Share News

అసెంబ్లీలో అడుగుపెట్టేదేవరో..!

ABN , First Publish Date - 2023-12-03T00:34:27+05:30 IST

నిన్నమొన్నటి తమ గెలుపోటములపై లెక్కలు వేసుకున్న అభ్యర్థుల భవితవ్యం ఆదివారం తేలనున్నది.

అసెంబ్లీలో అడుగుపెట్టేదేవరో..!

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

నిన్నమొన్నటి తమ గెలుపోటములపై లెక్కలు వేసుకున్న అభ్యర్థుల భవితవ్యం ఆదివారం తేలనున్నది. అసెంబ్లీలో అడుగుపెట్టేదెవరో, ఇంటిబాట పట్టేదెవరో ప్రజల తీర్పు స్పష్టం చేయనున్నది. ఎవరు గెలుస్తారనే విషయమై రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడనున్నది. నవంబరు 30 జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలోగల రామగుండం, మంథని, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు రామగిరి మండలం సెంటినరీకాలనీలోగల జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో జరగనున్నది. 30న పోలింగ్‌ పూర్తయిన తర్వాత ఈవీఎంలు, వీవీప్యాడ్స్‌, కంట్రోల్‌ యూనిట్లను జేఎన్‌టీయూకి తరలించి భద్రపరిచారు. సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు, పారా మిలిటరీ బలగాల మధ్య గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నది. మొదట పోస్టల్‌ బ్యాలెట్లు, ఇంటి వద్దనే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్న 80 ఏళ్లకు పైబడిన వాళ్లు, దివ్యాంగుల ఓట్లను కూడా లెక్కించనున్నారు. అనంతరం ర్యాండమ్‌గా ఒక్కో నియోజకవర్గం నుంచి డ్రా ద్వారా 5 పోలింగ్‌ బూతులను ఎంపిక చేసి అందులో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు. ఈవీఎంలో నమోదైన ఓట్ల ప్రకారం వీవీ ప్యాట్‌లలో ఉన్న స్లిప్పులతో ట్యాలీ చేయనున్నారు. ఆ తర్వాత బూతుల వారీగా 14 టేబుళ్లలో ఓట్లు లెక్కించనున్నారు. రామగుండం నియోజకవర్గంలో 260 పోలింగ్‌ బూతులు ఉండగా 19 రౌండ్లలో, మంథనిలో 288 పోలింగ్‌ బూతులు ఉండగా 21 రౌండ్లలో, పెద్దపల్లి నియోజకవర్గంలో 21 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్‌కు 20 నుంచి 30 నిమిషాల వరకు సమయం పట్టనున్నది. జిల్లా వ్యాప్తంగా 7,11,727 మంది ఓటర్లకు 5,54,897 మంది 77.96 శాతం ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. అత్యధికంగా మంథని నియోజకవర్గంలో 1,95,635 మంది 82.74 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. రామగుండంలో 1,51,865 మంది, 68.71 శాతం, పెద్దపల్లి నియోజకవర్గంలో 2,07,397 మంది 82.74 శాతం ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మొదట పెద్దపల్లి మండలం, పట్టణం, ఆ తర్వాత కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల, సుల్తానాబాద్‌, ఎలిగేడు, జూలపల్లి మండలాల ఓట్లు లెక్కించనున్నారు. మంథని నియోజకవర్గంలో మొదట రామగిరి, ఆ తర్వాత కమాన్‌పూర్‌, పాలకుర్తి మండలంలోని బూత్‌లు, మంథని, కాటారం, మహదేవ్‌పూర్‌, పలిమెల, మహాముత్తారం, మల్హర్‌, మంథని ముత్తారం మండలాల ఓట్లు వరుసగా లెక్కించనున్నారు. రామగుండం నియోజకవర్గంలో మొదట అంతర్గాం, ఆ తర్వాత పాలకుర్తి, రామగుండం కార్పొరేషన్‌ పరిఽధిలోని ఓట్లను లెక్కించనున్నారు. బూత్‌ల వారీగా ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ఓట్లు పడ్డాయో ఈ ఓట్ల లెక్కింపులో తేలనున్నది.

రెండు పార్టీల మధ్య హోరాహోరీ..

జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల మధ్యనే పోటీ జరిగింది. 2018లో జరిగిన ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి, మంథని నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రామగుండం నుంచి బీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి కోరుకంటి చందర్‌ గెలుపొందారు. ఈసారి కూడా పాత అభ్యర్థులే తలపడ్డారు. ప్రధానంగా పెద్దపల్లిలో బీఆర్‌ఎస్‌ నుంచి దాసరి మనోహర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా చింతకుంట విజయరమణారావు, బీజేపీ నుంచి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, బీఎస్పీ నుంచి దాసరి ఉష, మంథనిలో బీఆర్‌ఎస్‌ నుంచి పుట్ట మధూకర్‌, కాంగ్రెస్‌ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీజేపీ నుంచి చంద్రుపట్ల సునీల్‌రెడ్డి, బీఎస్పీ నుంచి చల్లా నారాయణరెడ్డి, రామగుండంలో బీఆర్‌ఎస్‌ నుంచి కోరుకంటి చందర్‌, కాంగ్రెస్‌ నుంచి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌, బీజేపీ నుంచి కందుల సంధ్యారాణి, ఇండిపెండెంట్‌గా సోమారపు సత్యనారాయణ తదితరులు పోటీపడ్డారు. అయితే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల మధ్యనే ప్రధానంగా పోటీ జరిగింది. నెల రోజులకు పైగా ప్రచారం నిర్వహించిన సదరు అభ్యర్థులు కొందరు పోల్‌ మేనేజ్‌మెంట్‌ కూడా చేశారు. ఓటర్లకు 500 నుంచి వెయ్యి రూపాయల వరకు పంపిణీ చేశారు. డబ్బులే గాకుండా మందు, చీరలు, గడియారాలు తదితర వస్తువులను కూడా పంపిణీ చేశారని ప్రచారం జరుగుతున్నది. పోల్‌ మేనేజ్‌మెంట్‌ను బట్టి ఆయా అభ్యర్థులకు ఓట్లు పడినట్లుగా ఓటింగ్‌ సరళిని బట్టి తెలుస్తున్నది. పెద్దపల్లిలో వరుసగా రెండుసార్లు ఓటమిచెందిన కాంగ్రెస్‌ అభ్యర్థి విజయరమణారావు, రామగుండంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌, మంథనిలో గత ఎన్నికల్లో ఓటమి చెందిన పుట్ట మధూకర్‌లపై ఈ ఎన్నికల్లో సానుభూతి కనబడింది. అయితే ఎక్కడ నలుగురు గుమిగూడినా జిల్లాలోని మూడుస్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే గెలిచే అవకాశాలున్నాయని చర్చించుకుంటున్నారు. బ్యాలెట్‌లో ఏం తేలనున్నదో వేచిచూడాల్సిందే.

Updated Date - 2023-12-03T00:34:31+05:30 IST