వామ్మో జూన్‌

ABN , First Publish Date - 2023-06-01T00:36:33+05:30 IST

జూన్‌ వస్తుందంటే తల్లిదండ్రుల్లో దడ మొదలవుతుంది. నూతన విద్యాసంవత్సరం ప్రారంభానికి 14 రోజులే గడువు ఉండడంతో అందుకు అనుగుణంగా పిల్లల తల్లిదండ్రులు చదువుల కోసం ఇంటి బడ్జెట్‌ను తయారు చేస్తున్నారు. ఖర్చు భారంగా మారిన పిల్లల భవిష్యత్‌ కోసం వెచ్చించక తప్పదని భావించి ఖర్చులకు వెనుకాడడం లేదు.

వామ్మో జూన్‌

- మధ్యతరగతి తల్లిదండ్రులకు స్కూళ్ల భయం

- డోనేషన్లు, టర్మ్‌ఫీజులు, బ్యాగులు, పుస్తకాల భారం

- సర్కారు పుస్తకాల ధరలు 40 శాతం పెరుగుదల

- ప్రైవేటు బడుల్లో ఫీజుల మోత

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

జూన్‌ వస్తుందంటే తల్లిదండ్రుల్లో దడ మొదలవుతుంది. నూతన విద్యాసంవత్సరం ప్రారంభానికి 14 రోజులే గడువు ఉండడంతో అందుకు అనుగుణంగా పిల్లల తల్లిదండ్రులు చదువుల కోసం ఇంటి బడ్జెట్‌ను తయారు చేస్తున్నారు. ఖర్చు భారంగా మారిన పిల్లల భవిష్యత్‌ కోసం వెచ్చించక తప్పదని భావించి ఖర్చులకు వెనుకాడడం లేదు. సామాన్య, మధ్య తరగతి వారు ప్రైవేటు ఉద్యోగులు ఇందు కోసం కొన్ని నెలల నుంచే తమ ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు ఇతర పనుల కోసం డబ్బులను వెచ్చించకుండా వాయిదా వేసుకుంటున్నారు. ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, బుక్కులు, లంచ్‌బాక్సులు వంటి ఖర్చులకు అప్పుల కోసం పరిగెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. జూన్‌ 12న పాఠశాలలు తెరచు కోనున్నాయి. ఇప్పటికే పుస్తకాలు అందుబాటులోకి రాగా జిల్లాలోని మండలాలకు సైతం తరలించారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ప్రైవేటు దుకాణాల్లో పుస్తకాల అమ్మకాలు మొదలు పెట్టారు. ఈసారి పుస్తకాల ధరలు 40 శాతం పెరిగాయి. ప్రభుత్వం ముద్రించిన పుస్తకాల ధరలు చూస్తే ఇంగ్లీష్‌ మీడియంలో ఆరోతరగతి పుస్తకాలు రూ.783, ఏడో తరగతికి రూ.900, ఎనిమిదో తరగతికి రూ.1130, తొమ్మిదో తరగతికి రూ.1266, పదో తరగతి రూ.1482 పాఠ్యాంశాల పుస్తకాల ధరలు ఉండగా నోటు పుస్తకాల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఒక్కో నోటు బుక్కుపై రూ.6 నుంచి రూ.10 వరకు పెరిగాయి. మరోవైపు స్కూల్‌ ఫీజుల మాట వింటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుకొని ఇంజనీరింగ్‌కు వెళ్లే పిల్లలు ఉంటే బంగారం వంటి వస్తువులు తాకట్టు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు అడ్మిషన్లు, పుస్తకాలు అయిపోతాయంటూ ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. జూన్‌ ఖర్చుల నుంచి ఎలా గట్టెక్కాలో తెలియని పరిస్థితి పేద కుటుంబాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పవర్‌లూం నేత కుటుంబాలు, వ్యవసాయ కుటుంబాలు తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించాలని ఆరాట పడుతున్నాయి. ఇందుకోసం ప్రైవేటు విద్యపై మొగ్గు చూపుతుండడంతో మోయలేని భారంగా మారుతోంది. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడంతో వివిధ రకాల ఫీజుల పేరుతో వసూలు చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారు.

యూనిఫాం.. ఇతర ఖర్చుల భారం

పాఠశాలలు తెరుచుకోవడంతోనే ఫీజులు చెల్లించడం ఒక భారమైతే ఇతర ఖర్చులు ఇబ్బందులకు గురి చేస్తాయి. పిల్లలను పాఠశాలలకు పంపించడానికి యూనిఫాం ఇతర సామగ్రి కొనుగోలు కష్టంగా మారుతుంది. పుస్తకాలు, డ్రెస్‌లు, షూ, సాధారణ దుస్తుల ఖర్చు, బస్సు ఫీజు ఇలా అనేక విషయాలపై తల్లిదండ్రులు లెక్కలు వేసుకుంటారు. కొన్ని పాఠశాలల్లో బయట నోట్‌ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు కొనుగోలుకు ఒప్పుకోరు. పాఠ్యపుస్తకాలు, బ్యాడ్జీలు, పాఠశాలల్లోనే కొనుగోలు చేయడంతో కనీసం ఉద్దెర పొందే పరిస్థితి ఉండదు. యాజమాన్యాలు నిర్ణయించిన రేటుకు తీసుకోవడానికి కూడా పిల్లల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రతీ ఇంటికి అదనంగా రూ.50 వేల ఖర్చు

