వడ.. దడ
ABN , First Publish Date - 2023-05-14T00:38:02+05:30 IST
ఎండలు, వడగాల్పులు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు దడపుట్టిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో వారం రోజుల క్రితం వరకు వాతావరణం కొంత చల్లగా ఉంది. రెండు రోజుల నుంచి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి.
- నేడు, రేపు మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
- పగటి వేళల్లో నిర్మానుష్యంగా రద్దీ ప్రదేశాలు
- ఉక్కపోతతో ఇంట్లో నుంచి కదలని జిల్లా వాసులు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
ఎండలు, వడగాల్పులు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు దడపుట్టిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో వారం రోజుల క్రితం వరకు వాతావరణం కొంత చల్లగా ఉంది. రెండు రోజుల నుంచి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. భగభగ మండే ఎండలను చూసి జనం ఇంట్లో నుంచి రావడానికి జంకుతున్నారు. అవసరం మేరకే బయటకు వస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఉక్కపోత జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలతోపాటు రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42.5 డిగ్రీలు నమోదుకాగా కనిష్ఠ ఉష్ణోగ్రత 21.2 డిగ్రీలుగా నమోదైంది. మరో రెండు రోజులపాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆదివారం 44 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొంది.
నిర్మానుష్యంగా రోడ్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎప్పుడూ రద్దీగా ఉంటే మార్కెట్ ఏరియా, పెద్దబజార్, పాతబస్టాండ్, గాంధీచౌక్, అంబేద్కర్ చౌరస్తా, వెంకంపేట రోడ్, గోపాల్‌నగర్, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రతకు భయపడి జనాలు కనిపించడం లేదు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. 11 గంటల వరకే జనాలు ఇళ్లలోకి చేరుకుంటున్నారు. మళ్లీ సాయంత్రం 6 గంటల వరకు ఎవరూ బయటకు రావడం లేదు. ఎండ తీవ్రత పెరుగుతుండడంతో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. తలకు రక్షణగా గొడుగు, రుమాలు, తెల్లని టోపీ ధరించాలని, నీరు ఎక్కువగా తాగాలని, మాంసం, మద్యానికి దూరంగా ఉండాలని పేర్కొంటున్నారు.