తెల్లపూల దుఃఖం

ABN , First Publish Date - 2023-03-02T01:14:18+05:30 IST

పత్తి రైతులకు, కుటుంబసభ్యులకు కొత్త దుఃఖాన్ని తెచ్చి పెట్టింది. పత్తి ధర పడిపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఇళ్లలోనే పత్తిని నిల్వ చేసుకున్నారు. పత్తి ధర ఎప్పుడు పెరుగుతుందో ఎలా అమ్ముకోవాలో తెలియక ఆందోళన పడుతున్న రైతులు ఇప్పుడు ఒంటి నిండా దురద సమస్యలతో తండ్లాడుతున్నారు.

 తెల్లపూల దుఃఖం
ఇల్లంతకుంటలో ఎలర్జీతో బాధపడుతున్న బాలుడు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పత్తి రైతులకు, కుటుంబసభ్యులకు కొత్త దుఃఖాన్ని తెచ్చి పెట్టింది. పత్తి ధర పడిపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఇళ్లలోనే పత్తిని నిల్వ చేసుకున్నారు. పత్తి ధర ఎప్పుడు పెరుగుతుందో ఎలా అమ్ముకోవాలో తెలియక ఆందోళన పడుతున్న రైతులు ఇప్పుడు ఒంటి నిండా దురద సమస్యలతో తండ్లాడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రధానంగా వానాకాలం సీజన్‌లో వరి, పత్తి సాగుపైనే ఆధారపడతారు. వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయగా పత్తి అమ్మకానికి ప్రైవేట్‌ వ్యాపారుల పైనే రైతులు ఆధారపడుతున్నారు. ఇప్పటికే అధిక వర్షాలు, పత్తి, తెగుళ్ల బారిన పడి దిగుబడి నష్టాన్ని చవి చూశారు. పత్తి ఏరే సమయంలో గ్రామాలకు వచ్చిన వ్యాపారులు ఆ తరువాత ముఖం చాటేశారు. దీంతో ఇంట్లో పత్తి నిల్వ ఉండడంతో రైతులు చిన్నపిల్లలు, డస్ట్‌ ఎలర్జీకి గురవుతున్నారు. పెద్దవాళ్లు కొంతమేరకు తట్టుకునే శక్తి ఉన్నా చిన్నారులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఒంటిపై దద్దుర్లురావడంతో ఇబ్బందులు పడుతున్నారు. చర్మ వ్యాధి నిపుణులు ఇళ్లలో నిల్వ ఉన్న పత్తి వల్ల వచ్చే డస్ట్‌తోనే ఎలర్జీ వస్తుందని చెబుతున్నారు. ఇంట్లో నుంచి పత్తిని ఎలా తొలగించుకోవాలో తెలియని పరిస్థితి ఉంది. దీనికి తోడు ఇంట్లోనే పత్తి నిల్వలు ఉండడం వల్ల షార్ట్‌ సర్క్యూట్‌తో పత్తి దగ్ధమవుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు ప్రమాదాల భయానికి తోడుగా చర్మ సమస్యలతో రైతు కుటుంబాలకు ఇబ్బందులు బాధిస్తున్నాయి.

- జిల్లాలో 54 వేల ఎకరాల్లో పత్తి సాగు...

జిల్లాలో వానాకాలం సీజన్‌లో 2.35 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా వరి 1.77 లక్షల ఎకరాలు, పత్తి 54,489 ఎకరాలు సాగు చేశారు. ఇల్లంతకుంటలో 12,686 ఎకరాలు, గంభీరావుపేటలో 753 ఎకరాలు, ముస్తాబాద్‌లో 1,092 ఎకరాలు, సిరిసిల్లలో 1,003 ఎకరాలు, తంగళ్లపల్లిలో 1,546 ఎకరాలు, వీర్నపల్లిలో 784 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 4,530 ఎకరాలు, బోయినపల్లిలో 6,677 ఎకరాలు, చందుర్తిలో 6,699 ఎకరాలు, కోనరావుపేటలో 5,442 ఎకరాలు, రుద్రంగిలో 3,568 ఎకరాలు, వేములవాడలో 5,295 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 4,407 ఎకరాల్లో సాగు చేశారు. మొక్కదశలోనే వర్షాలకు పత్తి దెబ్బతిని అకుముడత, రసం పీల్చే పురుగు, గులాబీ తెగుళ్లతో దిగుబడిపై ప్రభావం చూపింది. ఎకరానికి ఎనిమిది నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ఆరు నుంచి పది క్వింటాళ్ల వరకే దిగుబడి వచ్చింది. మరోవైపు సీజన్‌ ప్రారంభంలో క్వింటాలుకు పదివేల రూపాయల నుంచి 14 వేల రూపాయల వరకు ధర పలికింది. ఇప్పుడు ఏడు వేల రూపాయల నుంచి 7,500 రూపాయల వరకు కూడా కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో పత్తి నిల్వలు ఇళ్లలోనే రైతులను దిగాలు పరుస్తున్నాయి. మరోవైపు చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఎలర్జీ వంటి అనారోగ్య పరిస్థితులకు గురవుతున్నారు.

Updated Date - 2023-03-02T01:14:18+05:30 IST