KCR: రైతులకు సీఎం కేసీఆర్ తీపికబురు

ABN , First Publish Date - 2023-05-02T21:19:47+05:30 IST

అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని (grain) కొనుగోలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) స్పష్టంగా చెప్పారు.

KCR: రైతులకు సీఎం కేసీఆర్ తీపికబురు

హైదరాబాద్: అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని (grain) కొనుగోలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) స్పష్టంగా చెప్పారు. మామూలు ధాన్యానికి ఇచ్చిన ధరనే తడిసిన ధాన్యానికి కూడా చెల్లిస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. యాసంగి వరి కోతలు మార్చ్‌లోపే జరిగేలా ఎలాంటి విధానాలు అవలంబించాలో అధ్యయనం చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. అకాల వర్షాల దృష్ట్యా వరి కోతలు మరో 3-4 రోజులు వాయిదా వేసుకుంటే మంచిదని కేసీఆర్ అన్నారు.

ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిశాయి. అకాల వర్షాల కారణంగా పలు మండలాల్లో కోసిన వరి పంట తడిసి ముద్దయింది. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి, బొప్పాపూర్‌, తిమ్మాపూర్‌, రాజన్నపేట, తదితర గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. కేంద్రాల్లోని ధాన్యం వరద నీటికి కొట్టుకుపోయింది. సుమారు 400 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయిందని రైతులు పేర్కొంటున్నారు. కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి పది రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదని, అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గంభీరావుపేట మండల కేంద్రంతోపాటు లింగన్నపేట, ముచ్చర్ల, కొత్తపల్లి, కోళ్లమద్ది, శ్రీగాధ, నర్మాల తదితర గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టిం చింది. కోతకు వచ్చిన పంట దెబ్బతింది.

చందుర్తి మండల కేంద్రంతో పాటు రామన్నపేట, తిమ్మాపూర్‌ తదితర గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. కోతకు వచ్చిన వరితోపాటు మామిడికాయలు, నువ్వులపంట నేలమట్టం అయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. చందుర్తి మండల కేంద్రానికి చెందిన సిరికొండ దేవయ్యకు చెందిన ధాన్యంతో పలువురి రైతుల ధాన్యం వర్షం నీటికి కొట్టుక పోయింది. రేకుల షెడ్లు గాలికి లేచిపోయాయి. మండల వ్యాప్తంగా దాదాపు వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, నువ్వులపంట నష్టం వాటిల్లింది.

రుద్రంగి మండల కేంద్రంలో కురిసిన వడగళ్ల వర్షానికి రైతన్న విలవిల్లాడారు. ఈదురుగాలులు, వడగళ్ల వానకు చేతికి వచ్చిన పంటలు నేలపాలు అయ్యాయి. మండల కేంద్రంలోని మార్కెట్‌ యార్డు, సింగిల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మరొకొంత మంది రైతుల ధాన్యం వర్షం నీటిలో కొట్టుకుపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. కోతకు వచ్చిన వరి నీటిపాలైంది. మ్యాచర్‌కు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు కోరడంతో కేసీఆర్ సర్కారు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది.

Updated Date - 2023-05-02T21:45:51+05:30 IST