టీ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీలో ఇద్దరికి చోటు

ABN , First Publish Date - 2023-07-21T23:58:47+05:30 IST

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు లభించింది. రాష్ట్ర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కమిటీకి అత్యంత ప్రాధాన్యం ఉన్నది. జగిత్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పెద్దపల్లి జిల్లా మంథని శాసనసభ్యుడు శ్రీధర్‌బాబుకు కమిటీలో అవకాశం కల్పించారు.

టీ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీలో ఇద్దరికి చోటు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు లభించింది. రాష్ట్ర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కమిటీకి అత్యంత ప్రాధాన్యం ఉన్నది. జగిత్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పెద్దపల్లి జిల్లా మంథని శాసనసభ్యుడు శ్రీధర్‌బాబుకు కమిటీలో అవకాశం కల్పించారు. టీపీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రస్తుత ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు ఈ కమిటీలో చోటు దక్కకపోవడం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి, అసెంబ్లీ స్థానానికి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో అత్యంత కీలకమైన ఎన్నికల కమిటీలో అవకాశం దక్కలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని అధ్యక్షుడిగా, మరో 25 మందిని సభ్యులుగా, యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షులు, సేవాదళ్‌ చీఫ్‌ ఆర్గనైజర్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కమిటీని నియమించారు. పొన్నం ప్రభాకర్‌ సమకాలీనులు ఎందరో ఈ కమిటీలో చోటు దక్కించుకోగా ఆయనకు జాతీయ నాయకత్వం అవకాశం కట్టబెట్టకపోవడం రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎవరిని పోటీలో నిలిపితే బాగుంటుందో ఈ ఎన్నికల కమిటీ సూచిస్తుంది. ఒక్కో నియోజకవర్గంలో కొందరి అభ్యర్థిత్వాలను ఈ కమిటీ కేంద్ర నాయకత్వం పరిశీలనకు పంపిస్తుంది. ఇలాంటి కీలక కమిటీలో సీనియర్‌ నాయకుడిగా ఉన్న పొన్నం ప్రభాకర్‌కు చోటు కల్పించకపోవడం ఆయన ప్రాధాన్యత అధిష్టానం తగ్గించినట్లేనని భావిస్తున్నారు. ఈ విషయంలో పొన్నం ప్రభాకర్‌ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. తాను పోటీ చేయనున్న పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి నిలిపే అభ్యర్థుల విషయంలో గతంలో ఆయన మాట చెల్లుబాటయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు ఎన్నికల కమిటీ ఆయన ప్రతిపాదించిన పేర్లను పరిశీలించినా మార్పులు, చేర్పులు చేసే విషయంలో స్వతంత్రంగా వ్యవహరించడానికి అవకాశం కలుగుతుంది. ఆయన ఈ కమిటీలో ఉంటే తన నియోజకవర్గ పరిధిలోనే కాకుండా జిల్లాలో, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అభ్యర్థుల పేర్లను కమిటీ దృష్టికి తీసుకువచ్చి వారి పేర్లను అధిష్టానం వద్దకు పంపించడానికి పట్టుబట్టే అవకాశం ఉండేది. ప్రస్తుతం అది లేకుండా పోవడంతో ప్రభాకర్‌ అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. 37 మందితో మూడు రోజుల క్రితం ఏఐసీసీ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీని కూడా నియమించింది. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ ప్రచార కమిటీ చైర్మన్‌గా, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కో-చైర్మన్‌గా, సిరిసిల్ల జిల్లాకు చెందిన సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేన్‌ను కమిటీ కన్వీనర్‌గా నియమించారు. ఈ కమిటీలో కూడా పొన్నం ప్రభాకర్‌కు చోటు దక్కలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పొన్నం ప్రభాకర్‌కు ఉన్న విబేధాల కారణంగానే అత్యంత కీలకమైన ఈ కమిటీలలో ఆయనకు చోటు కల్పించలేదనే ప్రచారం జరుగుతున్నది. రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాలలో చక్రం తిప్పే పొన్నం ప్రభాకర్‌కు ఈ పరిణామాలు మింగుడు పడడం లేదనే చర్చ జరుగుతోంది.

Updated Date - 2023-07-21T23:58:47+05:30 IST