వైరా సీటు ఇస్తేనే కాంగ్రెస్‌తో పొత్తు
ABN , First Publish Date - 2023-10-30T00:46:39+05:30 IST
గతంలో కాంగ్రెస్ నేతలు చెప్పినట్టుగా మిర్యాలగూడతోపాటు వైరా అసెంబ్లీ సీట్లు సీపీఎంకు కేటాయిస్తేనే ఆ పార్టీతో పొత్తు ఉంటుందని, లేదంటే ఒంటరిగానే పోటీచేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.
లేదంటే ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ
కాంగ్రెస్ నిర్ణయం కోసం రెండురోజులు వేచి చూస్తాం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
ఖమ్మం కార్పొరేషన, అక్టోబరు 29: గతంలో కాంగ్రెస్ నేతలు చెప్పినట్టుగా మిర్యాలగూడతోపాటు వైరా అసెంబ్లీ సీట్లు సీపీఎంకు కేటాయిస్తేనే ఆ పార్టీతో పొత్తు ఉంటుందని, లేదంటే ఒంటరిగానే పోటీచేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఖమ్మంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ పొత్తుల కోసం కాంగ్రెస్ తమతో చర్చించిందన్నారు. రెండురోజుల్లో కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయం చెప్పకపోతే సీపీఎం అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. లౌకికశక్తుల ఐక్యత కోరుతూ కాంగ్రె్‌సపార్టీ రాష్ట్ర ఇనచార్జ్ మాణిక్‌రావుఠాక్రే పొత్తుల ప్రతిపాదన పెడితే తాము అంగీరించామన్నారు. కానీ కాంగ్రెస్ నిర్లక్ష్యమంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాము రాష్ట్రంలో మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నంతో పాటు ఉమ్మడి జిల్లాలోని భద్రాచలం, పాలేరు, మధిర స్థానాలను ఎంచుకున్నామన్నారు. ఎనిమిది సార్లు గెలిచిన భద్రాచలం సీటును ఇవ్వాలని కోరితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారని, ఆయన సీటు మార్చడం తప్పుడు సంకేతాలు ఇస్తుందని కాంగ్రెస్ నేతలు సదరు స్థానం ఇచ్చేందుకు అంగీకరించలేదన్నారు. అప్పటికీ తాము త్రిపురలో కాంగ్రెస్ అధ్యక్షుడు తమపార్టీ సిట్టింగ్ స్థానాన్ని సీపీఎంకు కేటాయించారని ప్రస్తావించినా వారు అంగీకరించకపోవడంతో ఖమ్మం జిల్లానుంచి ఒక్క స్థానమైనా ఇవ్వాలని కోరుతూ పాలేరు సీటును అడిగామన్నారు. తొలుత కాంగ్రెస్ నేతలు పాలేరు సీటు ఇచ్చేందుకు సముఖత వ్యక్తంచేసినా ఆ తర్వాత కొందరు తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. అయినా పాలేరు సీటు ఇవ్వడం కుదరదన్న కాంగ్రెస్ శుక్రవారం ప్రకటించిన రెండో జాబితాలో ఆ సీటును పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇస్తూ ప్రకటిచిందన్నారు. దాంతో తమపార్టీ కార్యదర్శివర్గ సమావేశం నిర్వహించి వైరా సీటు తీసుకోవాలని నిర్ణయించినట్టు తమ్మినేని పేర్కొన్నారు. దీనిపై అదేరోజు మాజీ మంత్రికి ఫోనచేసి వైరా సీటు కావాలని అడిగామని, అయితే రేవంతరెడ్డి, భట్టి విక్రమార్కతో మాట్లాడిస్తానని సదరు నాయకుడు చెప్పినా ఇంతవరకు ఎవరూ తమతో మాట్లాడలేదన్నారు. చివరకు తానే ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఫోనచేస్తే మిర్యాలగూడతో పాటు ఇంకోసీటు హైదరాబాదు నగరంలో ఇస్తామని చెప్పారన్నారు. వైరా సీటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని చెబితే తాము ఎప్పుడూ అనలేదని భట్టి సమాధానం చెప్పారని తమ్మినేని తెలిపారు. ఇలా తాత్సారం చేసే కాంగ్రెస్ నేతలు తమ వైఖరి మార్చుకోవాలని, రెండురోజుల్లో మిర్యాలగూడతోపాటు వైరాస్థానం ఇచ్చేందుకు సిద్ధమైతే కాంగ్రె్‌సతో పొత్తు పెట్టుకుంటామన్నారు. తమకు కేటాయిస్తానన్న మిర్యాలగూడలో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా భావిస్తున్న ఒక వ్యక్తి స్వతంత్రుడిగా పోటీచేస్తానని చెప్పడం ఎంతవరకు సబబన్నారు. వైరాలోనూ అదే పరిస్థితి ఉంటుందని అంటున్నారని, సీట్లు ఇచ్చినా ఎసరు పెడతామనే రీతిలో కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, సీపీఎం కలిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆ పార్టీనాయకత్వం ఇప్పటికైనా గ్రహించాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం మంగళవారం హైదరాబాదులో జరుగుతుందని, ఆ సమావేశానికి పొలిట్‌బ్యూరో సభ్యులు హాజరవుతారని, ఈలోపు కాంగ్రెస్ తన వైఖరి తేల్చకుంటే ఆ సమావేశంలో ఒక నిర్ణయానికి వస్తామని తమ్మినేని తెలిపారు. విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పోతినేని సుదర్శన, ఎం. సాయిబాబు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఎం కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, రాష్ట్ర నాయుకలు బత్తుల హైమావతి, తదితరులు పాల్గొన్నారు.