచం ద్రస్వామిని విహరింపజేయడం అనాధిగా వస్తున్న సంప్రదాయం.
హంసాలకృత తెప్పపై విహరించిన సీతారామచం ద్రస్వామి
పులకరించిన గోదావరీ తీరం
కనులారా వీక్షించినభక్తజనం
ఆకట్టుకున్న బాణసంచా
భద్రాచలం, డిసెంబరు 22: దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల దివ్యక్షేత్రం రామనామ స్మరణతో పులకించింది. అశేష భక్త జన సమూహం శ్రీ రామనామ స్మరణ చేస్తుండగా కలహంసపైన కౌసల్యరాముని జల విహారం శోభాయమానంగా సాగింది. ఇందుకువేదికగా పవిత్ర గౌతమీ నదీతీరం నిలిచింది.ఏటా ముక్కోటి పర్వదినానికి ముందు రోజు జరుగుతున్న గోదావరిలో హంసాలంకృత తెప్పపై సీతారామచం ద్రస్వామిని విహరింపజేయడం అనాధిగా వస్తున్న సంప్రదాయం. ఈ ఉత్సవాన్ని తిలకించాలన్న ఆనందంతో భక్తులు భద్రాద్రికి చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి శ్రీ సీతారామచంద్ర లక్ష్మణస్వాములను గోదావరి నదికి తీసుకొచ్చారు. 5.15 గంటలకి స్వామి వారిని హంసాలంకృత తెప్పపై ఆసీనులను చేశారు. సాయం సంధ్య వేళ 6.06 గంటల సమయంలో సీతారామచంద్రస్వామి వారు హంస పాన్పుపై అలంకరించిన విద్యుదీపాల జిలుగుల కాంతులతో మరింత శోభాయమానంగా దర్శనమిచ్చారు. వేద పండితుల వేద పఠనం, సన్నాయి వాయిద్య మేళాలతో స్వామి వారిని గోదావరి నదిపై ఐదుసార్లు విహరింపజేయడం, మరోవైపు బాణసంచా కాల్పుల మోతతో నదీ తీరం హోరెత్తించింది.
వేద ఘోషతో జల విహారం
తమ ఆరాధ్య దైవమైన భద్రాద్రి రామయ్య గౌతమీలో హంసాలంకృత తెప్పపై జలవిహారం చేయడంతో ఒకసారిగా భక్తగణం పులకించింది. ఒక వైపు వేద మంత్ర ఘోషతో జల విహారం నిర్వహిస్తుండగా మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల నుంచివైకుంఠ రాముని తెప్పోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా జై శ్రీరామ్.. జై జై శ్రీరామ్ అంటూ రామనామ స్మరణ చేశారు. కరకట్టపై భాగం, ఇసుక తిన్నెలపై ఆసీనులైన భక్తులు జగదబిరామునికి నిర్వహించే తెప్పోత్సవాన్ని తిలకించి పులకించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఎస్పీ డాక్టర్ వినీత, అదనపు కలెక్టర్ రాంబాబు, అడిషనల్ ఎస్పీ సాయిమనోహర్, ఏఎస్పీ పరితోష్ పంకజ్, ఆర్డీవో మంగీలాల్, తహసీల్దారు శ్రీనివాసరావు డీఎంహెచవో డాక్టర్ మాలతి భద్రాచలం దేవస్థానం ఈవో ఎల్. రమాదేవి దేవాదాయ శాఖ ఇంజనీరింగు విభాగం సీఈ సీతారాములు, ఈఈ వి.రవీంద్రనాధ్, ఏఈవో భవానీరామకృష్ణారావు, పర్యవేక్షకుడు లింగాల సాయిబాబా, నిరంజనకుమార్, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన , వైదిక సిబ్బంది, వేదపండితులు, పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు.
నేడు వైకుంఠ ఽధాముని దర్శనం
భద్రాచల పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి నాడు గరుఢ వాహనంపై వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించేందుకు భక్తులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. డిసెంబరు 13 నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు సాగగా తొలి పది రోజుల పాటు పగల్‌పత్తు ఉత్సవాలను నిర్వహించారు. పగల్‌పత్తు ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని ఽశుక్రవారం రామాలయంలో తిరుమంగై ఆళ్వార్ పరమపదోత్సవం, వేద పఠనం గావించారు. శనివారం తెల్లవారుజామున ఉత్తరద్వారంలో వైకుంఠ రాముడు భక్తులకు దర్శనమివ్వనుండటంతో అందుకు అనుగుణంగా దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. శనివారం నుంచి రాపత్తు ఉత్సవాలు ప్రారంభం కానుండగా జనవరి 2 వరకు కొనసాగనున్నాయి. అదే రోజు అధ్యయనోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. జనవరి 3 నుంచి 5 వరకు విలాసోత్సవాలు నిర్వహించనున్నారు.
నాటి నుంచి ఈ సంప్రదాయమే
కంచర్ల గోపన్నగా ప్రసిద్ధిగాంచిన భక్తరామదాసు పాల్వంచ పరగణాకు తహసీల్దారుగా ఉన్న కాలం నుంచి వస్తున్న సంప్రదాయంలో భాగంగా వైకుంఠ ఏకాదశి నాడు ముందుగా స్థానిక తహసీల్దారు ముందుగా ప్రత్యేక అభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఆనలైనలో 1610 టికెట్లు అమ్మకం
ఉత్తరద్వార దర్శనాన్ని తిలకించేందుకు ఆనలైన ద్వారా టికెట్ల విక్రయాలు చేపట్టగా శుక్రవారం సాయంత్రం వరకు 1,995 టికెట్లకు గాను 1610 టికెట్లు అమ్ముడయ్యాయి. ఆనలైన నిలిపివేసి మూడు కౌంటర్ల ద్వారా 385 టికెట్లను విక్రయిస్తున్నారు. రూ.1000 విలువ గల ఏ సెక్టార్, రూ.500 విలువ గల సీ, డీ సెక్టార్,లోని టికెట్లుఅమ్ముడైనట్లు తెలిసింది. రూ.500 విలువ గల బీ సెక్టార్లో సాయంత్రం వరకు 200 టికెట్లు, రూ.250 విలువ గల ఈ సెక్టార్‌లో 294 టికెట్లు ఉండగా వాటిని సైతం శనివారం ఉదయం వరకు విక్రయించేందుకు దేవస్థానం వర్గాలు చర్యలు చేపడుతున్నాయి.