వేసవిలో మంచినీటి సరఫరాకు ప్రత్యేక ప్రణాళిక
ABN , First Publish Date - 2023-02-21T00:10:28+05:30 IST
వేసవిలో మంచినీటి సరఫరాకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మేయర్ యాదగిరి సునీల్‌రావు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 20: వేసవిలో మంచినీటి సరఫరాకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మేయర్ యాదగిరి సునీల్‌రావు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కోర్టు రిజర్వాయర్‌లో మంచినీటి సరఫరాపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రెండేళ్లుగా నగరంలో ప్రతిరోజూ మంచినీటిని అందిస్తున్నామని, త్వరలో విలీన గ్రామాల్లోనూ రోజూ మంచినీటిని సరఫరా చేస్తామని చెప్పారు. సాంకేతిక సమస్యలతో అక్కడక్కడక్కడ మంచినీటి సరఫరాలో ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. లీకేజీలు, వాల్వ్‌లు చెడిపోవడం వంటి సమస్యలపై దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఎల్‌ఎండీలో నీటి నిలువలు తగ్గుతున్నందున బూస్టర్ పంపుసెట్లు, మోటార్లు, పంపింగ్ మోటార్లను సిద్ధంగా ఉంచుకోవాలని, రిజర్వాయర్లలోకి వాటర్ ఫిల్లింగ్, సప్లయిలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు. విద్యుత్ సమస్యలతో ఇబ్బంది కలుగకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈఈ నుంచి ఏఈ వరకు వేసవి ముగిసే వరకు మంచినీటి సరఫరాపై దృష్టిపెట్టి పర్యవేక్షణ చేయాలని, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు కూడా సివిల్ వర్క్స్‌కే పరిమితం కాకుండా మంచినీటి సరఫరాపై దృష్టిసారించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వహిస్తే సంబంధిత ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వేసవి ముగిసే వరకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని ముందస్తు చర్యలతో ప్రతిరోజు సమయపాలనతో మంచినీటి సరఫరా చేస్తామని, ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోని నగరపాలక సంస్థకు సహకరించాలని మేయర్ సునీల్‌రావు కోరారు. సమావేశంలో కమిషనర్ సేవా ఇస్లావత్, ఈఈలు కిష్టప్ప, మహేందర్, డీఈలు మసూద్ అలీ, వెంకటేశ్వర్లు, లక్ష్మారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.