జూన్‌లో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందటేనే ప్రతీ ఇంటిలో ఎల్‌కేజీ నుంచి పదోతరగతి, ఇంట ర్మీడియట్‌ వరకు టర్మ్‌ఫీజులు, బస్సు రవాణాతోపాటు ఇతర ఖర్చులు కలిపితే రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చవుతుంది. జిల్లాలోకి కార్పొరేట్‌ పాఠ శాలలు రావడంతో పిల్లల చదువుల కోసం మధ్య తరగతి కుటుంబాలు కూడా మొగ్గు చూపుతున్నాయి. ఇంజనీరింగ్‌ చదవాలంటే కళాశాలల్లో ఫీజురీయింబర్స్‌మెంట్‌ మినహాయించిన కళాశాలల ఫీజులు లక్షల్లోనే ఉన్నాయి. మరోవైపు హాస్టల్‌ ఫీజులు అదనపు భారం ఉంటాయి. ప్రైవేటు పాఠశాలల్లో స్కూల్‌ ఫీజులు వేలల్లో ఉన్నాయి. దీనికి తోడు ఈవెంట్స్‌ పేరుతో ఆదనపు వసూళ్లు కూడా ఉన్నాయి. పుస్తకాలతోపాటు బ్యాగ్‌లు టిఫిన్‌ బాక్సుల రేట్లు మండి పోతున్నాయి.

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు

జిల్లాలో 656 పాఠశాలలు ఉండగా 72,079 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో బాలురు 35,681 మంది, బాలికలు 36,398 మంది ఉన్నారు. జిల్లాలో 534 ప్రభుత్వ, 122 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 52,000 మంది చదివితే ప్రైవేటు పాఠశాలల్లో 20,079 మంది ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు బస్సు, యూనిఫాం, బెల్ట్‌, బ్యాడ్జి, టై, ఐడీ కార్డు, డైరీ, పుస్తకాలు, పెన్నులు, పరీక్ష ఫీజులు ఇలా అన్నింటికి వేలల్లోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కేవలం పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు ఇస్తుండగా మిగతా నోటు బుక్కులు, ఇతర వాటికి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. చట్టాలు ఎన్ని వచ్చినా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించడం లేదు. విద్యాశాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. 2006లోనే పుస్తకాల బరువు మోత తగ్గించాలని చిల్డ్రన్‌ స్కూల్‌ బ్యాగ్‌ యాక్ట్‌ వచ్చినా కనీసం పట్టించుకునే వారే లేరు. విద్యార్థుల శరీర బరువులో పుస్తకాల భారం 10 శాతం మించకూడదని నిబంధనలు ఉన్నా 20 నుంచి 30 శాతం బరువు పిల్లలు మోస్తున్నారు.

17 వరకు షెడ్యూల్‌

ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ నెల 17 వరకు విద్యాశాఖ షెడ్యూల్‌ ప్రకటించింది. జూన్‌ 1న మండల, జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలు, 3 నుంచి 9వ తేదీ వరకు బడిబాట, 12న ‘మన ఊరు-మన బడి’ ‘మనబస్తీ-మనబడి’ కార్యక్రమం, 13న తొలిమెట్టు, 14న సామూహిక అక్షరాభ్యాసం, 15న బడి బయట ఉన్న విద్యార్థుల నమోదు, 16న ఇంగ్లీష్‌ మీడియంపై అవగాహన, 17న బాలికల విద్య, కేరియర్‌ గైడెన్స్‌పై అవగాహన కల్పించనున్నారు. విద్యార్థుల నమోదుపై టీచర్లు, హెచ్‌ఎంలకు ప్రోత్సాహకాలు అందజేయనున్నారు.

పాఠశాలల ఎంపికలో జాగ్రత్తలు

- పాఠశాలకు గుర్తింపు ఉందా? లేదా? అనే విషయాలను తెలుసుకోవాలి. గుర్తింపు ఉంటే ఎన్ని తరగతుల వరకు ఉందనే అంశాన్ని పరిశీలించాలి.

- బోధన వివరాలు తెలుసుకోవాలి. ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎంత వరకు చదువుకున్నారు. టీటీసీ, బీఈడీ చేసినవారా? కాదా? చూడాలి.

- ఐదేళ్లుగా విద్య సంస్థ ఉత్తీర్ణత శాతం గమనించాలి. చదువులో వెనుకబడిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహం ప్రత్యేక తరగతులపై వాకాబు చేయాలి.

- విద్య సంస్థ అద్దె భవనంలో కొనసాగుతుందా? సౌకర్యాలు ఉన్నాయా? పరిసరాలు ఇతర అంశాలను చూడాలి. తరగతి గదులు, గాలి వెలుతురు అంశాలను పరిశీలించాలి.

- తాగు నీటి వసతి, ప్రయోగ శాల, సైన్స్‌ పరికరాలు, వివిధ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయా? అనే విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా మూత్రశాలలు, మరుగుదొడ్ల సౌకర్యంపై పరిశీలించాలి.

- క్రీడా మైదానం, పరికరాలు, పీఈటీ, పీడీ, ఉన్నారా? కంఫ్యూటర్‌ ల్యాబ్‌ ఫ్యాకల్టీ వంటి వివరాలు తెలుసుకోవాలి.

- బస్సు సౌకర్యం ఉంటే డ్రైవర్‌ పనితీరు చూడాలి.

- ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒలంపియాడ్‌, కాన్సెప్ట్‌, టెక్నో స్కూళ్ల పేరుతో ప్రచారం చేసుకోవద్దు.

- విద్యార్థులకు యూనిఫాం, నోట్‌ బుక్కులు ఫలాన చోటనే కొనాలనే నిబంధనలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. కలెక్టర్‌, విద్యాశాఖ అధికారి, జిల్లా ఆడిట్‌ ఆఫీసర్‌తో ఏర్పాటైన రెగ్యూటేటర్‌ కమిటీ నిర్ణయించిన ఫీజులనే చెల్లించాలి.

Updated Date - 2023-06-01T00:36:33+05:30 IST