బీఆర్‌ఎస్‌ హయాంలోనే దేవాలయాల అభివృద్ధి

ABN , First Publish Date - 2023-07-21T00:38:12+05:30 IST

బీఆర్‌ఎస్‌ హయాంలోనే దేవాలయాల అభివృద్ధి జరుగుతోందని అందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంను సకల సౌకర్యాలతో అద్భుతంగా తీర్చిదిద్దే ప్రణాళికలు చేపట్టారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలోనే దేవాలయాల అభివృద్ధి
కొండగట్టు ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తున్న మంత్రి కొప్పుల, నాయకులు

మల్యాల, జూలై 20: బీఆర్‌ఎస్‌ హయాంలోనే దేవాలయాల అభివృద్ధి జరుగుతోందని అందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంను సకల సౌకర్యాలతో అద్భుతంగా తీర్చిదిద్దే ప్రణాళికలు చేపట్టారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. కొండగట్టు దేవస్థానం పరిధిలో శాశ్వత నీటి సమస్య పరిష్కారంకు రూ.13.43కోట్లతో ఇందిరమ్మ వరదకాలువ నుంచి పంప్‌హౌజ్‌ ద్వారా సంతొళ్లలొద్దిలికి నీటిని తరలించే కొండగట్టు ఎత్తిపోతల పథకంను మంత్రి ఈశ్వర్‌ గురువారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కొండగట్టు అభివృద్ధికి జగిత్యాల పర్యటనలో రూ. వంద కోట్లు ప్రకటించడమే కాకుండా గత ఫిబ్రవరిలో కొండగట్టులో పర్యటించి ఆంజనేయస్వామి దేవస్థానం అఽభివృద్ధికి 500కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో ఎత్తిపోతల పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ చేతల ప్రభుత్వం

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ చేతల ప్రభుత్వం అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ అన్నారు. కొండగట్టు కొండపైకి నీరందించడానికి సీఎం ఆదేశాలతో వరదకాలువ నుంచి నీటిని అందించేందుకు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ కొండగట్టులో ఇప్పటికే రూ.50కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో దేశంలోనే అంజన్న ఆలయం గొప్పక్షేత్రంగా తీర్చిద్దిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, జడ్పీటీసీలు కొండపల్కుల రామ్మోహన్‌రావు, ప్రశాంతి, ఎంపీపీ స్వర్ణలత, సర్పంచ్‌ బద్దం తిరుపతిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, డీసీఎంస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొండగట్టు ఎత్తిపోతల పథకం ప్రారంభించడానికి మొదటగా వచ్చిన కలెక్టర్‌ యాస్మిన్‌భాషా వేదిక వద్ద కార్యక్రమం గురించే తెలిపే ఫ్లెక్సీ ఇతరత్రా ఏర్పాటు చేయకపోవడం పట్ల ఇరిగేషన్‌ అధికా రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు జగిత్యాల నుంచి ఫ్లెక్సీలను తీసుకువచ్చి ఏర్పాటు చేసే చర్యలు చేపట్టారు.

Updated Date - 2023-07-21T00:38:12+05:30 IST