Share News

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనను అందిస్తాం

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:48 AM

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనను అందిస్తామని, పదిహేను రోజుల్లో మరో రెండు గ్యారంటీ పథకాలను అమల్లోకి తీసుకు వస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనను అందిస్తాం
పెద్దపల్లిలో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్‌బాబు

- పదిహేను రోజుల్లో మరో రెండు గ్యారంటీల అమలు

- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

పెద్దపల్లి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనను అందిస్తామని, పదిహేను రోజుల్లో మరో రెండు గ్యారంటీ పథకాలను అమల్లోకి తీసుకు వస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా ఆదివారం జిల్లాకు వచ్చారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో ఆయనకు ప్రభుత్వ విప్‌ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌, సుల్తానాబాద్‌లో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి పెద్దపల్లి పట్టణం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన కమాన్‌ చౌరస్తాలోమాట్లాడుతూ మంథని, రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచి మమ్మల్ని భారీ మెజారిటీలతో గెలిపించారని, ఈ ప్రాంత అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తామని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి, జవాబుదారీతనం పెంపోందెలా పాలన అందిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, వచ్చే మార్చి నెలాఖరు వరకు తీసుకోవాల్సిన రుణాలను ముందుగానే తీసుకున్నారని అన్నారు. అన్ని శాఖల శ్వేత పత్రాలను విడుదల చేస్తామన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే మహాలక్ష్మిలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. మరో పదిహేను రోజుల్లో రెండు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. రామగుండం ప్రాంతంలో ఉన్న భారీ పరిశ్రమలకు అనుబంధ పరిశ్రమలు, సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను పెంచేలా ప్రజలకు జవాబుదారితనంతో సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేసే విధంగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీమాట నిలబెట్టుకుంటామని మంత్రి తెలిపారు. పెద్దపల్లి అభివృద్ధికి ఎమ్మెల్యే విజయరమణారావు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, పదిరోజుల్లో అనేకసార్లు పెద్దపల్లి, సుల్తానాబాద్‌కు బైపాస్‌ రోడ్డు మంజూరు చేయాలని, పెద్దపల్లికి ఆర్టీసీ బస్‌ డిపో మంజూరు చేయాలని కోరారన్నారు. తప్పకుండా పెద్దపల్లి అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ మాట నిలబెడతామని, ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు.

ప్రభుత్వ విప్‌ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాలనపై నమ్మకంతో తమను గెలిపించిన ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ పెద్దపల్లిలో బైపాస్‌ రోడ్‌ నిర్మించాలని, బస్‌ డిపో ఏర్పాటు సహకారం అందించాలని కోరారు. జిల్లా కేంద్రంగా ఉన్న పెద్దపల్లిలో ప్రభుత్వ పాలసీ ప్రకారం సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందేవిధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసే బాధ్యత మనందరిపై ఉందని, పెద్దపల్లి అభివృద్ధికి మంత్రి సంపూర్ణ సహకారం అందించాలని ఎమ్మెల్యే కోరారు.

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ రామగుండం ప్రాంతం అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎల్‌ రాజయ్య, గోపగాని సారయ్య గౌడ్‌, అంతటి అన్నయ్య, కోట శ్రీనివాస్‌గౌడ్‌, మస్రత్‌, సందవేని రాజేందర్‌, కొలిపాక శ్రీనివాస్‌, నూగిళ్ల మల్లయ్య, బూతగడ్డ సంపత్‌, తూముల సుభాష్‌ రావు, నెత్తెట్ల కుమార్‌ యాదవ్‌, ఈర్ల స్వరూప, తాడూరి పుష్పకళ, శ్రీమాన్‌, ఉప్పు స్వరూప రాజు, అమ్రిష్‌, సురేష్‌ గౌడ్‌, నర్సింహ యాదవ్‌, ఓదెలు యాదవ్‌, పెద్దెల్లి ప్రకాష్‌, గంగుల వెంకటేష్‌, గండు సంజీవ్‌, అమిరిశెట్టి రామస్వామి, పూదరి మహేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:48 AM