అభివృద్ధికి, విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు
ABN , First Publish Date - 2023-11-19T23:09:25+05:30 IST
బీఆర్‌ఎస్ అభివృద్ధికి, బీజేపీ విధ్వంసానికి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

- కాంగ్రెస్, బీజేపీ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
- అవినీతి సొమ్ము పంచాలని ప్రయత్నిస్తున్నారు
- బీఆర్‌ఎస్ కరీంనగర్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్, నవంబరు 19: బీఆర్‌ఎస్ అభివృద్ధికి, బీజేపీ విధ్వంసానికి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.. ఆదివారం ఆయన 55,37,38 డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక అద్భుతంగా అభివృద్ధి చెందిందన్నారు. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టాలని సమైక్యవాదులు కుట్రలు పన్నుతున్నారని... అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో ఆంధ్ర, ఢిల్లీ పార్టీల పెత్తనం ఏంటి అని ప్రశ్నించారు.. అభివృద్ధి ప్రదాత కేసీఆర్‌ను ఓడించాలని కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే.. రానున్న ఎన్నికల్లో మన ఇంటి పార్టీ బీఆర్‌ఎస్ కు ఓటేయాలని కోరారు... కాంగ్రెస్ భూ కబ్జాదారులకు టికెట్లు అమ్ముకుందని విమర్శించారు. 32 కేసులు ఉన్న భూకబ్జాదారుడిని తన అభ్యర్థిగా నిలబెట్టిందని, కాంగ్రెస్‌కు ఓటేస్తే అతడు భూములన్నీ మాయం చేస్తాడని అన్నారు.. కరీంనగర్ ఎంపీ గా గెలిచిన బండి సంజయ్ కుమార్ ఎన్ని నిధులు తెచ్చాడో ..ఏమీ అభివృద్ధి చేశాడో చెప్పాలన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి తన చేతిలో ఘోరంగా ఓడిపోయి, అపోలో ఆసుపత్రిలో గుండె నొప్పి నాటకంతో కరీంనగర్ ప్రజల సానుభూతి పొంది ఎంపీ గెలిచాడని విమర్శించారు. నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అభివృద్ధి గురించి ఆలోచించలేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో కొనసాగుతూ ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి అవినీతికి పాల్పడితే పదవీ పీకేశారన్నారు. అవినీతి సొమ్ముతో రానున్న ఎన్నికల్లో ఒక్కో ఓటుకు 20 వేలు, ఐఫోన్లను పంచిపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాడని, ఆయన ఇచ్చే డబ్బులు, ఐఫోన్లు తీసుకొని అభివృద్ధి చేస్తున్న కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్‌కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని అన్నారు. సమైక్య పాలనలో నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంట్ ఉండదని, కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని వ్యంగ్యంగా మాట్లాడారని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించి విజయవంతంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నామని అన్నారు. గులాబీ జెండాకు వ్యతిరేకంగా సమైక్యవాదులంతా ఒక్కటై కేసీఆర్‌ను ఓడగొట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను 33 జిల్లాలు చేసి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి 500 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశామని అన్నారు. తెలంగాణలో ఏడాదికి 10 వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నామని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో నాలుగు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణను కాంగ్రెస్ చేతుల్లో పెడితే కుక్కలు చించిన విస్తరవుతుందని అన్నారు. కార్యక్రమంలో మేయర్ సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి మరిశంకర్, కార్పొరేటర్ కచ్చు రవి, కో ఆప్షన్ సభ్యురాలు నందెల్లి రమ, నాయకులు చేతి చంద్రశేఖర్, సత్తినేని శ్రీనివాస్, కర్రె అనిల్, జీపీ స్వామి, తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎంపీ టికెట్ ఇవ్వరని ఎమ్మెల్యేగా బరిలోకి..
కరీంనగర్ రూరల్: అవినీతికి పాల్పడుతున్నాడనే బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించారని, ఎంపీ టికెట్ ఇవ్వరనే ఆయన ఎమ్మెల్యేగా బరిలోకి దిగాడని మంత్రి, బీఆర్‌ఎస్ కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ రూరల్‌్ మండలం నగునూరులో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడిగా టికెట్లు అమ్ముకోవడంతోపాటు పాదయాత్రపేరిట పార్టీ ఫండ్ దుర్వినియోగం చేశాడనే అధిష్ఠానం అధ్యక్ష పదవి నుంచి గెంటివేసిందన్నారు. అవినీతి సొమ్ముతో ఓటుకు 20 వేలు, సెల్ ఫోన్ ఇస్తానంటున్నాడన్నారు. బండి సంజయ్ పంచే అవినీతి సొమ్ము తీసుకుని బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలన్నారు. కేసీఆర్ చేతిలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందన్నారు. తెలంగాణను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీని నమ్మవద్దన్నారు. కేసీఆర్ లేని తెలంగాణ కుక్కలు చింపిన విస్తరి అవుతుందన్నారు. పచ్చని తెలంగాణపై ఆంధ్రా వాళ్ల కన్ను పడిందన్నారు. బీజపీ, కాంగ్రెస్ రూపాల్లో వస్తున్నారన్నారు. ఒక్కఓటుతప్పు జరిగితే యాభైఏళ్లు వెనక్కి పోతామన్నారు.