శ్రీనివాసా గోవిందా...

ABN , First Publish Date - 2023-06-01T00:33:12+05:30 IST

కరీంనగర్‌ బుధవారం ఒక్కసారిగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. పూజలు, హవనాలు, భారీ శోభాయాత్ర, నేత్రపర్వంగా జరిగిన శ్రీనివాస కల్యాణంతో వాటిని తిలకించిన భక్తజనం పులకించిపోయారు.

   శ్రీనివాసా గోవిందా...
టీటీడి ఆలయ శంకుస్థాపన పూజల అనంతరం స్వామివారి కల్యాణం, హాజరైన ప్రజలు

- మంకమ్మతోట వేంకటేశ్వరాలయం నుంచి భారీ శోభాయాత్ర

కరీంనగర్‌ కల్చరల్‌, మే 31: కరీంనగర్‌ బుధవారం ఒక్కసారిగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. పూజలు, హవనాలు, భారీ శోభాయాత్ర, నేత్రపర్వంగా జరిగిన శ్రీనివాస కల్యాణంతో వాటిని తిలకించిన భక్తజనం పులకించిపోయారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కరీంనగర్‌లో 20 కోట్లతో నిర్మించనున్న వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలతో బుధవారం శంకుస్థాపన చేశారు. నగరంలోని పద్మనగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆలయానికి కేటాయించిన 10 ఎకరాల స్థలంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాదీక్షితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచనం, అగ్ని ప్రణయం, కుంభారాధన, హోమాలు, శంఖువుకు అభిషేకం చేసిన అనంతరం వేదమంత్రోచ్ఛరణాలతో శంకుస్థాపనను నిర్వహించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డి దామోదర్‌రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, సీపీ సుబ్బారాయుడు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, టిటిడి అడ్వయిజరీకమిటీ చైర్మన్‌ భాస్కర్‌రావు, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూర రవీందర్‌రావు, బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణ మోహన్‌రావు, ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కుర్మాచలం అనిల్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పొన్నం అనిల్‌ కుమార్‌, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌ పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు

- మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ ప్రజాప్రతినిధులందరం కలిసి శ్రీవారి ఆలయం కోసం సీఎం కేసీఆర్‌ను కోరిన వెంటనే ఆయన ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాయడంతో పాటు పది ఎకరాల భూమిని కేటాయించారు. ఇందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. తెలంగాణలో రెండో ఆలయాన్ని కరీంనగర్‌లో నిర్మించేందుకు టీటీడీ 20 కోట్లను కేటాయించి పనులకు భూమిపూజ చేయడం సంతోషకరం. వేంకటేశ్వరస్వామివారి కృపతోనే కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణం సాకారమవుతోంది. ఆలయ నిర్మాణ స్థలంలో కోనేరులాంటి పురాతన బావి, దేవుడికి ఇష్టమైన చింతచెట్టు ఉంది. శ్రీవారి ఆలయ నిర్మాణంలో పాల్గొనే అవకాశం దక్కడం నాకే కాకుండా కరీంనగర్‌ ప్రజల అదృష్టం. ఏడాదిన్నరలో ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయి.

తిరుమల తరహాలో శ్రీవారికి పూజలు

- టిటిడి చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి

సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తితో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఆలయ నిర్మాణానికి టీటీడీ నుంచి 20 కోట్లు కేటాయించాము. తిరుమల వేదపండితులు ఇక్కడే ఉండి శ్రీవారి పూజలు, సేవలు, క్రతవులు నిర్వహిసారు.

కరీంనగర్‌కు బ్రహ్మాండనాయకుడి దీవెనలు

- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్‌కుమార్‌

స్వామివారి ఆలయతో కరీంనగర్‌కు బ్రహ్మాండనాయకుడి దీవెనలు అందుతున్నాయి. కరీంనగర్‌లోనే టీటీడీ అర్చకులకు ప్రత్యేకంగా వసతి భవన నిర్మిస్తాం. సమస్త కైంకర్యాలను ఆగమ శాస్త్ర పద్దతుల్లో చేయిస్తాం.

టీటీడీ ఆధ్వర్యంలో మరిన్ని ఆలయాలు నిర్మించాలి

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌

టీటీడీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించడం హర్షణీయం. హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని రక్షించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో రథయాత్రలు, పూజలు, క్రతువులు నిర్వహిస్తున్నారు. పేద ప్రజలు తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకోలేక పోతున్నారు. వారి కోసం టీటీడీ రాష్ట్రంలో మరిన్ని ఆలయాలను నిర్మించాలి.

నేత్రపర్వంగా శ్రీనివాస కల్యాణం..

సాయంత్రం 5 గంటలకు నగరంలోని మంకమ్మతోట వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి టీటీడీ ఆలయ నిర్మాణ ప్రాంగణం వరకు రెండు ఏనుగులు, గుర్రాలు, కోలాట నృత్యాతో శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీనివాసుడి కల్యాణ మహోత్సవాన్ని టీటీడి అర్చకులు కన్నుల పండువగా నిర్వహించారు. కల్యాణానికి మంత్రి గంగుల కమలాకర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్‌కుమార్‌, మేయర్‌ సునీల్‌రావు తదితరులతో పాటు పద్మశాలి సమాజం వారు పట్టు వస్త్రాలు, తలంబ్రాలతో తరలి వెళ్ళ్లాు. కల్యాణంలో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందారు. గోగుల ప్రసాద్‌ బృందం ఆధ్వర్యంలో గాయనీ గాయకులు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు అలరించాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకాగా అన్నప్రసాద వితరణతోపాటు శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు.

Updated Date - 2023-06-01T00:33:12+05:30 IST