నేడు శ్రీరామనవమి

ABN , First Publish Date - 2023-03-30T00:41:22+05:30 IST

సమాజ విలువలు, ధర్మాలు, ఉన్నత జీవన విధానాన్ని లోకానికి అందించిన శ్రీరాముడు జన్మించిన నవమి నాడే కల్యాణాన్ని జరపడం సంప్రదాయంగా వస్తున్నది.

నేడు శ్రీరామనవమి
ముస్తాబైన తీగలగుట్టపల్లి రామాలయం, ఇల్లందకుంటలో కల్యాణానికి ముస్తాబైన కల్యాణ మండపం

కరీంనగర్‌ కల్చరల్‌, మార్చి 29: సమాజ విలువలు, ధర్మాలు, ఉన్నత జీవన విధానాన్ని లోకానికి అందించిన శ్రీరాముడు జన్మించిన నవమి నాడే కల్యాణాన్ని జరపడం సంప్రదాయంగా వస్తున్నది. రాముడిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రవచనం. చైత్రశుద్ధ పాడ్యమి, ఉగాది నుంచి నవమి వరకు వసంతరాత్రులు జరిపి కల్యాణాన్ని నిర్వహిస్తారు. ధర్మసంస్థాపనాకార్యాన్ని రాముడు నిర్వహించాడు. అందుకే రామోవిగ్రహవాన్‌ ధర్మః అంటుంది శాస్త్రం. శ్రీరామనవమి పర్వదినాన్ని జిల్లా వ్యాప్తంగా గురువారం జరుపుకోనున్నారు.

ఆలయాల్లో ఏర్పాట్లు...

కరీంనగర్‌లోని రాముడికి సంబంధించిన సప్తగిరికాలని, వావిలాలపల్లి, గాంధీరోడ్‌, దేవుళ్లపురి రామాలయాలతో పాటు పలు ఆలయాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు, నీటి వసతి, ప్రత్యేక వేదికలు, అన్నదానం వంటి ఏర్పాటు చేయగా ఆలయాలను విద్యుద్దీపాలు, షామియానాలు, పుష్పమాలలు, మామిడి తోరణాలతో అలంకరించారు. ఉత్సవ మూర్తులను అలంకరించి ఎదుర్కోలు వేడుకను నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కల్యాణాలు వైభవోపేతంగా జరగనున్నాయి.

ఇల్లందకుంటలో..

ఇల్లందకుంట: మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే స్వామివారి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు.చలువ పందిళ్లు, ఎల్‌ఈడీ స్ర్కీన్లు, విద్యుత్‌ దీపాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి కల్యాణ మండపాన్ని పూలతో అలంకరించారు. గురువారం ఉదయం 9 గంటలకు పూజారోహణం, అగ్ని ప్రతిష్ఠ, 10 గంటలకు ఎదుర్కోళ్లు, మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. స్వామి వారి కల్యాణం తిలకించేందుకు సుమారు 60 వేల మంది భక్తులు హాజరు కానున్నారు. జమ్మికుంట రా రైస్‌ మిల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షబంధనం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వెంకన్న తెలిపారు.

ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ శ్రీనివాస్‌

సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే స్వామివారి కల్యాణ ఏర్పాట్లను లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ శ్రీనివాస్‌ బుధవారం పరిశీలించారు. కల్యాణ మండపం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గ్యాలరీలు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. వీఐపీలు వచ్చేటప్పుడు తోపులాట లేకుండా చూడాలని, వీఐపీ గ్యాలరీల వద్ద పరిమితంగా జనాలు ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భోజనాల వద్ద గ్యాలరీలు ఎక్కువగా ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కల్యాణ మండప ముఖ ద్వారం వీఐపీలు వచ్చే సమయంలో పోలీస్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాతరకు సుమారు 60వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా, రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల పిక్‌ పాకెటింగ్‌ లాంటివి జరగకుండా చూడాలన్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాలు చేశామని తెలిపారు. ఆయన వెంట ఈవో వెంకన్న, ఏసీపీలు వెంకట్‌రెడ్డి, ప్రతాప్‌, సత్యనారాయణ, సీఐలు జివ్వాజి సురేష్‌, రాంచందర్‌రావు, ఎస్‌ఐలు తోట తిరుపతి, శేఖర్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-03-30T00:41:22+05:30 IST