ప్రారంభానికి నోచుకోని పనులు

ABN , First Publish Date - 2023-04-01T00:42:01+05:30 IST

జిల్లాలో పలు పంచాయతీలకు సొంతగూడు అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో గిరిజన తండాలు, అనుబంధ గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసింది.

ప్రారంభానికి నోచుకోని పనులు

- జిల్లాకు కొత్తగా 117 పంచాయతీ భవనాలు మంజూరు

- 20 చోట్ల మాత్రమే నిర్మాణాలు

- పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

జగిత్యాల, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు పంచాయతీలకు సొంతగూడు అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో గిరిజన తండాలు, అనుబంధ గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. పలు చోట్ల తాత్కాలికంగా అద్దె, ప్రభుత్వ, పాత మహిళా మండలి భవనాల్లో కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. సుమారు నాలుగేళ్ల క్రితం 500 జనాభా దాటిన అనుబంధ గ్రామాలు, తండాలను అప్‌గ్రేడ్‌ చేయడంతో జిల్లాలో ఏర్పడిన 60 పంచాయతీలతో కలిసి సంఖ్య 380కు చేరుకుంది. ఇందులో పాత గ్రామపంచాయతీలకు కొన్నింటికి సొంత భవనాలున్నాయి. ఇందులో కొన్ని శిథిలావస్థలో ఉండడం, మరికొన్నింటికి సరిపడే విధంగా లేకపోవడం, ఇంకొన్ని ఇరుకుగా ఉండడం వంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కాగా ప్రభుత్వం ఇటీవల పంచాయతీలకు సొంత భవనాలను సమకూర్చడానికి అవసరమైన నిధులను విడుదల చేసింది. ఉపాధిహామి పథకం కింద ఒక్కో భవనానికి రూ. 20 కోట్ల నిధులను కేటాయించింది. పనులను పంచాయతీరాజ్‌శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గడువు సమీపిస్తున్నా ఇప్పటి వరకు కొన్ని చోట్ల మాత్రమే ప్రారంభమయ్యాయి.

- పంచాయతీ భవనాలు మంజూరు ఇలా..

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 117 పంచాయతీ భవనాలకు నిధులు మంజూరు అయ్యాయి. ఇందులో చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని కొడిమ్యాల మండలంలో తొమ్మిది పంచాయతీలకు, మల్యాల మండలంలో ఆరు పంచాయతీలకు, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బుగ్గారం మండలంలో మూడు పంచాయతీలకు, ధర్మపురి మండలంలో నాలుగు పంచాయతీలకు, గొల్లపల్లి మండలంలో ఏడు పంచాయతీలకు, పెగడపల్లి మండలంలో మూడు పంచాయతీలకు, వెల్గటూరు మండలంలో నాలుగు పంచాయతీలకు, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం పరిదిలోని బీర్‌పూర్‌ మండలంలో ఆరు పంచాయతీలకు, జగిత్యాల అర్బన్‌ మండలంలో రెండు పంచాయతీలకు, జగిత్యాల రూరల్‌ మండలంలో 15 పంచాయతీలకు, రాయికల్‌ మండలంలో 11 పంచాయతీలకు, సారంగపూర్‌ మండలంలో ఆరు పంచాయతీ భవనాలకు నిధులు మంజూరు అయ్యాయి. అదేవిదంగా కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలంలో నాలుగు పంచాయతీలకు, కోరుట్ల మండలంలో మూడు పంచాయతీలకు, మల్లాపూర్‌ మండలంలో ఎనిమిది పంచాయతీలకు, మెట్‌పల్లి మండలంలో 10 పంచాయతీలకు, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్‌ మండలంలో ఐదు పంచాయతీలకు, మేడిపల్లి మండలంలో నాలుగు పంచాయతీ భవనాలకు నిధులు మంజూరు అయ్యాయి.

- ముందుకు సాగని పనులు..

జిల్లావ్యాప్తంగా అధికసంఖ్యలో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ కొన్ని చోట్ల మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు కేవలం 20 చోట్ల మాత్రమే జీపీ భవనాల నిర్మాణ పనులు ప్రారంభించారు. మిగిలిన చోట్ల వివిధ కారణాలతో పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. కొన్ని చోట్ల భవనాల నిర్మాణానికి అనువైన స్థలం లభించకపోవడం, మరికొన్ని చోట్ల పాత భవనాలను కూల్చివేయడానికి అనుమతి లభించకపోవడం, ఇంకొన్ని ప్రాంతాల్లో వివాదాలు చోటుచేసుకోవడం, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం తదితర కారణాల వల్ల అనేక చోట్ల పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించకపోవడంతో పనులకు మోక్షం లభించడం లేదు. ఇప్పటికైనా అవసరమైన చర్యలు తీసుకొని గ్రామపంచాయతీలకు సొంత గూడు కల్పించడానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సాధ్యమైనంత తొందరలో ప్రారంభిస్తాం

- రహమన్‌, పంచాయతీరాజ్‌ ఈఈ, జగిత్యాల

జిల్లాలో నిధులు మంజూరు అయిన ప్రాంతాల్లో గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను సాధ్యమైనంత తొందరలో ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాము. జిల్లాకు 117 పంచాయతీ భవనాలు మంజూరు అయ్యాయి. ఇందులో ఇప్పటివరకు సుమారు 20 పంచాయతీ భవన పనులను ప్రారంభించాము. మిగిలిన పనులు ప్రారంభించడానికి కృషి చేస్తున్నాము.

Updated Date - 2023-04-01T00:42:01+05:30 IST