ప్రజల తీర్పును శిరసా వహిస్తాం
ABN , First Publish Date - 2023-12-05T00:05:16+05:30 IST
రామగుండం నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తున్నామని, ఫలితాలు, జయాపజయాలు ఎలా ఉన్నా ఎళ్లప్పుడూ ప్రజల పక్షానే నిలబడి ఉంటామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం స్థానిక చౌరస్తా సమీపంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
- మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని, డిసెంబరు 4: రామగుండం నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తున్నామని, ఫలితాలు, జయాపజయాలు ఎలా ఉన్నా ఎళ్లప్పుడూ ప్రజల పక్షానే నిలబడి ఉంటామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం స్థానిక చౌరస్తా సమీపంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ గెలుపు కోసం రామగుండం నియోజకవర్గంలో కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులకు చందర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఓటు వేసిన ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైననాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించిందన్నారు. అసత్య ప్రచారాలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అమలు కాని వాగ్ధానాలతో ప్రజలను ఆశ చూపి ఎన్నికల్లో గెలిచారని చందర్ చెప్పారు. హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు, ఈ ప్రాంతానికి మక్కాన్‌సింగ్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన తమ కార్యకర్త ఎంచర్ల మహేష్‌పై ఆదివారం కొందరు దాడి చేశారన్నారు. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు, అభియోగాలు చేసుకోవడం సాధారణమని, దానిని కక్షసాధింపు ధోరణితో దాడికి పాల్పడడం అమానుషమని చందర్ అన్నారు. తమ కార్యకర్తలకు, యకులకు ఏం జరిగినా ఎమ్మెల్యే మక్కాన్‌సింగే బాధ్యత వహించాలని చందర్ పేర్కొన్నారు. అయితే తమ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటానని, ఎవరూ అధైర్య పడవద్దని చందర్ చెప్పారు. పదవులు లేని సందర్భంలోనే తెలంగాణ కోసం కాంగ్రెస్‌తో కలబడి, నిలబడి ఉన్నామని, పదవి ఉన్నా, లేకున్నా ప్రజల మధ్యనే ఉండి సేవ చేస్తానని చెప్పారు. పదవులు వస్తాయని గులాబీ కండువా కప్పుకోలేదని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మాత్రమే రాజకీయాలు చేస్తున్నామన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో రామగుండం అభివృద్ధికి సహరించిన కేసీఆర్, కేటీఆర్‌లకు చందర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు కౌశిక హరి, మూల విజయారెడ్డి, జడ్పీటీసీ ఆముల నారాయణ, గణముక్కుల తిరుపతి, కల్వచర్ల కృష్ణవేణి, సాగంటి శంకర్, జాహెద్‌పాషా, రాకం వేణు, దుబాసి మల్లేష్, కొలిపాక మధుకర్‌రెడ్డి పాల్గొన్నారు.