అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-09-22T23:43:05+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌(ఏఐటీయూసీ) నాయకులు ప్రశ్నించారు.

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి
కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీ టీచర్లను అడ్డుకుంటున్న పోలీసులు

సుభాష్‌నగర్‌, సెప్టెంబరు 22: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌(ఏఐటీయూసీ) నాయకులు ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట గత 12 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంగన్‌వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మంత్రి గంగుల కమలాకర్‌ కలెక్టరేట్‌లోకి వెళ్తున్న క్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం మంత్రితో మాట్లాడించారు. అంగన్‌వాడీ టీచర్లు మంత్రికి సమస్యలను వివరించారు. అనంతరం ఆయన కలెక్టరేట్‌లోకి వెళ్లారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు మాట్లాడుతూ ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడం సరికాదన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, అసోసియేషన్‌ బాధ్యులను చర్చలకు పిలవాలన్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం, పెన్షన్‌, గ్రాట్యుటీ ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జిల్లా నాయకులు రాజాదేవి, విజయ, అనురాధ, సంధ్య, శారద, విజయ, ధన, శైలజ, శారద తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T23:43:05+05:30 IST