వైభవంగా పుష్కర తీర్థ జలాల శోభాయాత్ర
ABN , First Publish Date - 2023-03-19T23:33:01+05:30 IST
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆఽధ్వర్యంలో ఈ నెల 31న నిర్వహించనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి అవసరమైన పుణ్య తీర్థ జలాలను దేశం నలుమూలల నుంచి సేకరించి భద్రాద్రి చేరుకున్న వైదిక సిబ్బందికి ఘన స్వాగతం లభించింది.

పట్టణంలో శోభాయాత్ర
పాల్గొన్న భద్రాద్రి దేవస్థానం ఈవో, వైదిక సిబ్బంది
భద్రాచలం, మార్చి 19: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆఽధ్వర్యంలో ఈ నెల 31న నిర్వహించనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి అవసరమైన పుణ్య తీర్థ జలాలను దేశం నలుమూలల నుంచి సేకరించి భద్రాద్రి చేరుకున్న వైదిక సిబ్బందికి ఘన స్వాగతం లభించింది. ఆదివారం గోదావరి తీరంలో ఉన్న అభయాంజనేయస్వామి ఆలయం నుంచి శేష వాహన పల్లకిలో 12 నదులు, పుష్కరిణిలు, సముద్రాల నుంచి సేకరించిన పుణ్య తీర్ధ జలాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పుష్కర తీర్ధ జలాల శోభయాత్రను వైభవోపేతంగా నిర్వహించారు. ఈ తీర్ధాలను రామాలయంలోని గోదాదేవి అమ్మవారి సన్నిధిలో ఉంచారు. వీటిని ఉగాది నుంచి జరిగే శ్రీరామాయణ మహాక్రతువులో పుష్కర యాగశాలకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం సమయంలో వినియోగించనున్నారు. కార్యక్రమంలో భద్రాద్రి దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి, ఏఈవో శ్రావణ్‌కుమార్, పర్యవేక్షకులు కత్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.