త్వరలో టి-డయాగ్నోస్టిక్‌ సేవలు

ABN , First Publish Date - 2023-06-23T00:35:21+05:30 IST

జిల్లా ఆసుపత్రిలో తెలంగాణ డయాగ్నోస్టిక్‌ కేంద్రం భవనం పూర్తికావడంతో వైద్య పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు.

త్వరలో టి-డయాగ్నోస్టిక్‌ సేవలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లా ఆసుపత్రిలో తెలంగాణ డయాగ్నోస్టిక్‌ కేంద్రం భవనం పూర్తికావడంతో వైద్య పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. మరో వారంపది రోజుల్లో జిల్లా ప్రజలకు 54 రకాల ఉచిత పరీక్షల సేవలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా కేంద్రంలో సుమారు కోటి 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ టి హబ్‌ పూర్తికాగా, అందులో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కావాల్సిన పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. పరికరాల విలువ సుమారు 2 కోట్లకు పైగా ఉంటుంది. ఆయా పరికరాల ద్వారా ట్రయల్‌ రన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో టి డయాగ్నోస్టిక్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో ఇప్పటికే టి డయాగ్నోస్టిక్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దశల వారీగా ప్రతి జిల్లా కేంద్రంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది పెద్దపల్లి మాతా శిశు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ఇక్కడ టి డయాగ్నోస్టిక్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఆ మేరకు నిధులు మంజూరుచేశారు. అదే ఏడాది ఆగస్టులో ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో సెప్టెంబర్‌లో భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. అన్ని హంగులతో భవన నిర్మాణం పూర్తికాగా 54 రకాల రక్త పరీక్షలు నిర్వహించేందుకు కావాల్సిన పరికరాలను తీసుకవచ్చారు. ఇక్కడ లివర్‌, కిడ్నీ, జ్వరాలు, గుండె, కొలెస్ట్రాల్‌, థైరాయిడ్‌కు సంబంధించిన అన్ని రకాల రక్త పరీక్షలతో పాటు డిజిటల్‌ ఎక్స్‌రే తీయనున్నారు. స్కానింగ్‌ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. సీటీ స్కానింగ్‌ కోసం గదిని కూడా నిర్మించారు. కానీ ఆ యంత్రం మరో దశలో అందుబాటులోకి రానున్నది. జిల్లాలో ఉన్నటువంటి అన్ని వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా వివిధ జబ్బుల బారిన పడిన వారి రక్తనమూనాలను సేకరించి ఈ కేంద్రానికి పంపించనున్నారు. ప్రతి రోజు ఉదయం ఆసుపత్రి తెరిచినప్పటి నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు తీసిన రక్త నమూనాలను టి డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు పంపించనున్నారు. ఈ రక్త నమూనాలను సేకరించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు తీసుకవచ్చిన తర్వాత పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాల వివరాలను రక్త నమూనాలు ఇచ్చిన వారి సెల్‌ఫోన్‌కు పంపించనున్నారు. వాటి ఆధారంగా సదరు వ్యక్తులు వైద్యం చేయించుకునేందుకు వీలు ఉంటుంది. సాధారణంగా జ్వరం సోకిన వ్యక్తి ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళితే 300 నుంచి 400 రూపాయల వరకు ఓపీ ఫీజు తీసుకుని, ఆ వెంటనే వెయ్యి నుంచి 1500 రూపాయల విలువైన రక్త, మూత్రపరీక్షలు రాస్తారు. కానీ ఇకనుంచి ఆ బాధ తప్పనున్నది. జ్వరం వచ్చినా, మరే జబ్బు వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌తో పరీక్ష చేయించుకున్న తర్వాత రాసే రక్త పరీక్షలన్నీ ఉచితంగా పొందే అవకాశం కల్పించారు. గతంలో కేవలం వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో కేవలం కొన్ని రకాల పరీక్షలు మాత్రమే చేసే వారు. కానీ ఇప్పడు అన్ని ఆసుపత్రులకు వచ్చే రోగుల నుంచి రక్త నమూనాలు తీసి పంపించిన తర్వాత 24 గంటల్లో వారి సెల్‌ ఫోన్లకు వివరాలు పంపించే విధానాన్ని తీసుకవచ్చారు. ఇప్పటివరకు టి డయాగ్నోస్టిక్‌ కేంద్రానికి చేరిన పరికరాల ద్వారా ట్రయల్‌ రన్‌లో భాగంగా రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు.

సిద్ధమవుతున్న డయాలసిస్‌ కేంద్రం..

టి డయాగ్నోస్టిక్‌ కేంద్రంతో పాటు డయాలసిస్‌ కేంద్రం కూడా ప్రారంభానికి సిద్ధం అయ్యింది. జిల్లాలో ఇప్పటివరకు గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్‌ కేంద్రం ఉండగా, కొత్తగా పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న డయాలసిస్‌ కేంద్రం నిర్వహణ బాధ్యతను డీసీడీసీ అనే హెల్త్‌ సర్వీసెస్‌ అనే ప్రైవేట్‌ సంస్థకు అప్పగించారు. జిల్లా ఆసుపత్రిలో ఒక హాల్‌లో 5 పడకలను ఏర్పాటుచేసి పరికరాలను బిగించారు. ఒక రోజు 10మంది నుంచి 15మంది రోగులకు కిడ్నీల డయాలసిస్‌ చేసే సౌకర్యాన్ని కల్పించారు. ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్‌ చేయనున్నారు. ఒక రోగికి 4 గంటల పాటు డయాలసిస్‌ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి నెలకు 10 సార్లు డయాలసిస్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఒకసారి డయాలసిస్‌ చేస్తే 1820 రూపాయలు చెల్లించనున్నారు. ఇందులో 250 రూపాయలు ఆసుపత్రికి అందజేయనున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాంతానికి చెందిన డయాలసిస్‌ రోగులు గోదావరిఖనికి, కరీంనగర్‌కు వెళ్లారు. ఇప్పుడు అక్కడికి వెళ్లాల్సిన పని లేకుండానే పెద్దపల్లిలో డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే 99 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పోస్టుమార్టమ్‌ గది నిర్మాణం కూడా పూర్తయ్యింది.

జిల్లా ప్రజలకు మేలు..

- డాక్టర్‌ శ్రీధర్‌, డీసీహెచ్‌, పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన టి డయాగ్నోస్టిక్‌ కేంద్రం సేవలు, డయాలసిస్‌ కేంద్రం సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వారం, పది రోజుల్లో ఆ కేంద్రాలను ప్రారంభించేందుకు కలెక్టర్‌ షెడ్యూల్‌ ఖరారు చేయనున్నారు. ఈ రెండు కేంద్రాలు అందుబాటులోకి రావడం వల్ల జిల్లా ప్రజలకు ఎంతో మేలు కలగనున్నది.

Updated Date - 2023-06-23T00:35:21+05:30 IST