పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి

ABN , First Publish Date - 2023-03-25T23:46:31+05:30 IST

పోలీస్‌ స్టేషన్లకు చెందిన ఎస్‌హెచ్‌వోలు పెండింగ్‌ కేసులను పరిష్కరించేందుకు ప్రాధాన్యమివ్వాలని సీపీ ఎల్‌ సుబ్బారాయుడు అన్నారు.

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి
కానిస్టేబుల్‌ కుటుంబసభ్యులకు చెక్కును అందజేస్తున్న సీపీ సుబ్బారాయుడు

కరీంనగర్‌ క్రైం, మార్చి 25: పోలీస్‌ స్టేషన్లకు చెందిన ఎస్‌హెచ్‌వోలు పెండింగ్‌ కేసులను పరిష్కరించేందుకు ప్రాధాన్యమివ్వాలని సీపీ ఎల్‌ సుబ్బారాయుడు అన్నారు. పెండింగ్‌ కేసులను పరిమిత సంఖ్యకు పరిమితం చేయాలని చెప్పారు. కమిషనరేట్‌ కేంద్రంలో ఎస్‌హెచ్‌వోలు, కోర్టు డ్యూటీ అధికారులతో సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నేరాలను ఛేదించడాన్ని సవాల్‌గా తీసుకోవాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. చిన్న చిన్న నేర సంఘటనలను నియంత్రించేందుకు ఈ-పెట్టి కేసులను నమోదు చేయాలన్నారు. ఆకస్మిక వాహనాల తనిఖీలతోపాటు డ్రంకెన్‌ డ్రైవ్‌లను నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్‌ వారెంట్ల అమలు ద్వారా కేసుల సంఖ్య తగ్గుతుందని సూచించారు. సమర్థవంతమైన సేవలందించే అన్ని స్థాయిలకు చెందిన పోలీసులకు ప్రోత్సాహకాలను అందజేస్తామన్నారు. సాంకేతిక కారణాలతో పనిచేయని సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించాలని చెప్పారు. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో పనిచేయని సీసీ కెమెరాలను కమిషనరేట్‌ కేంద్రంలోని నిపుణులను సంప్రదించి మరమ్మతులు చేయించాలని సూచించారు. సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేసేవారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు. సమావేశంలో అడిషనల్‌ డీసీపీ (పరిపాలన) జి చంద్రమోహన్‌, ఏసీపీ పి కాశయ్య, ఎస్‌బీఐ జి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్‌ కుటుంబ సభ్యులకు సీపీ ఎల్‌ సుబ్బారాయుడు పోలీస్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ ఇన్సూరెన్స్‌ ద్వారా మంజూరైన నాలుగు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ధర్మపురి పోలీస్‌ స్టేషన్‌లో పని చేసిన కానిస్టేబుల్‌ వెంకటరమణాచారి 2022 నవంబరు 17న జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనలో మృతిచెందగా, ఆయ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో పోలీస్‌ అధికారుల అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం సురేందర్‌, సభ్యులు మధు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:46:31+05:30 IST