పాఠ్యపుస్తకాలు రెడీ
ABN , First Publish Date - 2023-05-26T00:34:53+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ సారి ముందస్తుగానే పాఠ్యపుస్తకాలు సిద్ధం చేశారు.

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ సారి ముందస్తుగానే పాఠ్యపుస్తకాలు సిద్ధం చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభం రోజున పుస్తకాలను పంపిణీ చేసే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరిన పాఠ్యపుస్తకాలు మండల కేంద్రాలకు సరఫరా ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈసారి పాఠ్యపుస్తకాలతోపాటు నోట్‌పుస్తకాలు ఉచితంగా అందించనున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రం ప్రభుత్వం సరఫరా చేసే పాఠ్యపుస్తకాల ధరలు పెరగడంతో తల్లిదండ్రులకు భారంగా మారింది.
అవసరమయ్యే పుస్తకాలు 3.77 లక్షలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 656 ఉన్నాయి. గత విద్యాసంవత్సరం 72,079 మంది విద్యార్థులు చదువుకున్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 52,260 మంది, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 20,079 మంది ఉన్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు 3 లక్షల 77వేల 800 పుస్తకాలు అవసరం కానున్నాయి. ఇందులో గత సంవత్సరం మిగిలిన పుస్తకాలు 8310 ఉండగా మిగతా 3,69,490 పుస్తకాలు అవసరం కానున్నాయి. ఇందులో మొదటి విడతలో 2,95,360 పుస్తకాలు, రెండో విడుతలో 74,130 సరఫరా చేయనున్నారు. గతంలో పాఠశాలలు ప్రారంభమైనా పుస్తకాలు సకాలంలో వచ్చేవి కావు. పుస్తకాల కోసం ఎదురుచూసి చివరకు ప్రైవేట్‌లో కొనుగోలు చేసేవారు. ఈసారి ప్రభుత్వం ముందుగానే పుస్తకాలను సిద్ధం చేసి పంపించడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. జిల్లాకు వచ్చిన పుస్తకాలను ముందస్తుగానే మండల కేంద్రాలకు పంపిణీ చేశారు.
నోట్ పుస్తకాలు ఫ్రీ
ప్రభుత్వపాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలే ఉచితంగా అందించగా ఈ సారి నోటుపుస్తకాలను ప్రభుత్వం ఉచితంగానే అందించాలని నిర్ణయించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థికభారం తగ్గనుంది. జిల్లాలో చదువుతున్న విద్యార్థులకు అనుగుణంగా అవసరమయ్యే నోట్‌పుస్తకాలు, వర్క్‌బుక్‌లు సకాలంలో అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నోట్‌పుస్తకాలు అందనున్నాయి.
ప్రైవేట్ విద్యార్థులకు భారమే
ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు కూడా ప్రభుత్వ పాఠ్యపుస్తకాలతోనే బోధన ఉంటుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి పాఠ్యపుస్తకాల ధరలు 40శాతం పెరిగాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల మోతతోపాటు పాఠ్యపుస్తకాల ధరలు కూడా భారంగానే మారాయని ఆందోళన చెందుతున్నారు. వీటికి తోడు క్వశ్చన్ బ్యాంక్‌లు, నోట్‌పుస్తకాలు ధరలు పెరిగాయి. జిల్లాలో 20వేల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. ఈసారి పుస్తకాల భారమే 50 శాతం వరకు పెరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం విద్యార్థులకు ఈసారి పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, యూనిఫాంలు సకాలంలోనే అందుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.