సంక్రాంతి శోభ
ABN , First Publish Date - 2023-01-14T00:26:39+05:30 IST
పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలైంది. మూడు రోజుల సంబరం శనివారం బోగి వేడుకలతో ప్రా రంభం కానుంది. ఆదివారం సంక్రాంతి, సోమవా రం కనుమ పండుగ నిర్వహించుకోనున్నారు.
- పల్లెలకు వస్తున్న పట్నం
- మూడు రోజుల సంబరం ఆరంభం
- లోగిళ్లలో రంగు రంగుల ముగ్గులు
- నేడు బోగీ... రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలైంది. మూడు రోజుల సంబరం శనివారం బోగి వేడుకలతో ప్రా రంభం కానుంది. ఆదివారం సంక్రాంతి, సోమవా రం కనుమ పండుగ నిర్వహించుకోనున్నారు. పండుగను సొంత ఊళ్లలో జరుపుకోవడానికి జనం పట్టణాలు వదిలి. కుటుంబాలతో పల్లెలకు చేరు కుంటున్నారు. రెండు రోజులుగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్, ఇతర కూడళ్లు జనంతో రద్దీగా కనిపి స్తున్నాయి. పట్టణాల నుంచి కుటుంబసభ్యుల రాక తో ప్రతీ ఇల్లు సందడిగా మారింది. పిండివంటల ఘుమఘుమలు, ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, బసవ్వన్నలతో పల్లెలు, పట్టణాలు ప్రత్యేక శోభను సంతరించు కోనున్నాయి. ఉత్తరాయన పుణ్య కాలంలో మార్గశిర పుష్పమాసాల్లో సం క్రాంతి వస్తుంది. సూర్యుడు ఒక్కో మాస ంలో ఒక్కో రాశిలోకి వస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశి లోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతిగా చెప్పుకుంటారు. సంక్రాంతి ఎన్నెన్నో సంప్రదాయాలతో ముడిపడి ఉంది. ఆధునిక పోకడలతో పండుగలో కొంత కళ తగ్గిపోతున్నా రంగవల్లులు తీర్చి దిద్దడంలో మహిళలు మాత్రం పోటీ పడుతూనే ఉన్నారు. చిన్నారులు పంతగులతో సందడి చేస్తున్నారు. సంక్రాంతిలో భాగంగా ఇళ్ల ముందు వేసే ముగ్గుల్లో గొబ్బెమ్మలు ముఖ్యమైనవి. ఆవుపేడతో ముద్దలు చేసి ముగ్గుల మధ్యన పెట్టి పసుపు, కుంకుమ అద్ది పిండితో ముగ్గులు వేసి ఏర్పాటు చేస్తారు. ఈ గొబ్బెమ్మను గౌరి దేవిగా భావిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో ఆటా పాటలతో సంబరాలు జరుపు కుంటారు. పసుపు, కుంకుమ పెసరపప్పు, శనిగలు, మర మరాలు (పెలాల), అటుకులు మొదలైన వాటితో పూజలు చేసి పంచుకుంటారు.
నేడు బోగి సంబరాలు
సంక్రాంతి సంబరాలు శనివారం బోగిమంటలతో మొదలు కానున్నాయి. తెల్లవారుజామునే ఇళ్లలో ఉన్న పాత వస్తువులను కుప్పగా పోసి బోగిమంటలు వేస్తారు. పాత అలవాట్లకు స్వస్తి పలికి కొత్త ధనాన్ని, కొత్త ఆలోచనలు కోరుకొంటూ బోగితో సంక్రాంతిని స్వాగతిస్తారు. ప్రతీ ఇంటి ముందు బోగిమంటలు వేస్తారు. పల్లెల్లో బోగి మంటల సాంప్రదాయం ఇంకా ఉన్నా పట్టణాల్లో మాత్రం కనుమరుగైపోయింది. బోగి మంటల చుట్టూ తిరుగుతూ బోగి మంటలతో కాగిన నీళ్లతో స్నానం చేస్తారు. ఈ స్నానాలతో దుష్టశక్తులు తొలగిపోయి సంతోషంగా ఉంటారని భావిస్తారు.
బోగిపండ్లతో చిన్నారులకు ఆశీర్వాదం
బోగిపండ్లు అంటే రేగు పండ్లు. సూర్యుడి రూపం రంగు పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలు కలిపి పిల్లలపై పోసి ఆశీర్వదిస్తారు. పిల్లలు కూడా ఎంతో సంబరంగా వేడుకలో పాల్గొంటారు. సాయంత్రం వేళ మహిళలు బొమ్మల కొలువు నిర్వహిస్తారు.
నోరూరించే ఘుమఘుమలు
సంక్రాంతి అంటేనే ముందుగా అందరికీ గుర్తొచేది పిండి వంటలు. నోరూరించే ఘుమఘుమలు స్వాగతం పలుకుతాయి. ప్రతి ఇంటా సకినాలు, గారెలు, అరిసెలు వంటి రకరకాల పిండి వంటలను తయారు చేస్తారు. చిన్నాపెద్ద ఎంతో ఇష్టంగా తింటారు. సంక్రాంతి పండుగ పిండివంటల్లో తెలంగాణకు ఓ ప్రత్యేకత ఉంది. బియ్యపు పిండి ప్రధాన ముడిసరుకుగా కరకరలాడే సకినాలు తయారు చేస్తారు. తెలంగాణలో సకినాల సంక్రాంతిగా చెప్పుకునే వరకు వెళ్లింది. సంక్రాంతికి పది రోజుల ముందు నుంచే సకినాలు, గ్యారెలు, అరిసెలు, గరిజలు, మురుకులు, చేగోడిలు, లడ్డూలు, పూస, చెక్కెర పల్లీలు వంటి పిండివంటల తయారీతో మహిళలు బిజీ బిజీగా కనిపిస్తారు.