Share News

ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రేవంత్‌రెడ్డి, సంజయ్‌

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:28 AM

అప్పులు..అప్పులు అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌ తెలంగాణ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కరీంనగర్‌ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

 ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రేవంత్‌రెడ్డి, సంజయ్‌
సిరిసిల్లలో మాట్లాడుతున్న వినోద్‌కుమార్‌

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 17 : అప్పులు..అప్పులు అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌ తెలంగాణ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కరీంనగర్‌ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ తమ పార్టీపైనా, కేసీఆర్‌పైనా అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలను పదేపదే చెప్పడంతో ఆ అంశాలు సోషల్‌ మీడియా ద్వారా పట్టణాలు, గ్రామాల్లోకి వెళ్తున్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఓ గ్రామానికి వెళితే ఓ వృద్ధురాలు తనతో మాట్లాడుతూ అవి చేసినం.. ఇవి చేసినం.. అంటున్నారు... కేసీఆర్‌ ఒక్కొక్కరిపై ఐదు లక్షల అప్పులు మోపిండంట.. నిజమేనా నిలదీసిందన్నారు. దురదృష్టవశాత్తు ఈ ప్రచారాన్ని తమ నాయులు, కార్యకర్తలు తిప్పికొట్టలేకపోయారని తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో బంగారు పల్లెంలో తెలంగాణను అప్పగించినట్లు తాను మాట్లాడానని, ఆ వ్యాఖ్యను ఎంపీ బండి సంజయ్‌ తప్పుబడుతూ ఉద్యోగులకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జీతాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారని అన్నారు. ఎంపీ బండి సంజయ్‌కి సమాధానం ఇచ్చేందుకు ఈ రోజు సిరిసిల్లలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్రలోని మోదీ ప్రభుత్వంలో ఆర్‌బీఐ లెక్కలను ప్రచురించిందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం(ఎస్‌ఓటీఆర్‌)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 84.2 శాతం రాష్ట్ర సొంత డబ్బులేనని ప్రకటించిందన్నారు. దేశ వ్యాప్తంగా హర్యాన రాష్ట్రం 86.9 శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా తెలంగాణ రాష్ట్ర 84.2 శాతంతో ద్వితీయ స్థాయంలో ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వాలు పాలించే రాష్ట్రాలు గుజరాత్‌, గోవా, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు తెలంగాణకు దరిదాపులో లేవన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 30 శాతం కూడా ఎస్‌వోటీఆర్‌ లేదని, కేంద్ర ప్రభుత్వమే 70 శాతం నిధులను సమకూరుస్తోందని అన్నారు. బీజేపీ ప్రాంత రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. ఇది బీజేపీ రాష్ట్ర పరిపాలనని, ఇప్పుడు బండి సంజయ్‌ లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటటువంటి గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడెక్టులో దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి 27.8 శాతం మాత్రమే అప్పులు ఉన్నాయని, బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా అప్పలు ఉన్నాయని అన్నారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ 27వ స్థానంలో ఉందని తెలంగాణ కంటె మరో 26 రాష్ట్రాలు ఎక్కువ అప్పులు తీసుకున్నాయని అన్నారు. తెలంగాణకు 2023 మార్చి వరకు 3,89,675 కోట్లు అప్పులు ఉన్నాయన్నారు. నిన్న తెలంగాణ శాసన సభలో బీఆర్‌ఎస్‌ శాసన సభ్యులు అప్పులపై వివరంగా చెప్పారన్నారు. అప్పులతోపాటు తెలంగాణ స్థిరాస్థులు, కాళేశ్వరం, పాలమూరు ఎత్తి పోతల పథకం, సీతమ్మ, భక్త రామదాస్‌ ప్రాజెక్టులు, సబ్‌ స్టేషన్‌ల నిర్మాణాలతో ఈ రోజు వాటి విలువ ఎంతో పెరిగిందన్నారు. అందుకే ‘బంగారు పల్లెంలో తెలంగాణ అప్పజెప్పినం’ అని అన్నామని దీనిపై చర్చ జరగాలని అన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీ పథకాలు 60 హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయలేక అప్పుల రాష్ట్రం అని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బండి సంజయ్‌ కరీంనగర్‌లో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పని అయిపోయిందని పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీకేనని అనడం హాస్యాస్పదమని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలలో రాష్ట్రంలో బలమైన పార్టీ బీఆర్‌ఎస్‌ మాత్రమేనన్నారు. బీజేపీకి కాంగ్రెస్‌ సపోర్టు చేయడంతోనే వల్లే గతంలో అదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌లో బీజేపీ ఎంపీలు గెలిచారన్నారు. బీఆర్‌ఎస్‌కు అక్కడక్కడ బీజేపీ, కాంగ్రెస్‌తో పోటీ ఉంటుందని మరి కొన్ని ప్రాంతాల్లో రెండు పార్టీలతో పోటీ ఉంటుందని అన్నారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు పోతాయని, కరీంనగర్‌లో బండి సంజయ్‌ను ఎదుర్కొంటామని అన్నారు. తెలంగాణలో తాము జీతాలు ఇవ్వలేదని చెబుతున్న బండి సంజయ్‌ బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో ఉద్యోగులకు జీతాలు కేంద్ర ప్రభుత్వ పైసలేనని తెలుసుకోవాలన్నారు. తెలంగాణలో తాము ఉద్యోగుల జీతాలు ఎగపెట్టలేదన్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణంతో ఐదు రోజులు ఉద్యోగుల జీతాలు ఆలస్యమైందన్నారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ అప్పులు అప్పులు అంటూ అనవసరంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. అప్పులు కట్టే శక్తి తెలంగాణ రాష్ట్రానికి ఉందన్నారు. సమావేశంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి, సెస్‌ చైర్మ్‌న్‌ చిక్కాల రామారావు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ లింగంపల్లి సత్యనారాయణ, కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ సలీం, సిరిసిల్ల అర్బన్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ నేరెళ్ల శ్రీకాంత్‌గౌడ్‌, నాయకులు బొల్లి రామ్మోహన్‌, గజభీంకార్‌ రాజన్న, రాఘవరెడ్డి, శ్రావణ్‌రావు, అడగట్ల మురళి, బండ నర్సయ్య యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:28 AM