ఆక్రమణల జోరు.. అడిగే వారే లేరు
ABN , First Publish Date - 2023-12-10T23:34:02+05:30 IST
వందల కోట్లతో అద్భుతమైన రోడ్లతో సుందరనగరంగా మారిన కరీం‘నగరం’లో ట్రాఫిక్ సమస్య ప్రజలకు చుక్కలు చూపుతున్నది.
కరీంనగర్ టౌన్, డిసెంబర్ 10: వందల కోట్లతో అద్భుతమైన రోడ్లతో సుందరనగరంగా మారిన కరీం‘నగరం’లో ట్రాఫిక్ సమస్య ప్రజలకు చుక్కలు చూపుతున్నది. ఒకప్పుడు టవర్‌సర్కిల్, రాజీవ్‌చౌక్, ప్రధాన కూరగాయల మార్కెట్ ఏరియాల్లో మాత్రమే ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఇప్పుడు ఏ రోడ్డుపై వెళ్లాలన్నా వాహనదారులు ఇబ్బందులు పడాల్సిందే.. దీనికి ప్రధాన కారణం రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకొని వాటిపై దుకాణాలను ఏర్పాటు చేయడం. ఆయా దుకాణాలకు వచ్చే వారు రోడ్డుపైనే వాహనాలు నిలుపడం మరో కారణం. అంతేకాకుండా పెరుగుతున్న వాహనాలకనుగుణంగా ఎక్కడ కూడా ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయకపోవడమేనని భావిస్తున్నారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లపై జీవనం సాగించే వీధివ్యాపారులు, చిరువ్యాపారుల కోసం వెండింగ్ జోన్‌లు ఏర్పాటు చేసినా వాటిని వ్యాపారులకు కేటాయించక పోవడం, కేటాయించిన ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు కల్పించక వెండింగ్ జోన్‌లు నిరుపయోగంగా మారాయే తప్ప ట్రాఫిక్ సమస్య కొంతైనా తగ్గడం లేదు. గతంలో 14.4 కిలో మీటర్ల ఆర్ అండ్ బీ ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రోడ్లను స్మార్ట్‌సిటీ, పట్టణ ప్రగతి నిధులతో సీసీ రోడ్డుతోపాటు రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు నిర్మించి రేలింగ్ వేశారు. గతంలో రోడ్లు వాహనదారులకు, ఫుట్‌పాత్‌లు పాదచారుల కోసమేనని, రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించవద్దని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు హెచ్చరించడమే కాకుండా రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు పోలీసు, మున్సిపల్‌శాఖ అధికారులతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. అలాగే చిరు, వీధివ్యాపారుల కోసం ప్రత్యేక వెండింగ్ జోన్‌లను ఏర్పాటు చేసి ఇకపై అక్కడే అమ్మకాలు జరుపుకోవాలని ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని వారిని ఆయా జోన్‌లకు తరలించారు. దీనితో కొద్దిరోజులు నగర ప్రజలు ట్రాఫిక్ సమస్యలనుంచి కొంత ఉపశమనం పొందారు. ఇక ఇలాగే ఎప్పటికీ ఎక్కువ రద్దీ ఉండే కొద్ది ప్రాంతాల్లో తప్ప పెద్దగా ఇబ్బందులుండవని వాహనదారులు, ప్రజలు భావించారు. అయితే ఇదంతా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఈ నేపథ్యంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగడంతో ఇక రోడ్లు, ఫుట్‌పాత్‌లను దర్జాగా ఆక్రమించుకొని ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీనితో నగర ప్రజలకే కాకుండా జిల్లా కేంద్రానికి వివిధ అవసరాల కోసం ఇక్కడి వచ్చే ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మరోవైపు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేసినా అవి అలంకారంగానే మిగిలాయి. ఎన్నికల ప్రచారాలతో ప్రజలు ఇన్నాళ్లు చాలా ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు నగరంలోని ట్రాఫిక్ సమస్యలకు చెక్‌పెట్టాలని కోరుతున్నారు.