ఇంకుడు గుంతలు డబ్బులు ఇంకెప్పుడిస్తారు?

ABN , First Publish Date - 2023-09-04T00:00:29+05:30 IST

ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసిపట్టాలి.. వర్షపు నీటిని వృఽథాగా పోనివ్వకుండా పోకుండా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి.. అంటూ పాలకులు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు. పాలకుల మాటలు విని పేద ప్రజలు సొంత డబ్బులతో ఇంకుడు గుంతలను నిర్మించుకున్నారు.

ఇంకుడు గుంతలు డబ్బులు ఇంకెప్పుడిస్తారు?

చొప్పదండి, సెప్టెంబరు 3: ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసిపట్టాలి.. వర్షపు నీటిని వృఽథాగా పోనివ్వకుండా పోకుండా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి.. అంటూ పాలకులు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు. పాలకుల మాటలు విని పేద ప్రజలు సొంత డబ్బులతో ఇంకుడు గుంతలను నిర్మించుకున్నారు. ఇది చూసిన అధికారులు శభాష్‌ అంటూ గ్రామ ప్రజలను అభినందిస్తూ 2020లో ఆ గ్రామానికి ఉత్తమ పంచాయతీగా అవార్డును అందించారు. అధికారులు మాటలు విని ఇంకుడు గుంతలు నిర్మించుకున్న వారికి మాత్రం డబ్బులు ఇవ్వడం మరిచారు. ఇంకుడు గుంతలు నిర్మించుకున్న గ్రామస్థులు మూడేళ్లుగా బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో 2019లో 420 మంది ఇంకుడు గుంతలను నిర్మించుకున్నారు. ఒక్కో గుంతకు ఉపాధిహామీ పథకం కింద 4,100 రూపాయలను చెల్లించాల్సి ఉంది. 270 మందికి నగదును చెల్లించారు. మిగతా వారికి బిల్లులు రాలేదు. కొవిడ్‌ సమయంలో బిల్లులను పెట్టారు. ఆతర్వాత పట్టించుకోవడం లేదని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల సర్వసభ్య సమావేశంలో ప్రతి సారి ఎంపీటీసీ సింగిరెడ్డి కృష్ణారెడ్డి ఈ సమస్యను ప్రస్తావించినా ఫలితం ఉండడం లేదు. 2020 జనవరి 26న ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టినందుకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును అందించారు.ఉపాధిహామీ పథకంలో నిధులు పుష్కలంగా ఉన్నప్పటికి బిల్లుల చెల్లింపులో అలసత్వం ప్రదర్శిస్తున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాగంపేట గ్రామంలో తమకు ఇంకుడు గుంతల బిల్లులు చెల్లించాలని ఆదివారం పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే రవిశంకర్‌, జిల్లా కలెక్టర్‌, సీఎం కేసీఆర్‌కు బిల్లులు చెల్లించాలని పోస్టు కార్డులు పంపించారు.

- మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా...

- మానుపాటి పోచమ్మ, రాగంపేట

ఇంకుడు గుంత నిర్మించుకుని మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు బిల్లు చెల్లించలేదు. నాలుగు వేల రూపాయల కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ఇప్పటికైనా డబ్బులు ఇవ్వాలి.

Updated Date - 2023-09-04T00:00:29+05:30 IST