Korutla: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని దీప్తి అనుమానాస్పద మృతిపై వీడని మిస్టరీ.. ట్విస్ట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2023-08-31T15:40:05+05:30 IST

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముని దుబ్బ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని దీప్తి అనుమానాస్పద మృతి మిస్టరీ కొనసాగుతోంది. పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు.

Korutla: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని దీప్తి అనుమానాస్పద మృతిపై వీడని మిస్టరీ.. ట్విస్ట్ ఏంటంటే..

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముని దుబ్బ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని దీప్తి అనుమానాస్పద మృతి మిస్టరీ కొనసాగుతోంది. పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. పట్టణంలోని భీముని దుబ్బ ప్రాంతానికి చెందిన బంక శ్రీనివాస్‌ ఇటుక బట్టి వ్యాపారం చేస్తుంటాడు. ఆయనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు బంకి దీప్తి బీటెక్‌ పూర్తి చేసి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తోంది. చిన్న కూతురు చందన బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం శ్రీనివాస్‌ దంపతులు హైదరాబాదులో శుభ కార్యక్రమానికి వెళ్లగా అక్కాచెల్లెలు ఇద్దరే ఇంట్లో ఉన్నారు. శ్రీనివాస్‌ మంగళవారం ఉదయం నుంచికూతుర్లకు ఫోన్‌ చేసినప్పటికీ దీప్తి ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో పాటు చందన ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడంతో ఇంటి పక్కవారికి శ్రీనివాస్‌ ఫోన్‌ చేసి తన ఇంటికి వెళ్లి చూడమన్నాడు. దీంతో వారు ఇంట్లోకి వెళ్లి చూడగా దీప్తి ముందు రూంలోని సోఫాలో పడి ఉండటాన్ని గమనించి తండ్రి శ్రీనివాస్‌తో పాటు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌ టీంతో తనిఖీలు నిర్వహించారు. వంట గదిలో ఉన్న మద్యం సీసాను సీజ్‌ చేసి మృతదేహాన్ని కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం బాటిల్‌ లేబుల్‌ ఆధారంగా వైన్స్‌ సీసీ ఫుటేలను సేకరించారు.


వైరల్‌ అయిన చందన వాయిస్‌ మెసేజ్‌..

బుధవారం ఉదయం చందన తన ఫోన్‌ నుంచి తండ్రి శ్రీనివాస్‌కు, తమ్ముడికి వాయిస్‌ మెసేజ్‌ పెట్టింది.. ‘నేను, అక్క ఇద్దరం కలిసి మందు తాగాము. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోదాం అనుకున్నా.. కానీ అక్కకు చెప్పి పోదాం అనుకున్నా.. కాని అక్క అప్పటికే మందు తాగి సోఫాలో పడుకుంది. రెండు సార్లు లేపినా లేవలేదు.. చాన్స్‌ దొరికింది కదా అని నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయిన.. అంతే కానీ నేను అక్కను ఎందుకు చంపుతాను’ అంటూ ఆ ఆడియోలో ఉంది. కానీ మెసేజ్‌ వచ్చిన కొద్ది సేపటికే ఫోన్‌ స్విచ్చాఫ్‌ అయింది. దీంతో పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు చందన ఫోన్‌ను ట్రేస్‌ చేసి హైదరాబాదులో ఉన్నట్టు గుర్తించి విచారణ బృందం అక్కడకు చేరుకుంది. కానీ అప్పటికే చందన అక్కడి నుంచి వెళ్లిపోయిందని సమాచారం. చిన్న కూతురు చందన అదృశ్యం కావడం.. పెద్ద కూతురు దీప్తి మృతి చెందడంతో తండ్రి శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యా దు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

కాగా ఇంట్లోని బంగారు ఆభరణాలు, భారీ మొత్తంలో నగదు పోయిందని శ్రీనివాస్‌ పోలీసులకు తెలిపాడు. దాదాపు 30 తులాల బంగారం, 2 లక్షల డబ్బు పోయినట్లు సమాచారం. కోరుట్ల సీఐ ప్రవీణ్‌కుమార్‌ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మృతురాలు దీప్తి తండ్రి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సోదరి చందన ఆచూకీ కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామని సీఐ తెలిపారు.

Updated Date - 2023-08-31T15:43:05+05:30 IST