Share News

కొత్త మండలాల ఊసేది?

ABN , Publish Date - Dec 19 , 2023 | 12:17 AM

కొత్త మండలాల ఏర్పాటుపై ఆయా ప్రాంతాల ప్రజల్లో ఆందోళన నెలకొన్నది.

కొత్త మండలాల ఊసేది?
గుంజపడుగును మండలంగా ఏర్పాటు చేయాలని కలెక్టరేట్‌ ఎదుట గ్రామస్థుల ఆందోళన(ఫైల్‌)

- ప్రతిపాదనలో గర్రెపల్లి, గుంజపడుగు మండలాలు

- నోటిఫికేషన్‌ జారీ చేయని ప్రభుత్వం

- ఆందోళనలో ఆయా ప్రాంతాల ప్రజలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కొత్త మండలాల ఏర్పాటుపై ఆయా ప్రాంతాల ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. ఈ ఏడాది జనవరిలో రాష్ట్రంలో పదమూడు కొత్త మండలాలు ఏర్పాటు అయ్యాయి. అలాగే రంగారెడ్డి జిల్లా ఇర్విన్‌ మండలాన్ని రెవెన్యూ శాఖ ప్రదిపాదిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేయాలని పేర్కొంది. కానీ జిల్లాలో ప్రతిపాదనలో ఉన్న గర్రెపల్లి, గుంజపడుగులను కొత్తగా మండలాలుగా ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్లు జారీ కాకపోవడంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరాకపోవడం వల్లనే ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్‌ మండలంలోని గర్రెపల్లి, మంథని నియోజకవర్గం మంథని మండలంలోని గుంజపడుగును కాశీపట్నం మండలాలుగా ఏర్పాటుచేయాలని ఆయా గ్రామాల వాసులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు పలుసార్లు ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ రెండు గ్రామాలను మండలాలుగా ఏర్పాటుచేయాలని జిల్లాల పునర్విభజన సందర్భంలోనూ అక్కడి ప్రజలు ప్రతిపాదించారు. కానీ ఆ సమయంలో ప్రభుత్వం వీటిని మండలాలుగా ప్రకటించలేదు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాను కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్లను జిల్లాలుగా ఏర్పాటు చేసింది. అలాగే ఆయా జిల్లాల్లో కొత్త మండలాలను కూడా ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాను 14 మండలాలతో ఏర్పాటు చేశారు. ఉమ్మడి రామగుండం మండలాన్ని రామగుండం, అంతర్గ్గాం, పాలకుర్తి మండలాలుగా విభజించారు. అలాగే కమాన్‌పూర్‌ మండలాన్ని కమాన్‌పూర్‌, రామగిరి మండలాలుగా విభజించారు. కొత్తగా ఏర్పడ్డ రామగిరి మండలంలో ముత్తారం మండలంలోని బుధవారంపేట్‌, ఆదివారంపేట్‌, లద్నాపూర్‌, రాజాపూర్‌ గ్రామాలను విలీనం చేశారు. పాలకుర్తి మండలాన్ని 13 పంచాయతీలతో కలిపి ఏర్పాటు చేశారు. ఇందులో కమాన్‌పూర్‌ మండలానికి చెందిన కన్నాల, రాణాపూర్‌ పంచాయతీలను, వెల్గటూర్‌ మండలంలోని ముంజంపల్లి, మారేడుపల్లి, ఉండేడ గ్రామాలను కలుపుకుని మండలాన్ని ఏర్పాటు చేశారు. ఈ మూడు పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డ ఎండపల్లి మండలంలో విలీనం చేశారు.

ఫ కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలోనే..

కొత్త జిల్లాలను ఏర్పాటుచేసే సమయంలోనే సుల్తానాబాద్‌ మండలంలోని గర్రెపల్లిని గర్రెపల్లి, గొల్లపల్లి, నారాయణరావుపల్లి, సాంబయ్యపల్లి, ఐతరాజుపల్లి, దుబ్బపల్లి, భూపతిపూర్‌, నర్సయ్యపల్లి, బొంతకుంటపల్లె గ్రామపంచాయతీలతో పాటు ఎలిగేడు మండలం బుర్హాన్‌మియాపేట గ్రామాలను కలిపి మండలంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ వచ్చింది. అలాగే మంథని మండలంలోని గుంజపడుగు, ఉప్పట్ల, పోతారం, విలోచవరం, మల్లెపల్లి, నాగారం, కన్నాల, రచ్చపల్లి, అడ్యాల, అక్కెపల్లి, సిద్ధపల్లి, సిరిపురం, దుబ్బపల్లి, చిప్పపల్లి, బెస్తపల్లి, రామగిరి మండలంలోని చందనాపూర్‌, సింగిరెడ్డిపల్లి, పెద్దంపేట్‌, సుందిళ్ల, ముస్త్యాల గ్రామాలను కలిపి గుంజపడుగు మండలంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ మంథని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటైన నాటి నుంచి ఉన్నది. జిల్లాల పునర్విభజన సమయంలో వీటిని మండలాలుగా ఏర్పాటు చేయలేదు. కొత్తగా ప్రతిపాదిస్తున్న గుంజపడుగు, గర్రెపల్లి గ్రామాలు మంథని, సుల్తానాబాద్‌ మండలాల్లో ఉన్నాయి. ఈ రెండు ఒకప్పుడు మేజర్‌ పంచాయతీలు కాగా, ప్రస్తుతం మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. గుంజపడుగు గోదావరి తీరం వెంబడి ఉండడం వల్ల ఇక్కడే కాళేశ్వరం ప్రాజెక్టు సుందిళ్ల బ్యారేజీ, సరస్వతీ పంప్‌హౌస్‌, శాతవాహన, కాకతీయుల నాటి చారిత్రక కట్టడాలు కలిగి ఉన్నాయి. గుంజపడుగులో భాగమైన కాశీపేటలో కాశీ విశ్వేశ్వరస్వామి, శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయాలు, ఇతర దేవాలయాలున్నాయి. ఈ గ్రామం గోదావరిఖని-మంథనికి వెళ్లే ప్రధాన రహదారిపైనే ఉండడం వల్ల మండలంగా ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉంటుందని. మంథని మండలం ఇప్పటికే 34 పంచాయతీలతో ఉందని ఆ ప్రాంత వాసులు అంటున్నారు. గర్రెపల్లి గ్రామం రాజీవ్‌ రహదారిని ఆనుకుని ఉంటుంది. ఈ గ్రామంలో సర్వేనంబర్లు 1603, 1614, 1643, 1645లలో సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇక్కడ ఇప్పటికే సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాలతో పాటు ఆదర్శ పాఠశాల, కస్తూర్భాగాంధి బాలికల గురుకుల విద్యాలయం, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువుల దవాఖాన, జిల్లాలోనే అతిపెద్ద చెరువు, దీని పరిసరాల్లో ప్రైవేట ఇంజినీరింగ్‌ కళాశాల, ఎంబీఏ తదితర కళాశాలలున్నాయి. అలాగే విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, అన్ని రకాల వసతులున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఇర్విన్‌ మండలాన్ని ఏర్పాటు చేయగా, ఎప్పటినుంచో ప్రతిపాదిస్తున్న రెండు మండలాల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకవచ్చి గర్రెపల్లి, గుంజపడుగు మండలాల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే దశల వారీ పోరాటాలకు సిద్ధం అవుతామని ఆయా ప్రాంతాల వాసులు అంటున్నారు.

Updated Date - Dec 19 , 2023 | 12:17 AM