‘మన ఊరు...మన బడి’ పనులు పూర్తయ్యేనా?
ABN , First Publish Date - 2023-05-29T00:37:01+05:30 IST
వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటికి ‘మన ఊరు...మన బడి’ పనులన్నింటిని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
- 97 పాఠశాలల్లో పనులు పూర్తి
- 116 పాఠశాలల్లో కొనసాగుతున్న పనులు
- 74 హైస్కూల్స్‌లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు
కరీంనగర్ టౌన్, మే 28: వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటికి ‘మన ఊరు...మన బడి’ పనులన్నింటిని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో ఇప్పటి వరకు సగం పనులు కూడా పూర్తికాలేదు. జూన్ 2 నుంచి బడి బాట కార్యక్రమాన్ని చేపట్టాలని, ఆలోగా మన ఊరు..మన బడి పనులను పూర్తి చేసి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
ఫ జిల్లాలో 230 పాఠశాలలు ఎంపిక
జిల్లాలోని 230 పాఠశాలలను మన ఊరు...మన బడి పథకంలో ఎంపిక చేయగా ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ (ఎఫ్‌టీవో) జనరేట్ అయిన 198 పాఠశాలల్లో అభివృద్ధి పనులను చేపట్టారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్, ఫర్నీచర్, ప్రహారీగోడ, కిచెన్ షెడ్లు, భోజనశాల, మంచినీటి వసతి, విద్యుద్దీకరణ, మరుగుదొడ్ల నిర్మాణాలతోపాటు పాఠశాల అందంగా ఉండే విధంగా పేయింటింగ్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని 230 పాఠశాలల్లో ఆయా అంశాల్లో అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు 92 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. పంచాయతీరాజ్, ఈడబ్ల్యూఐడీసీ, మున్సిపల్ అర్బన్ పబ్లిక్ హెల్త్‌శాఖల ద్వారా పనులు చేపడుతున్నారు. ఇందులో భోజనశాల, కిచెన్‌షెడ్లు, ప్రహరీల నిర్మాణ పనులను ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్నారు. వాటికి సంబంధించిన బిల్లులు ఇంకా చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని 94 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మన ఊరు..మన బడి పథకంలో భాగంగా ఇంటరాక్ట్ ప్లాంట్ ప్లానర్ కింద డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాల్సి ఉండగా 74 స్కూళ్లలో మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగిలిన 20 హైస్కూల్స్‌లో కొన్నిటిలో పనులు తుదిదశకు చేరుకున్నాయి. మరికొన్ని పాఠశాలల్లో మందకొడిగా సాగుతున్నాయి. 116 పాఠశాలల్లో సివిల్ వర్క్స్‌కి సంబంధించిన పనులు పూర్తికావలసి ఉండగా, 97 పాఠశాలల్లో దాదాపు పనులన్నీ పూర్తికావడంతో పెయింటింగ్స్ కూడా వేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు దాదాపు 50 కోట్ల వరకు ఆయా పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించారు.
ఫ జూన్ 2 నుంచి బడిబాట...
జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 12వ తేదీన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను పునఃప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి పాఠశాలలకు పూర్వ వైభవం తెచ్చేందుకు జూన్ 2వ తేదీ నుంచి ఉపాధ్యాయులు విధుల్లో చేరి ఆయా పాఠశాలల పరిధిలో బడిబాట కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించింది. బడీడు పిల్లలు, బడి మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించాలని, ఆలోగా మన ఊరు మన బడిలో పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా తెలుగు మీడియంతోపాటు ఇంగ్లీష్ మీడియంలో కూడా విద్యాబోధన చేస్తున్నందున పాఠశాలల్లో విద్యార్థులను చేర్పిస్తారని భావించారు. గత విద్యాసంవత్సరం నుంచే మన ఊరు..మన బడిలో ఎంపికైన పాఠశాలల్లో పనులు ప్రారంభించినప్పటికీ పనులు నత్తనడకన సాగాయి... పనులను వేగంగా పూర్తిచేసేందుకు కలెక్టర్, అదనపు కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులతోపాటు రాష్ట్రస్థాయి అధికారులు పాఠశాలలను సందర్శించి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. రెండు నెలల నుంచి కొంత వేగం పెరిగినా ఇప్పటి వరకు పనులు పూర్తికాక పోవడంతో జూన్ 2లోగా కాకుండా కనీసం జూన్ 12వ తేదీ పాఠశాలల పునః ప్రారంభం రోజు వరకైనా పనులు పూర్తవుతాయో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 20న విద్యాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి వరకైనా పనులు పూర్తవుతాయో లేదో వేచి చూడాలి.