జిల్లాలో పెరుగుతున్న ఫ్లూ జ్వరాలు

ABN , First Publish Date - 2023-03-18T23:22:05+05:30 IST

జిల్లాలో ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో జిల్లా వాసులు బాధపడుతున్నారు.

జిల్లాలో పెరుగుతున్న ఫ్లూ జ్వరాలు
జిల్లా ఆసుపత్రిలోని పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులు

సుభాష్‌నగర్‌, మార్చి 18: జిల్లాలో ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో జిల్లా వాసులు బాధపడుతున్నారు. వేసవి కాలంలో సాధారణంగా వైరల్‌ జ్వరాలు వస్తుంటాయి. ఇందుకు విరుద్ధంగా ఫ్లూ లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.. జిల్లా ఆసుపత్రికి ప్రతిరోజు 800పైగా ఓపీ పేషంట్లు వస్తున్నారు. అందులో 400లకు పైగా జ్వరంతో బాదపడుతున్నవారే ఉన్నారు వాతావరణంలో వచ్చే మార్పులతో జ్వరాలు వస్తుంటాయని, ఫ్లూ లక్షణాలతో వచ్చే జ్వరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జిల్లా ఆసుపత్రితోపాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో సుమారు రోజుకు రెండు వేలకు పైగా ఓపీ పేషంట్లు వస్తున్నారు. వారిలో వెయ్యికిపైగా ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఫ్లూ బాధితుల్లో పిల్లల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. జిల్లా ఆసుపత్రిలోని పిల్లల వార్డులోని అన్ని బెడ్లు జ్వరంతో బాధపడుతున్న చిన్నారులతో నిండిపోయింది.

ఐదు రోజుల వరకు జ్వరం.....

ఫ్లూ జ్వరం ఐదు రోజుల వరకు ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. సకాలంలో డాక్టర్‌ను సంప్రదించి జ్వరంతోపాటు దగ్గు, జలుబు, పెరుగకుండా చికిత్స పొందాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలో ఇంతవరకు హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కేసులు నమోదు కాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఆందోళన చెందవద్దు

- జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల

జిల్లాలో హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కేసులు ఇప్పటి వరకు నమోదు కాలేదు. ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నవారు ఆసుపత్రిలో చేరుతున్నారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దు

ఫ జాగ్రత్తలు తీసుకోవాలి..

- డాక్టర్‌ రఘురామన్‌, సీనియర్‌ ఫిజీషియన్‌

హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కేసులు నమోదు కానప్పటికి ప్రజలు జాగ్రతలు పాటించాలి.. తరచుగా చేతులు కడుక్కోవాలి, ఫేసు మాస్కులు పెట్టుకోవాలి. గుంపులుగా ఉన్న చోటకు వెళ్లవద్దు. తుమ్మినపుడు, దగ్గినపుడు చేతిని అడ్డు పెట్టుకోవాలి, నీటిని ఎక్కువగా తీసుకోవాలి. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతనే మందులు వాడాలి.

Updated Date - 2023-03-18T23:22:05+05:30 IST