అభివృద్ధికి చిరునామాగా సిరిసిల్ల

ABN , First Publish Date - 2023-06-03T01:32:58+05:30 IST

ఒకప్పుడు సిరిసిల్ల అంటే అభివృద్ధికి నోచుకోని విషాద పట్టణంగా పేరుండేది. గడిచిన దశాబ్ద కాలంలో సిరిసిల్ల అన్ని మౌలిక సదుపాయలను పెంపొందిచుకుని అభివృద్ధికి చిరునామాగా ఎదిగిందని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

అభివృద్ధికి చిరునామాగా సిరిసిల్ల
మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఒకప్పుడు సిరిసిల్ల అంటే అభివృద్ధికి నోచుకోని విషాద పట్టణంగా పేరుండేది. గడిచిన దశాబ్ద కాలంలో సిరిసిల్ల అన్ని మౌలిక సదుపాయలను పెంపొందిచుకుని అభివృద్ధికి చిరునామాగా ఎదిగిందని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని అవిష్కరించి మాట్లాడారు. అంతకుముందు సిరిసిల్ల పాతబస్టాండ్‌లోని అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శనం, ప్రజాప్రతినిధుల సహకారం ప్రజా భాగస్వామ్యం తో జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు జిల్లా యంత్రాం గం కృషి చేస్తోందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల కృషి ఫలితంగా అనేక రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించి, దేశ, రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులను ప్రశంసలను జిల్లా దక్కించుకుందని అన్నారు. అన్నిరంగాల్లో దేశానికి, రాష్ట్రానికి సిరిసిల్ల అదర్శంగా నిలుస్తోందని, అనేక అవార్డులతో పాటు స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021 పోటీల్లో జాతీయ స్థాయిలో లక్ష లోపు జనాభాగల దక్షిణభారతదేశంలో పరిశుభ్రమైన పట్టణంగా, స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2022 పోటీల్లో స్వీయ స్థిరమైన నగరంగా రెండు సార్లు జాతీయ అవార్డు సొంతం చేసుకుందని అన్నారు. పట్టణ ప్రగతి ఇన్నోవేషన్‌ అవార్డుల్లో సిరిసిల్ల రాష్ట్రంలోనే మొదటి స్థానం పొందిందని అన్నారు. అస్థి పన్ను వసూళ్లలో ప్రథమ స్థానం దక్కించుకుందని అన్నారు. రూ. 61 కోట్లతో మురికినీటిని శుద్ధి చేసేందుకు సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మిస్తున్నామని అన్నారు. సిరిసిల్ల పట్టణ ప్రజలకు అహ్లాదాన్ని అందించేందుకు రూ. ఆరు కోట్లతో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును త్వరలో ప్రారంభించుకోబోతున్నట్లు తెలిపారు.

- నికర సాగు భూమి పెరుగుదల..

సాగుజలాలు, భూగర్భ జలాల లభ్యత పెరగడం వల్ల జిల్లాలో 2016లో 1 లక్షా 77 వేల 96 ఎకరాల నికర సాగు భూమి 2023 నాటికి రెండు లక్షల 40 వేల 430 ఎకరాలకు పెరిగిందని అన్నారు. రైతుబంధు పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 10 విడతల్లో సుమారు లక్షా 33 వేల 653 మంది రైతులకు 1139 కోట్ల రూపాయలను పంట పెట్టుబడి కింద అందించామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 973 ఎకరాల్లో 292 మంది రైతులు ఆయిల్‌ పామ్‌ పంటను సాగు చేశారని అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు జిల్లాలో మూడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు మాత్రమే ఉండగా, రైతుల సౌలభ్యం కోసం కొత్తగా 5 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్దాపూర్‌లో రూ. 20 కోట్లతో 25 ఎకరాల్లో అధునాతన మార్కెట్‌ యార్డును నిర్మించామన్నారు. రైతులు తాము పండించిన ఉత్పత్తులను నేరుగా విక్రయించేందుకు వీలుగా రూ 5.15 కోట్లతో సిరిసిల్లలో రైతుబజార్‌ను నిర్మించామన్నారు. జిల్లాలోని 57 క్లస్టర్‌ల పరిధిలో రైతువేదికలను నిర్మించామని,. సాగు విస్తీర్ణం పెరగడంతో నర్మాలలో 318 ఎకరాలలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నామని, రూ 150 కోట్లతో మూడు పరిశ్రమలు నిర్మిస్తున్నామని, 800 మంది స్థానికులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. జిల్లాలో నలుదిక్కులా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, వ్యవసాయ కళాశాల సమీపంలో వ్యవసాయ రీసోర్స్‌ సెంటర్‌, కోల్డ్‌ స్టోరేజ్‌ సెంటర్‌ ఏర్పాటుకు, బందనకల్‌ గ్రామంలో నూనె గింజల పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెద్దూర్‌లో అపెరల్‌ పార్క్‌, వీవింగ్‌ పార్కు, నర్మాలలో పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

- మిడ్‌ మానేరు వద్ద అతిపెద్ద ఆక్వాహబ్‌..

శ్రీ రాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ వద్ద రూ 2 వేల కోట్ల భారీ పెట్టుబడితో 10 వేల మందికి ఉపాధినిచ్చేలా 366 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద అక్వాహబ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దీని ద్వారా 5 వేల మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో రూ 1258 కోట్లు వెచ్చించి ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందిస్తున్నామని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,443 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. జిల్లాలో తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం జిల్లాలో 56,116 మందికి పింఛన్లు ఉండగా ప్రస్తుతం లక్షా 21 వేల 142 మందికి పింఛన్లు అందిస్తున్నామని అన్నారు. జిల్లాలో 26 బృందాలతో రెండో విడత కంటి వెలుగు క్యాంపుల ద్వారా 255 గ్రామాలు, సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో 2 లక్షల 76 వేల 884 మందికి కంటి పరీక్షలు చేసి, 47 వేల 194 మందికి రీడింగ్‌ గ్లాసులు, 40 వేల 987 మందికి పాయింట్‌ గ్లాసులు అందజేశామని అన్నారు. వరిసాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అన్నీ విధాలుగా అండగంగా ఉంటుందని, ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని కేటీఆర్‌ అన్నారు. జిల్లాలో 255 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 29,968 రైతుల నుంచి 1.83 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని రూ 119 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో 60 గ్రామాలకు చెందిన 1,614 మంది గిరిజన రైతులకు 2,858 ఎకరాలకు సంబంధించిన పోడు భూముల పట్టాలను త్వరలోనే అందజేస్తామని అన్నారు.

- వేములవాడ అభివృద్ధికి కృషి..

జిల్లా కేంద్రం సిరిసిల్లతో సమాంతరంగా ధార్మిక క్షేత్రం వేములవాడను ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నామని కేటీఆర్‌ అన్నారు. గుడిచెరువు, ట్యాంక్‌ బండ్‌, మూలవాగు బండ్‌, ఫుట్‌ పాత్‌ల అభివృద్ధి నంది కమాన్‌ జంక్షన్‌, ఇతర జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణ పనులు, డంప్‌ యార్డు నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ అఖిల్‌మహాజన్‌, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు, అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్‌, ఖీమ్యానాయక్‌, నాస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T01:32:58+05:30 IST