అభివృద్ధి బాటలో జిల్లా..

ABN , First Publish Date - 2023-06-03T01:24:50+05:30 IST

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల జిల్లా అభివృద్ధి బాటలో పయనిస్తున్నదని, శాసనమండలి ప్రభుత్వ చీఫ్‌ తానిపర్తి భానుప్రసాద్‌ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి.

అభివృద్ధి బాటలో జిల్లా..
గౌరవవందనం స్వీకరిస్తున్న శాసన మండలి చీఫ్‌విప్‌ తానిపర్తి

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల జిల్లా అభివృద్ధి బాటలో పయనిస్తున్నదని, శాసనమండలి ప్రభుత్వ చీఫ్‌ తానిపర్తి భానుప్రసాద్‌ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ముఖ్యఅతిథిగా వచ్చిన భానుప్రసాద్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పట్టణంలోగల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని 1,41,265 మంది రైతులకు ఇప్పటివరకు 1197.48 కోట్ల రైతుబంధు, మరణించిన 1831 రైతు కుటుంబాలకు 91.75 కోట్ల సహాయాన్ని అందించామన్నారు. అలాగే 11,244 మంది రైతులకు 18.97 కోట్లతో వ్యవసాయ యాంత్రీకరణ, 394 మంది రైతులకు 18.02 కోట్లతో బిందు తుంపరి సేద్యం సాగుప్రోత్సాహకాలు అందించామన్నారు.

ఫ సంక్షేమంలో ఆదర్శం..

జిల్లాలో ఆసరా ఫించన్ల కింద 97,752 మందికి ప్రతినెలా రూ.1272 కోట్లు పంపిణీ చేశామన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ కింద 24,779మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.245.31 కోట్లు, 24,161 మంది గర్భిణులకు కేసీఆర్‌ కిట్లు అందించామన్నారు. స్వయం ఉపాధి కింద 5,290 మంది లబ్ధిదారులకు సబ్సిడీ కింద రూ.49.69 కోట్ల విడుదల చేశామని, 259 మంది దళితులకు దళిత బంధు కింద రూ.10లక్షల యూనిట్లను అందించామన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు రూ.127.55 కోట్లతో గొల్ల,కుర్మలకు మొదటి విడతలో 10,204 గొర్రెల యూనిట్లు, రెండవ విడతలో రూ. 190.82 కోట్లతో 10,904 లబ్ధిదారులకు గొర్రెల యూనిట్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ.7.18కోట్లతో 898 పాడి పశువులను, 1049 నీటి వనరులలో రూ.7 కోట్ల 20లక్షలతో చేప పిల్లలను, రూ.2.75 కోట్లతో రొయ్యపిల్లలను ఉచితంగా పంపిణీ చేశామని, రూ.71.37 కోట్లతో 191 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, రామగుండంలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. కంటి వెలుగు ద్వారా 3.73 లక్షల మందికి పరీక్షలు చేసి 89 వేల కళ్లద్దాలు, డయాగ్నస్టిక్‌ హబ్‌ను రూ.2కోట్లతో ఏర్పాటు చేశామని, రూ.17.8కోట్లతో పెద్దపల్లిలో 100 పడకల ఎంసీహెచ్‌, రూ.7 కోట్లతో మంథనిలో 50 పడకల ఎంసీహెచ్‌ నిర్మించామన్నారు.

ఫ మౌలిక వసతుల కల్పన..

జిల్లాలో 24గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా రూ. 723.4 కోట్ల వ్యయంతో బల్క్‌ నీటి సరఫరా చేస్తున్నామన్నారు. ఉపాధిహామీ పథకం కింద రూ.367.18 కోట్ల దినసరి కూలీ, మెటీరియల్‌ కంపొనెంట్‌ ద్వారా రూ.163 కోట్లు వెచ్చించామన్నారు. రూ.244.78కోట్లతో 185 కిలోమీటర్ల మేర సింగిల్‌ రోడ్లను డబుల్‌ రోడ్లుగా విస్తరించామని, రూ. 133.10 కోట్లతో 13 వంతెనలను, రూ.130.46 కోట్లతో 41 రహదారి పనులను పూర్తి చేశామన్నారు. రూ.156.8 కోట్లతో నూతనంగా 2 ఎమ్మెల్యే కార్యాలయాలు, కోర్టు, కలెక్టరేట్‌ భవనాలు, రామగుండంలో వైద్య కళాశాల నిర్మాణం పూర్తిచేశామన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ రమేష్‌, కలెక్టర్‌ డాక్టర్‌ సంగీతసత్యనారాయణ, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌, అదనపు కలెక్టర్‌ కుమార్‌దీపక్‌, డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌, రామగుండం మేయర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T01:24:50+05:30 IST