జిల్లాలో వడగళ్ల వాన

ABN , First Publish Date - 2023-03-18T23:23:39+05:30 IST

జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.

జిల్లాలో వడగళ్ల వాన
గంగాధర మండలం మల్లాపూర్‌లో కురిసిన వడగళ్లు, వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో కురిసిన వడగళ్లను చూపిస్తున్న యువకుడు

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 18: జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. తిమ్మాపూర్‌, మానకొండూర్‌, కేశవపట్నం, హుజూరాబాద్‌, సైదాపూర్‌, చిగురుమామిడి, గన్నేరువరం మండలాల్లో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమై భారీ వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.

రామడుగు: రామడుగు మండలంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. గత రెండు రోజులుగా చిరుజల్లులకే పరిమితమైన వర్షం ఒక్కసారిగా విజృంభించింది. శనివారం సాయంత్రం వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. వెదిర, దేశరాజుపల్లి, వెలిచాల, కిష్టాపూర్‌ గ్రామాల్లో భారీ స్థాయిలో వడగళ్లు కురిశాయి. సుమారు అరకిలో బరువుగల వడగళ్లు కురియడంతో వరిపొలాలు, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వెదిరలోని ఆదిత్య కోళ్లఫారం పైకప్పు వడగళ్ల తాకిడికి ధ్వంసమయ్యింది. రహదారిపై ఆగిన బస్సులు, కార్ల అద్దాలు పగిలిపోయాయి. దత్తోజీపేట, రామడుగు, లక్ష్మీపూర్‌, తిర్మలాపూర్‌ గ్రామంలో వడగళ్ల వాన కురిసింది. మండల వ్యాప్తంగా సుమారు వెయ్యి ఎకరాల వరిపంట, వంద ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు. సుమారు కోటి రూపాయల మేరకు నష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రామడుగు 15 నుంచి 20 నిమిషాలపాటు వడగండ్ల వాన కురియడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

చొప్పదండి: చొప్పదండిలో వడగళ్ల వర్షం కురిసింది. శనివారం సాయంత్రం దాదాపు అరగంటపాటు వర్షం కురవడంతో కూరగాయల పంటలకు నష్టం జరిగింది. పలు గ్రామాల్లో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి.

గంగాధర: మండలంలో కురిసిన వడగళ్ల వాన రైతులకు అపార నష్టం కలిగించింది. వడగళ్లు కుప్పలు కుప్పలుగా పడ్డాయి. మండల వ్యాప్తంగా 80 శాతం వరి ప్రస్తుతం గొలక దశలో ఉంది. వడగళ్ల వానతో పూర్తిగా దెబ్బతిన్నది. కాత దశలోని ఉన్న మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల్లో మొక్క జొన్న పంట నేలవాలింది.

వీణవంక: మండల వ్యాప్తంగా వడగళ్ల వాన కురిసింది. అకాల వర్షాలతో రైతులకు అపార నష్టం జరిగింది. చేతికందిన పంట వరుణుడి రాకతో దెబ్బతినడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.

మానకొండూర్‌: మండలంలోని వేగురపల్లి, ఊటూర్‌ గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. వర్షానికి మండల వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఫ జమ్మికుంట రూరల్‌: మండలంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. మండలంలో వందల ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-03-18T23:24:11+05:30 IST