బీఆర్‌ఎస్‌లో టికెట్‌ ఫీవర్‌

ABN , First Publish Date - 2023-06-01T00:44:48+05:30 IST

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో నలుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు లభించడం డౌటేనని తెలుస్తున్నది.

  బీఆర్‌ఎస్‌లో టికెట్‌ ఫీవర్‌

- ఉమ్మడి జిల్లాలో నలుగురు సిట్టింగ్‌లకు మళ్లీ అవకాశంపై అనుమానాలు

- ప్రజా వ్యతిరేకత, అవినీతి, అవిధేయత కారణం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో నలుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు లభించడం డౌటేనని తెలుస్తున్నది. ఒకరి సంగతి అటూ ఇటుగా ఉన్నా ముగ్గురికి మాత్రం టికెట్‌ వచ్చే అవకాశం లేదని తెలుస్తున్నది. మరో రెండు స్థానాల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం లభించనున్నదని సమాచారం. వీరిలో ఒకరు పాడి కౌశిక్‌రెడ్డి. హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించడమే కాకుండా స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌, జిల్లా మంత్రి గంగుల కమలాకర్‌ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలోనే ఆయనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో అభ్యర్థి ఆయనేనని తేలిపోయింది. కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు స్థానంలో ఆయన కుమారుడు డాక్టర్‌ సంజయ్‌ని బరిలోకి దింపే అవకాశం ఉన్నది. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. మిగతా 11 స్థానాల్లో నలుగురి అవకాశాలు గల్లంతేనని అనుకుంటున్నారు. పార్టీ అధినేత నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకున్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్నవారు, పార్టీ అధినాయకత్వంపై అవిధేయత ప్రదర్శిస్తున్నవారు, దళితబంధు పథకం, తదితర కార్యక్రమాల్లో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటూ ప్రజల్లో విమర్శలకు గురవుతున్నవారిపై అధినేత కేసీఆర్‌ వేటు వేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ విషయంలో ఆయన నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 25 మందికి టికెట్‌ డౌటేనని అనుమానిస్తుండగా అందులో ఉమ్మడి జిల్లాకు చెందినవారే నలుగురు ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఒకరి విషయంలో పార్టీ నాయకత్వం కఠినంగా వ్యవహరించకపోయినా ముగ్గురికి మాత్రం టికెట్‌ లభించే అవకాశం లేదని తెలుస్తున్నది.

ఫ దశాబ్ది ఉత్సవాల తర్వాత మరో సర్వే

ప్రజల్లో ఉంటూ ఏమైనా వ్యతిరేకత ఉంటే దూరం చేసుకోవాలని, ప్రజలతో మమేకమై పనిచేయాలని ఎమ్మెల్యేలను కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, పట్టణానికి వెళ్లి ప్రతి ఓటరును కలిసి పార్టీ కార్యక్రమాలను, అమలు చేస్తున్న పథకాలను, రాష్ట్రంలో సాధించిన ప్రగతిని వివరించాలని సూచించారు. ప్రభుత్వ ఖర్చుతోనే దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు వాటిని నిర్వహించడంలో నిమగ్నమై కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ ఉత్సవాల తర్వాత మరోసారి సర్వే నిర్వహిస్తారని, ఇంటలిజెన్స్‌ వర్గాల ద్వారా ప్రజలు ఏమనుకుంటున్నారో నివేదికలు తెప్పించుకుని మళ్లీ ఒక అవగాహనకు వస్తారని భావిస్తున్నారు. నియోజకవర్గంలో తమపై ఏమైనా వ్యతిరేకత ఉన్నా దానిని తొలగించుకోవడానికి ఎమ్మెల్యేలు తంటాలు పడుతున్నారు. ఇప్పటి వరకు పట్టించుకోని ద్వితీయ శ్రేణి నేతల ఇళ్లకు వెళ్లి వారితో ఉన్న గ్యాప్‌ను తొలగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ నాయకుల మధ్య, శ్రేణుల మధ్య ఉన్న విభేదాలను తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అసంతృప్తితో ఉన్నవారిని బుజ్జగిస్తూ తాయిలాల ఎరచూపుతూ ఎమ్మెల్యేలు తంటాలు పడుతున్నట్లు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇన్ని తంటాలు పడ్డా సర్వే నివేదికలు తమ తలరాతను ఎలా మారుస్తాయోనని ఎమ్మెల్యేలు ఒకవైపు ఆందోళనకు గురవుతూనే తమకు తాము ధైర్యం చెప్పుకుంటూ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.

ఫ ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూపు

సిట్టింగ్‌లలో ప్రజా వ్యతిరేకత ఉన్నవారికి టికెట్లు ఇవ్వరనే సమాచారం వారిని తీవ్ర కలవరానికి గురి చేస్తున్నది. కొందరు ఎమ్మెల్యేలు టికెట్‌ రాకుంటే ఏ పార్టీలో చేరాలి, ఏ పార్టీలో టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంది అనే విషయంలో కూడా అత్యంత సన్నిహితులతో చర్చిస్తున్నారని తెలిసింది. పక్కాగా టికెట్‌ రాదనే అనుమానం ఉన్నవారు ఈ విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని సమచారం.

Updated Date - 2023-06-01T00:44:48+05:30 IST