న్యాయవాదుల సహకారంతో కేసుల పరిష్కారం

ABN , First Publish Date - 2023-03-25T23:43:59+05:30 IST

న్యాయవాదుల సహకారంతోనే కేసులు త్వరగా పరిష్కారమవుతాయని హైకోర్టు జడ్జి (జిల్లా పరిపాలన న్యాయమూర్తి) జస్టిస్‌ కన్నెగంటి లలిత తెలిపారు.

న్యాయవాదుల సహకారంతో కేసుల పరిష్కారం
మాట్లాడుతున్న హైకోర్టు జడ్జి జస్టిస్‌ కన్నెగంటి లలిత

కరీంనగర్‌ లీగల్‌, మార్చి 25: న్యాయవాదుల సహకారంతోనే కేసులు త్వరగా పరిష్కారమవుతాయని హైకోర్టు జడ్జి (జిల్లా పరిపాలన న్యాయమూర్తి) జస్టిస్‌ కన్నెగంటి లలిత తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో నిర్మించిన డిజిటల్‌ లైబ్రరీ భవనాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కరీంనగర్‌ బార్‌ అసోసియేషన్‌ చైతన్యవంతమైనదని, పరిపాలన న్యాయమూర్తిగా కరీంనగర్‌కు మొదటిసారి రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తమ కాలంలో లైబ్రరీలు ఎక్కువ లేవని, ఇప్పుడు వచ్చిన డిజిటల్‌ లైబ్రరీలు న్యాయవాదులు వృత్తిలో రాణించేందుకు ఎంతో తోడ్పడుతాయన్నారు. జిల్లా పరిపాలన జడ్జిగా తనవంతు పూర్తి సహకారాన్ని అందించనున్నట్లు తెలిపారు. హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలతో కోర్టుల్లో డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం పెరిగిందన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎర్రం రాజారెడ్డి మాట్లాడుతూ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుల్లో కేసుల పెండెన్సీ ఎక్కువగా ఉందని, మరో నాలుగు కోర్టులు మంజూరు చేయాలని కోరారు. రెండు కోర్టుల్లో జూనియర్‌ సివిల్‌ జడ్జిలను నియమించాలన్నారు. అనంతరం జిల్లా జడ్జి బి ప్రతిమ, అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు మాట్లాడారు.

Updated Date - 2023-03-25T23:43:59+05:30 IST