టార్గెట్‌ ఈటల

ABN , First Publish Date - 2023-05-26T00:40:34+05:30 IST

ఈటల రాజేందర్‌ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కేంద్ర బిందువుగా మారారు.

టార్గెట్‌ ఈటల

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఈటల రాజేందర్‌ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కేంద్ర బిందువుగా మారారు. అటు బీజేపీ ఇటు బీఆర్‌ఎస్‌ పార్టీల్లో ఆయన కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్నాయి. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌గా నియమితులైన ఆయన వివిధ పార్టీల నుంచి నాయకులను బీజేపీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసి అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి సవాల్‌ విసురుతూ కొరకరాని కొయ్యగా మారుతున్నారు. పార్టీ ఆదేశిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కూడా పోటీ చేస్తానని ఆయన సవాల్‌ విసిరితే ఆయనను స్వంత నియోజకవర్గంలోనే పరాజితుడిని చేయాలని అధికార పార్టీ ఎత్తులు వేస్తున్నది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని 17 వేల పైచిలుకు కుటుంబాలకు దళితబంధు కింద పదేసి లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఈటల హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ అధిష్టానవర్గం సర్వ శక్తులు ఒడ్డి యంత్రాంగా న్నంతా అక్కడే కేంద్రీకరించినా ఈటల తనది చెక్కుచెదరని కోట అని నిరూపించుకున్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి హుజూరాబాద్‌లో, ఇటీవల జరిగిన ఉప ఎన్నిక వరకు జరిగిన అన్ని సాధారణ, ఉప ఎన్నికల్లో ఆయనే వరుస విజయాలు సాధిస్తూ ఏడవ విజయాన్ని నమోదు చేసుకున్నారు.

ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరి ఒంటరి పోరాటం చేసినా గత ఉప ఎన్నికల్లో ప్రజలు ఆయనను గెలిపించారు. ఆ తర్వాత బీజేపీ ఆయనకు చేరికల కమిటీ చైర్మన్‌ పదవి అప్పగించింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నుంచి సీనియర్‌ నాయకులను బీజేపీలో చేర్పించడానికి ప్రయత్నం చేస్తుంటే బీఆర్‌ఎస్‌ అధిష్టానవర్గం ఆయనను నియోజకవర్గం నుంచే సాగనంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఆ నియోజకవర్గ నాయకులకు ఇచ్చిన రెండు రాష్ట్రస్థాయి చైర్మన్‌ పదవులే కాకుండా తాజాగా మరో ఇద్దరు నాయకులకు రాష్ట్ర స్థాయి చైర్మన్‌ పదవులను కట్టబెట్టారు. ఈటల రాజేందర్‌పై బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి అప్పగించారు. తాజాగా ఈటల రాజేందర్‌ సామాజిక వర్గానికే చెందిన పిట్టల రవీందర్‌కు రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్‌ పదవి కట్టబెట్టారు. పాడి కౌశిక్‌రెడ్డికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ విప్‌గా, నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారు. ఐదు రాష్ట్రస్థాయి క్రియాశీల పదవులు ఇచ్చి ఆ నియోజకవర్గ నాయకులకు పెద్దపీట వేశారు. వీరిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు ఒకరు కాగా, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒకరు ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి నియోజక వర్గంలో భారీ ఓట్లు ఉన్న యాదవ సామాజిక వర్గానికి, ముదిరాజ్‌ సామాజిక వర్గానికి కూడా పదవులు కట్టబెట్టారు. అలాగే బీసీ కమిషన్‌ చైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌ కూడా అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

నియోజకవర్గ బాధ్యతలను ఎమ్మెల్సీ, విప్‌ పాడి కౌశిక్‌రెడ్డికి అప్పగించి రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేసి ఏ అధికారిక కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌ హాజరు కాకుండా ఉండే పరిస్థితి కల్పిస్తున్నారని, ఆయనకు అధికారిక కార్యక్రమాల సమాచారం ఇవ్వకపోవడం, ఇచ్చినా వచ్చే వీలులేని విధంగా సమాచారం అందేలా చూస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈటల నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితులు కల్పించి ప్రజలకు దూరమయ్యేలా చేయాలనే ప్రయత్నంలో భాగంగానే వ్యవహారాలు సాగుతున్నట్లు చర్చించుకుంటున్నారు.

బీసీ నాయకునిగా పేరున్న ఈటల రాజేందర్‌కు బీజేపీలో త్వరలో క్రియాశీల పదవి లభించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఆయన ఉన్నారని ప్రచారం జరిగినా పార్టీ అధ్యక్షున్ని మార్చే అవకాశం లేదని ఈటలే స్వయంగా చెప్పడంతో మరో ముఖ్య పదవి ఆయనకు లభించవచ్చని చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీసీ డిక్లరేషన్‌ ఇచ్చిన బీజేపీ బీసీలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా బీసీ నేతగా పేరుండి అన్ని కుల సంఘాలతో సత్సంబంధాలున్న ఈటల రాజేందర్‌ సేవలను బీజేపీ వాడుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఇటు బీఆర్‌ఎస్‌, బీజేపీ రాజకీయాల్లో క్రియాశీల వ్యక్తిగా మారిన ఈటలను సైతం తమ పార్టీలో చేరాలని రేవంత్‌ రెడ్డి పిలుపునివ్వడం మరో చర్చకు తెరతీసింది. మొత్తానికి ఈటల రాజేందర్‌ కేంద్ర బిందువుగా రాష్ట్ర రాజకీయాలు తిరుగు తుండడంతో హుజూరాబాద్‌లో తమ శాసనసభ్యుడి రాజకీయ పాత్ర గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

Updated Date - 2023-05-26T00:40:34+05:30 IST