అధికారులే తప్పులను ప్రోత్సహిస్తున్నారా?

ABN , First Publish Date - 2023-02-03T23:39:57+05:30 IST

ఉపాధి హామీ సిబ్బంది మస్టర్లు క్లోజ్‌ అయినా వైట్‌నర్‌తో మస్టర్లు దిద్ది వేరే వారు పని చేసినట్లు సంతకాలు పెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారని

అధికారులే తప్పులను ప్రోత్సహిస్తున్నారా?
మస్టర్లలో తప్పుల తడకులు ఉన్నాయని అడిషనల్‌ డీఆర్డీవో సుబ్రహ్మణ్యంకు చూపిస్తున్న తనిఖీ బృందం సభ్యుడు

తనిఖీల్లో గుర్తించిన వాటిపై దృష్టి పెట్టండి

ప్రత్యేకాధికారితో తనిఖీ బృందం వాగ్వాదం

మస్టర్లలో తప్పులు ఉన్నట్లు గుర్తింపు

సామాజిక తనిఖీల్లో వెలుగులోకి

పాల్వంచ రూరల్‌/సూజాతనగర్‌, ఫిబ్రవరి 3: ఉపాధి హామీ సిబ్బంది మస్టర్లు క్లోజ్‌ అయినా వైట్‌నర్‌తో మస్టర్లు దిద్ది వేరే వారు పని చేసినట్లు సంతకాలు పెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారని తనిఖీ బృందం సభ్యులు ప్రజావేదికలో వెల్లడించగా, సామాజిక తనిఖీ ప్రజావేదిక పరిశీలనాధికారి అడిషనల్‌ డీఆర్‌డీవో సుబ్రహ్మణ్యం స్పందించి మధ్యలో మిగతా కూలీలు పనికి వచ్చి ఉండొచ్చు, వారం రోజుల మస్టర్లలో ఒకరే తప్పు చేయకపోయి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. మేము ఇన్ని రోజులు కష్టపడి తనిఖీ చేశాం. కనీసం ఆ తప్పులను గుర్తించండి, కానీ అవి తప్పులు కాదని అంటే తాను అంగీకరించనని ఆవేదనతో ఓ తనిఖీ బృందం సభ్యుడు ఆ పరిశీలనాధికారితో వాగ్వాదానికి దిగాడు. రికవరీ చేయలా వద్దా.. మీ ఇష్టం, కానీ వారికి తప్పులు చేయవద్దని గద్దింపు చర్యలు అయినా తీసుకోండని స్పష్టం చేశారు. దీంతో ఆయన పరిశీలించి చర్యలు తీసుకుంటానన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక జరిగింది. మండల పరిధిలోని 36 పంచాయతీలకు గాను రూ. 25,51,29,641 నిధులతో ఉపాధి హామీ పనులు జరిగాయి. తనిఖీ బృందం సభ్యులు వారి తనిఖీల్లో గుర్తించిన ముఖ్యమైన అంశాలు ఈ విధంగా ఉన్నాయి. అన్ని పంచాయతీల్లో 7 రకాల రిజిస్టర్లను నిర్వహిచడం లేదు. పూర్తి స్థాయిలో జాబ్‌కార్డులు గుర్తించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా మస్టర్లలో తెలుపు రంగు(వైట్‌నర్‌)తో దిద్ది బినామీ పేర్లతో బిల్లుల చెల్లింపులు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. మరణించిన వ్యక్తుల పేరుపై బిల్లులు చెల్లింపులు చేయడం, ఇంకుడుగుంతలు నిర్మించకుండా నిర్మించినట్లు చేసి డబ్బులు కాజేయడం, మస్టర్లలో పీవో, ఏపీవో సంతకలు లేకుండా బిల్లులు చేయడం వంటి తప్పులను గుర్తించామన్నారు. సమావేశంలో జిల్లా టెక్నికల్‌ సెల్‌ అధికారి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ వాసుదేవరావు, ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్‌, ఏపీవో రంగా ఉన్నారు.

సుజాతనగర్‌: ఉపాధి హామీ పథకంలో పని చేయకుండానే కూలీలకు చెల్లింపులు చేసినట్లు సామాజిక తనిఖీ బృందం తేల్చింది. రెండో విడత సామాజిక తనిఖీలో భాగంగా సీతంపేట బంజర, నిమ్మలగూడెం, సింగభూపాలెం, పాత అంజనాపురం, కొత్త అంజనాపురం బేతంపుడి గ్రామ పంచాయతీలలో శుక్రవారం గ్రామసభలు నిర్వహించారు. డీఆర్పీలు ఆయా గ్రామ పంచాయతీలలో గ్రామసభల సందర్బంగా నమోదైన విషయాలను వెల్లడించారు. సింగభూపాలెం పంచాయతీలో కూలీలకు రూ.80,23,561 చెల్లించినట్లు తెలిపారు. 48 మందికి లాండ్‌ లెవలింగ్‌ పనులు చేపట్టారని చాలా వర కు కూలీలకు ఈ పనులు చేయకుండానే చెల్లింపులు జరిపినట్లు గుర్తించామన్నారు. 9 ఊటకుంటల్లో పనులు సరిగ్గా జరగలేదని తేలిందన్నారు. ఎంబీ రిజిష్టర్‌లు సరిగా నిర్వహించలేదని, హాజరు రిజిష్టర్‌లో దిద్దుబాటులు ఉన్న ట్లు గుర్తించామన్నారు. నిమ్మలగూడెం పంచాయతీలో 190 పనులు నిర్వహించారని, పనులకు సంబంధించిన మూడు దశల ఫోటోలు తీయాల్సి ఉండగా ఫోటోలు తీయలేదన్నారు. సీతంపేట బంజర, కొత్త అంజనాపురం, కొత్త అంజనాపురం, బేతంపుడి పంచాయతీలలో నాటిన మొక్కలు ఎక్కువగా చనిపోయాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్పీలు, ఈజిఎస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-03T23:40:02+05:30 IST